పార్లమెంట్ లో అన్ని అంశాలపై చర్చకు సిద్దమే 

సోమవారం నుండి జరుగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.  సమావేశాల ప్రారంభానికి ముందు ప్రభుత్వం ఆదివారం నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో మొత్తం 31 పార్టీలకు చెందిన 42 మంది నేత‌లు పాల్గొన్నారు.

అయితే, కొన్ని అనివార్య కార‌ణాల రీత్యా ప్ర‌ధాని నరేంద్ర‌మోదీ మాత్రం ఈ స‌మావేశానికి రాలేదు. ప్రభుత్వంవైపు నుంచి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ హాజరయ్యారు. రాజ్య సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ సమావేశంలో పాల్గొని, ఏదైనా సమాచారాన్ని తమతో పంచుకుంటారని తాము భావించామని చెప్పారు. 

మూడు సాగు చట్టాల రద్దు గురించి మరిన్ని వివరాలు అడగాలని తాము అనుకున్నామని, ఈ చట్టాలను వేరొక రూపంలో మళ్ళీ తీసుకొచ్చే అవకాశం ఉందనే భయాందోళన వ్యక్తమవుతోందని తెలిపారు. సాగు చట్టాలపై నిరసనల సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. 

పెట్రోలు ధరల పెరుగుదల, చైనాతో సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలను కూడా ప్రస్తావించింది. వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కోసం చట్టబద్ధ తీర్మానాన్ని తేవడం కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని వైసిపి  కోరింది. 

పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ మాట్లాడుతూ అఖిల పక్ష సమావేశానికి ప్రధాన మంత్రి హాజరయ్యే సంప్రదాయం లేదని స్పష్టం చేశారు. ఈ సంప్రదాయాన్ని నరేంద్ర మోదీయే ప్రారంభించారని పేర్కొన్నారు. ఆదివారం జరిగిన సమావేశానికి మోదీ హాజరుకాలేకపోయారని తెలిపారు. 

రాజ్యసభ చైర్మన్, లోక్ సభ స్పీకర్ అనుమతించిన ఏ అంశంపై అయినా నిర్మాణాత్మక చర్చకు ప్రభుత్వం సిద్దమే అని ఆయన చెప్పారు. ద్రవ్యోల్బణం, ఇంధన ధరల పెంపు, రైతుల సమస్యలు, పిఎస్‌యుల పెట్టుబడుల ఉపసంహరణ, బిఎస్‌ఎఫ్ అధికార పరిధి, పెగాసస్, కరోనా వంటి అనేక అంశాలు ఈరోజు జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి. 

రైతుల సమస్యలపై, బీఎస్ఎఫ్ అధికార పరిధిపై మాట్లాడేందుకు తమకు అనుమతి లేదని ఆరోపిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ అఖిలపక్ష సమావేశం నుంచి వాకౌట్ చేసింది. వచ్చే సమావేశాలలో ఎంఎస్‌పి బిల్లును ప్రవేశపెట్టాలని తాను డిమాండ్ చేశానని, అయితే దానిపై మాట్లాడేందుకు అనుమతించలేదని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ చెప్పారు. 

బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం శీతాకాల సమావేశాలకు భారీ ఎజెండాను తయారు చేసింది. శాసన వ్యవహారాలతో పాటు 26 కొత్త బిల్లులు ఉన్నాయి. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే బిల్లు ప్రాధాన్యతపై సమావేశాల మొదటి రోజున ప్రవేశపెట్టనున్నారు. ఈ వారం ప్రారంభంలో ఈ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఎజెండాలో క్రిప్టోకరెన్సీ, అధికారిక డిజిటల్ కరెన్సీ బిల్లు, 2021 నియంత్రణ కూడా ఉంది.