
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్ కు ఓ హెచ్చరిక లాంటిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ పేర్కొన్నారు. భారత్‌లో తగిన కరోనా జాగ్రత్తలు పాటించకపోతే ముప్పు తప్పదని ఆమె హెచ్చరించారు. అలాగే కొత్త వేరియంట్ కట్టడికి ఆమె పలు సూచనలు చేశారు.
ప్రతి ఒక్కరూ కట్టుదిట్టమైన కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా మాస్కులు ధరించాలని ఆమె చెప్పారు. మాస్కులనేవి జేబులో ఉండే వ్యాక్సిన్లలాంటివని సౌమ్య స్వామినాథన్ చెప్పుకొచ్చారు. వ్యాక్సినేషన్‌కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె సూచించారు. కొత్త వేరియంట్ స్వభావాన్ని గుర్తించేందుకు మరింత అధ్యయనం అవసరమని ఆమె చెప్పారు.
ఇక కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దక్షిణాఫ్రికాలో అస్పష్టంగా ఉందని అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ పేర్కొన్నారు. ఈ మేరకు వివిధ అంశాలపై యూఎస్ శాస్త్రవేత్తలు.. దక్షిణాఫ్రికాలోని సహచరులతో చురుగ్గా సంప్రదింపులు చేపడుతున్నట్లు తెలిపారు.
రాష్ట్రాలకు కేంద్రం లేఖ
ఇలా ఉండగా, ఒమిక్రాన్‌పై అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖలు రాశారు. కొత్త వేరియంట్ దేశంలో ప్రవేశించే ప్రమాదం పొంచి ఉన్నందున ప్రభుత్వాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాసిన లేఖల్లో రాజేశ్ భూషణ్ కోరారు.
కరోనా నిబంధనలన కఠినతరం చేయాలని, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బయటపడితే ఆ వైరస్ సోకిన వారిపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. అదేవిధంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగాన్ని మరింత పెంచాలని పేర్కొన్నారు.
కొన్ని రాష్ట్రాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షల సంఖ్య తగ్గినట్టు గుర్తించామని, కాబట్టి కరోనా పరీక్షలను పెంచాలని ఆదేశించారు. ముఖ్యంగా హాట్ స్పాట్లను గుర్తించి నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు. పాజిటివిటీ రేటు 5 శాతం కంటే ఎక్కువున్న ప్రాంతాలపై రాష్ట్రాలు దృష్టి సారించాలని పేర్కొన్నారు.
అలాగే గతంలోని అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తగినంత వైద్య సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కేంద్రం అందజేసిన నిధులను సమర్థవంతంగా వైద్య సదుపాయాల కల్పన కోసం వినియోగించాలని చెప్పారు. కొత్త రకం మ్యుటేషన్లను గుర్తించే జీనోమ్-సీక్వెన్సింగ్ పరీక్షలను పెంచాలని రాష్ట్రాలకు సూచించారు. దీనికోసం దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్షియం ల్యాబులను వినియోగించుకోవాలని చెప్పారు.
అంతర్జాతీయ విమానాలపై పునరాలోచన
మరోవంక, అంతర్జాతీయ విమానాల పునరుద్ధరణపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తుండటంతో అంతర్జాతీయ విమానాల పునఃప్రారంభ తేదీపై సమీక్షిస్తున్నది. అంతర్జాతీయ విమానాలపై నిషేధం కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
కరోనా నేపథ్యంలో గత ఏడాది మార్చి 23 నుంచి సుమారు 20 నెలలుగా అంతర్జాతీయ విమానాలను నడపడం లేదు. 31 దేశాలతో బబుల్ ఒప్పందం మేరకు గత ఏడాది జులై నుంచి కొన్ని సర్వీసులు నడుస్తున్నాయి. కాగా, దేశంలో కరోనా పరిస్థితి అదుపులోకి రావడంతో డిసెంబర్ 15 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తామని ఈ నెల 26న కేంద్రం ప్రకటించింది.
దక్షిణాఫ్రికా, హాంకాంగ్, బోట్స్‌వానా నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధించేందుకు కేంద్రం నుంచి అనుమతి కోరామని కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌బొమ్మై తెలిపారు. కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు ఆ దేశాల్లో నమోదు కావడంతో ఇప్పటికే యూరోపియన్ దేశాలు ఆంక్షలు విధించాయని ఆయన గుర్తు చేశారు.
More Stories
అరుణాచల్ పై ‘జీ20’ సాక్షిగా చైనాకు భారత్ ఝలక్
అరెస్ట్ చేయొద్దన్న కవిత అభ్యర్థనకు `సుప్రీం’ తిరస్కరణ
సావర్కర్ పై రాహుల్ వాఖ్యలపట్ల ఉద్ధవ్ ఆగ్రహం!