ఎస్సీ లను మోసం చేస్తే తీవ్ర పరిణామాలు… బిజెపి హెచ్చరిక

ఎస్సీ లను మోసం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును హెచ్చరించింది. సీఎం కేసీఆర్ దళిత ద్రోహిగా మారారని పేర్కొంటూ దళిత బంధు నెపంతో ఎస్సీ సబ్ ప్లాన్, కార్పొరేషన్ల నిధులను దారిమళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది.
 
రైతులకు ఒకే విడతలో రుణమాఫీ చేయాలని, వ్యవసాయ ఆదారిత పరిశ్రమలను ప్రోత్సాహించాలని, వర్షానికి తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రెండు రోజుల సమావేశం డిమాండ్ చేసింది. రైతుల ప్రత్యామ్నాయ పంటల కోసం సబ్సిడీ పై విత్తనాలు, వ్యవసాయ పరికరాలు అందించాలని కార్యవర్గం తీర్మానంలో ప్రస్తావించింది. వడ్డీలేని పంట రుణాలు ఇవ్వాలని, ఫసల్ బీమా యోజన అమలు చేయాలని కోరింది. 
 
ఫీజ్ రీయింబర్స్‌మెంట్, అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధులు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇసుక అక్రమ వ్యాపారం టీఆర్ఎస్ నాయకులకు ఆదాయంగా  మారిందని, ఇసుక మైనింగ్ టీఆర్ఎస్ మాఫియా చేతుల్లోకి వెళ్లిందని రాష్ట్ర బీజేపీ నేతల ఆరోపించారు. 
 
గంజాయితో పాటు ఇతర మాదకద్రవ్యాల వ్యాపారం వెనుక ఉన్న శక్తులపై రాష్ట్ర సర్కారు ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెవెన్యూ సంస్కరణల పేరుతో కేసీఆర్ తుగ్లక్ నిర్ణయాలు తీసుకున్నారని, ధరణి పేరుతో టీఆర్ఎస్ నాయకులు భూ దందాలకు పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గం ఆరోపించింది. ధరణి లోపాలను అడ్డుపెట్టుకుని అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని పేర్కొంది. 
 
హైదరాబాద్ చుట్టుపక్కల విలువైన భూములను టీఆర్ఎస్ అవినీతికి కేంద్రాలుగా మార్చుకుందని పలువురు నేతలు  ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కుటుంబమే ల్యాండ్ కన్వర్షన్ కోసం లంచాలు డిమాండ్ చేస్తోందని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి ఇది పరాకాష్ట అని విమర్శించింది. 

ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంలో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయ్యిందని బీజేపీ కార్యవర్గం ధ్వజమెత్తింది.  వెంటనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడంతో పాటు ఇన్నాళ్లుగా యువతకు ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతి బకాయిలను కూడా చెల్లించాలని డిమాండ్ చేసింది. ఉద్యోగ నియామక క్యాలెండర్ విడుదల చేసి, ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

ఓటమి నుండి దృష్టి మళ్లించేందుకే ధాన్యం వివాదం 

హుజూరాబాద్‌ ఓటమి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే కేసీఆర్‌ ధాన్యం కొనుగోలు అంశం తెరమీదికి తెచ్చి ధర్నాలు చేస్తున్నారని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆరోపించారు. నాలుగు సంవత్సరాలుగా ఎఫ్‌సీఐ కొనుగోలు చేసిన బాయిల్డ్‌ రైస్‌ గోదాముల్లో నిండిపోయిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పంటలపై ఏనాడూ ఆంక్షలు విధించలేదని ఆయన స్పష్టం చేశారు. 

పైగా, పెరిగిన యూరియా ధరలను తగ్గించిందని తెలిపారు. పంటల బీమా పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ధాన్యం, రా రైస్‌ను కొనుగోలు చేస్తుందని చెప్పారు. తెలంగాణలో ఆయుష్మాన్‌ భారత్‌ అమలు ఏమైందని కేంద్ర మంత్రి  ప్రశ్నించారు. 

తెలంగాణలో ఆర్థిక రంగం దివాలా తీసిందని, పాలన నియంత్రణ తప్పిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. డబ్బులన్నీ కాళేశ్వరం ప్రాజెక్టులో ఖర్చు పెట్టినట్లు చెబుతున్నారని, ఆ ప్రాజెక్టుతో ప్రయోజనం ఏమీ లేదని చెప్పారు. రాష్ట్రంలో కనీసం మధ్యాహ్న భోజన పథకం బిల్లులు కూడా చెల్లించలేని దుస్థితి ఏర్పడిందని, కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఈటల వివరించారు.