ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన పది శాతం సుంకాన్ని అంతర్జాతీయ వాణిజ్య న్యాయస్థానం 2-1 మెజారిటీతో కొట్టివేసింది. అడ్డగోలుగా విధించిన ఈ సుంకాలు చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. వాణిజ్య భాగస్వామ్య దేశాలపై ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలు చెల్లబోవని అమెరికా సుప్రీంకోర్టు ఫిబ్రవరిలోనే తీర్పు చెప్పిన విషయం తెలిసిందే.
దీంతో ట్రంప్ ప్రభుత్వం మరోసారి ఆయా దేశాలపై పది శాతం చొప్పున తాత్కాలిక సుంకాలు విధించింది. ఇవి జూలై 24 వరకూ అమలులో ఉంటాయి. ట్రంప్ విధించిన పది శాతం సుంకాలను వ్యతిరేకిస్తూ అమెరికాలోని 24 రాష్ట్రాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. దీనిపై తాజాగా విచారణ జరిపిన ఫెడరల్ కోర్టు ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేసింది. అధ్యక్షుడికి ఉన్న విస్తృతాధికారాలతో 1974 నాటి వాణిజ్య చట్టంలోని సెక్షన్ 122 కింద సుంకాలను విధించారని ప్రభుత్వం వాధించింది.
న్యాయస్థానం ఆ చట్టం చెల్లింపుల సంక్షోభం ఏర్పడిన సమయంలో మాత్రమే ఉపయోగించాలని, ప్రస్తుత పరిస్థితికి అది వర్తించదని స్పష్టం చేసింది. సుంకాలపై అధ్యక్షుడికి అమెరికా ప్రతినిధి సభ కల్పించిన అధికారాలను ట్రంప్ అతిక్రమించారని, ఆయన విధించిన టారిఫ్‌లు చట్టవిరుద్ధ మైనవని తీర్పు చెప్పింది. ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించగా, ఒకరు మాత్రం దానిని సమర్ధించారు. న్యాయస్థానం ఐదు రోజుల్లో తీర్పు అమలు చేయాలని ఆదేశించింది.
అయితే కోర్టు ఉత్తర్వులు కేవలం రెండు చిన్న వ్యాపారాలకు, వాషింగ్టన్ రాష్ర్టానికి మాత్రమే వర్తిస్తుంది. మరోవైపు ట్రంప్ యంత్రాంగం ఈ తీర్పును అప్పీలు చేసే అవకాశం ఉంది. వ్యాపార సంస్థలకు అనుకూలంగా తీర్పు ఇవ్వడానికి ఇది చాలా తొందరపాటు అవుతుందని పేర్కొంటూ ఒక న్యాయమూర్తి విభేదించారు. ప్రధానంగా డెమోక్రటిక్ పార్టీ నేతృత్వంలోని 24 రాష్ర్టాల కూటమి కోరిన విస్తృతమైన ఇంజంక్షన్‌ను మంజూరు చేయడానికి కోర్టు నిరాకరించింది.

More Stories
ఇరాన్ యుద్ధంతో చమురు కంపెనీలకు రూ.30 వేల కోట్ల నష్టం
ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో రూ.1,444.96 కోట్లకు పైగా జప్తు
25 బిలియన్ డాలర్లకు భారత్- వియత్నాం ద్వైపాక్షిక వాణిజ్యం