ఆన్లైన్లో ఏఐ డీప్‌ఫేక్ కంటెంట్ విచ్చలవిడిగా ప్రసారమవుతోంది. ఏది నిజమో, ఏది అబద్ధమో కూడా గుర్తించలేని విధంగా ఏఐ కంటెంట్ వైరల్ అవుతోంది. మహిళలు, పలువురు ప్రముఖులకు సంబంధించిన డీప్‌ఫేక్ వీడియోలు వారి గౌరవానికి భంగం కలిగిస్తున్నాయి. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు దీనివల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో డీప్‌ఫేక్ కంటెంట్‌ను అడ్డుకోవడం కష్టంగా మారింది.
అందుకే, ఈ అంశంపై ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఆన్లైన్లో భద్రత, విశ్వాసం, జవాబుదారీతనం పెంచేందుకు ఏఐ డీప్‌ఫేక్ కంటెంట్ విషయంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ దేశంలోని ఐటీ నిబంధనల్లో మార్పులను ప్రతిపాదించింది. అక్రమ కంటెంట్‌ను తొలగించేందుకు కేంద్రం సోషల్ మీడియా, ఆన్లైన్ సంస్థలకు ఇచ్చే గడువును కూడా తగ్గించింది.
దీని ప్రకారం సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలు, ఇతర మధ్యవర్తులు చట్టవిరుద్ధమైన ఏఐ(కృత్రిమ మేధ) సృష్టించిన కంటెంట్‌ను తొలగించడానికి ప్రస్తుతం ఉన్న 36 గంటల గడువుకు బదులుగా ప్రభుత్వం లేదా న్యాయస్థానం నుండి సరైన ఆదేశం అందిన కేవలం మూడు గంటల్లోపే చర్యలు తీసుకోవలసి ఉంటుంది. డీప్‌ఫేక్‌లు, ఏఐ ఆధారిత తప్పుడు సమాచారం, ఇతర హానికరమైన సింథటిక్ మీడియాను ఎదుర్కోవడానికి చేపట్టిన విస్తృత ప్రయత్నంలో భాగంగా ఏఐ సృష్టించిన కంటెంట్‌కు తప్పనిసరిగా లేబులింగ్ చేయాలని, ఫిర్యాదుల పరిష్కారానికి వేగవంతమైన కాలపరిమితిని నిర్దేశించాలని కూడా ఈ ముసాయిదా నిబంధనలు నిర్దేశిస్తున్నాయి.
ఇకపై ఏఐ కంటెంట్‌పై కచ్చితమైన లేబుల్‌తోపాటు వెంటనే గుర్తించగలిగే మెటాడాటా ఉండాల్సిందే. దీని ద్వారా అది కృత్రిమంగా సృష్టించినది అని, సింథటిక్ అని సులభంగా తెలిసిపోతుంది. ఐఏ డీప్‌ఫేక్ కంటెంట్‌పై వచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి. అది కూడా రెండు గంటల్లోనే సమస్యను పరిష్కరించాలి. ముఖ్యంగా నగ్నత్వం, నకిలీ కంటెంట్, రెచ్చగొట్టే, దుష్ప్రభావం చూపే విషయంలో వేగంగా స్పందించాలి.
గతంలో ఈ తరహా ఫిర్యాదులపై స్పందించేందుకు ప్రభుత్వం 24 గంటల గడువు ఇచ్చింది. ఈ తరహా డీప్‌ఫేక్ కంటెంట్‌ను గుర్తించేందుకు సోషల్ మీడియా సంస్థలు ఆటోమేటెడ్ టెక్నాలజీని వాడాలి. వెంటనే ఈ కంటెంట్ గుర్తించి, తొలగించాలి. ఎక్కువగా షేర్ అవ్వకుండా చూడాలి. అక్రమ ఏఐ కంటెంట్ విషయంలో కఠినంగా వ్యవహరించాలి.
ఏఐ డీప్‌ఫేక్ కంటెంట్‌ను అరికట్టడంలో సోషల్ మీడియా సహా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ విఫలమవుతున్నాయని, ఇలా జరిగితే ఐటీ యాక్ట్ ప్రకారం సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ కోల్పోతారని కేంద్రం హెచ్చరించింది. ఈ విషయంలో ఇప్పటికే ఉన్న ఐటీ రూల్స్ 2021 యాక్ట్‌ను కేంద్రం మరింత బలోపేతం చేసింది. డిజిటల్ చట్టాలను దేశంలో కఠినతరం చేయాలని కేంద్రం భావిస్తోంది. అందుకే ఈ రూల్స్‌పై దృష్టిసారించింది.

More Stories
రూ.3.25లక్షల కోట్లతో 114 రఫేల్ యుద్ధ విమానాలు
సుప్రీంకు చేరిన లేస్ చిప్స్‌పై పెప్సికో-రైతుల వివాదం
యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం