సుప్రీంకు చేరిన లేస్‌ చిప్స్‌పై పెప్సికో-రైతుల వివాదం

సుప్రీంకు చేరిన లేస్‌ చిప్స్‌పై  పెప్సికో-రైతుల వివాదం

లేస్‌ చిప్స్‌లో ఉపయోగించే ఆలుగడ్డకు సంబంధించిన న్యాయ పోరాటం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. దీంతో కార్పొరేట్‌ వాదనలు, రైతుల హక్కులకు సంబంధించి ఇప్పటికే ఉన్న విస్తృత ఘర్షణ మరింత తీవ్రమైంది. ఎఫ్‌సీ 5 అని కూడా పిలిచే ఎఫ్‌ఎల్‌ 2027 రకంపై పెప్సికోకు ఉన్న మొక్కల పరిరక్షణ రిజిస్ట్రేషన్‌ హక్కులను లేదా బ్రీడర్‌ హక్కులను పునరుద్ధరించిన ఢిల్లీ హైకోర్టు తీర్పును రైతు సంఘాలు సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. 

చిప్స్‌, వేఫర్స్‌ తయారీ కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ఎఫ్‌ఎల్‌ 2027 అనే బంగాళాదుంప రకం చుట్టూ ఈ వివాదం కేంద్రీకృతమై ఉంది. దీనిలో తేమ శాతం తక్కువగా ఉండటం వల్ల ఇది చిప్స్‌ తయారీకి వాణిజ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. కానీ ఇది సాధారణ వంటగది వినియోగానికి ఉద్దేశించినది కాదు. ఈ కేసు చట్టం ప్రకారం బ్రీడర్ల హక్కుల పరిధి పైనా, రైతులకు ఉన్న రక్షణల పైనా ప్రశ్నలను లేవనెత్తింది.

మొక్కల రకాలు, రైతుల హక్కుల పరిరక్షణ చట్టం, 2001 కింద ఈ రకాన్ని తామే అభివృద్ధి చేశామని, దీనిపై తమకు ప్రత్యేక హక్కులు ఉన్నాయని పెప్పికో పేర్కొంది. ఈ రకానికి సంబంధించిన బ్రీడర్‌ ప్రత్యేక హక్కులు తమకే ఉన్నాయని ఆ సంస్థ వాదిస్తున్నది. 2016లో లభించిన రిజిస్ట్రేషన్‌ ద్వారా ఈ రకం ఉత్పత్తికి, విక్రయానికి, మార్కెటింగ్‌ చేయడానికి పెప్సికోకు పూర్తి హక్కు లభించిందని, అనుమతి లేకుండా మరెవరూ దీనిని సాగుచేయకూడదని ఆ సంస్థ తరఫు న్యాయవాది తెలిపారు.

విత్తనాలను పండించుకునే, భద్రపరుచుకునే, విక్రయించుకునే అవిభాజ్య హక్కు రైతులకు భారతీయ చట్టం కల్పిస్తున్నదని రైతు సంఘాలు వాదిస్తున్నాయి. సాధారణ చిన్న రైతులకు వ్యతిరేకంగా తాము వ్యవహరించడం లేదని, కేవలం పోటీ చిప్స్‌ తయారీ సంస్థల ప్రోద్బలంతో ఈ రకం బంగాళాదుంపల వాణిజ్యపరమైన సాగు జరుగుతున్న సందర్భాల్లోనే తాము చర్యలు తీసుకుంటున్నామని పెప్సికో పేర్కొంది. 

రైతుల హక్కుల చట్టంలోని సెక్షన్‌ 39 కింద తమకు లభించే రక్షణ పెప్సికో ఏకస్వామ్య వాదన కంటే బలమైనదని రైతులు, పిటిషనర్లు వాదించారు. సెక్షన్‌ 39(1)(ఐవీ) రైతులకు స్పష్టమైన రక్షణను కల్పిస్తుందని సీనియర్‌ న్యాయవాది కోలిన్‌ గన్సాల్వెస్‌, పిటిషనర్లు పేర్కొన్నారు. రక్షణ పొందిన రకానికి చెందిన విత్తనాలనైనా సరే వాటిని బ్రాండెడ్‌ విత్తనాలుగా విక్రయించనంత వరకు రైతులు వాటిని పండించడానికి, భద్రపరుచుకోవడానికి, విక్రయించడానికి స్వేచ్ఛ కలిగి ఉన్నారని వాదించారు. 

ఒక ఆహార పంటపై కార్పొరేట్‌ సంస్థల పూర్తి నియంత్రణ భారతదేశ వ్యవసాయ వ్యవస్థకు, రైతుల జీవనోపాధికి ముప్పు కలిగిస్తుందని పేర్కొంటూ పిటిషనర్లు ఆహార సార్వభౌమత్వ అంశాన్ని కూడా లేవనెత్తారు.