ప‌తంజ‌లి నెయ్యిలో క‌ల్తీ లేదు.. మందుల‌పై నిషేధం అబద్ధం

ప‌తంజ‌లి నెయ్యి క‌ల్తీ జ‌రిగిందంటూ జ‌రుగుతున్న ప్ర‌చారంలో నిజం లేదని  స్వామి రామ్‌దేవ్ స్పష్టం చేశారు. అలాగే, త‌మ సంస్థ త‌యారు చేసే ఔష‌ధాల్ని నిషేధించారు అంటూ జ‌రుగుతున్న ప్ర‌చారం కూడా అబ‌ద్ధం తేల్చి చెప్పారు. ఇటీవ‌ల ప‌తంజ‌లి సంస్థ ఉత్ప‌త్తుల‌పై జ‌రుగుతున్న ప్ర‌చారంపై స్వామి రామ్‌దేవ్ స్పందిస్తూ త‌మ సంస్థ తయారు చేస్తున్న ఔష‌ధాన్ని సుప్రీంకోర్టు నిషేధించ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. 

ప‌తంజ‌లి రూపొందించే ఔష‌ధాలు అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌కు అనుగుణంగా ఉన్నాయ‌ని, అలాగే, భారత్ లోని, విదేశాల్లోని అన్ని సంస్థ‌ల ప్ర‌మాణాల‌కు మించి ఉన్నాయ‌ని ఆయన వివ‌రించారు. ప‌తంజ‌లి నెయ్యిలో కూడా ఎలాంటి క‌ల్తీ లేద‌ని, అవ‌స‌ర‌మ‌నుకుంటే దేశంలోని ఏ ల్యాబ్‌లో అయినా ప‌రీక్షించుకోవ‌చ్చ‌ని సవాల్ చేశారు.  ముఖ్యంగా ప‌తంజ‌లి నెయ్యిలో జంతువుల కొవ్వు, ఎముక‌ల పొడి క‌లిసింద‌నే ప్ర‌చారంలో కూడా నిజం లేద‌ని స్పష్టం చేశారు.

కొంత‌కాలంగా ప‌తంజ‌లి ఉత్ప‌త్తుల‌పై దుష్ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని విమర్శించారు. మ‌రోవైపు ప‌తంజ‌లి ఉత్ప‌త్తుల‌పై బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూష‌ణ్ సింగ్ చేసిన ఆరోప‌ణ‌ల‌పై కూడా రామ్‌దేవ్ స్పందిస్తూ  ఆయ‌న‌కు ఈ అంశంపై అవ‌గాహ‌న లేద‌ని, అంద‌రూ చేస్తున్న దుష్ప్ర‌చారం, వ‌దంతుల్ని న‌మ్మి ఆయ‌న వ్యాఖ్య‌లు చేశార‌ని రామ్‌దేవ్ వివ‌రించారు.  ఈ విష‌యంలో అన్ని ఆరోప‌ణ‌ల‌కు స‌మాధానం ఇచ్చామ‌ని చెప్పారు.

అలాగే, ఆయ‌న‌పై దాఖ‌లు చేసిన ప‌రువున‌ష్టం దావా కేసును కూడా ప‌తంజ‌లి సంస్థ ఉపసంహ‌రించుకుంద‌ని తెలిపారు. డ్ర‌గ్ అండ్ రెమెడీ యాక్ట్ గురించి రామ్‌దేవ్ స్పందిస్తూ ఈ చ‌ట్టం పాత‌కాలం నాటిద‌ని, ఈ చ‌ట్టాన్ని మార్చాల్సి ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.  పతంజలి సుమారు ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించిందని, రాబోయే సంవత్సరాల్లో మరో ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని ఆయన పేర్కొన్నారు. ప్రాచీన వారసత్వాన్ని విజ్ఞానశాస్త్రంతో అనుసంధానించడం ద్వారా దానికి ప్రపంచవ్యాప్త గుర్తింపును తీసుకువచ్చే దిశగా పతంజలి కృషి చేసిందని ఆయన చెప్పారు.

 

About The Author