కొరియోగ్రాఫ‌ర్ శివశంక‌ర్ మాస్ట‌ర్‌ క‌న్నుమూత‌

టాలీవుడ్‌లో  ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ శివశంక‌ర్ మాస్ట‌ర్‌ ( 72) క‌న్నుమూశారు. క‌రోనాతో గ‌చ్చిబౌలిలోని ఏఐజీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న ఆయ‌న‌ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.

శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ 1948 డిసెంబ‌ర్ 7న త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైలో జ‌న్మించారు. ఆయ‌న తండ్రి క‌ళ్యాణ సుంద‌రం పండ్ల వ్యాపారి. తెలుగు, త‌మిళ చిత్రాల‌తో స‌హా దాదాపు 10కి పైగా భాషల్లో కొరియోగ్రాఫ‌ర్‌గా శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ సేవ‌లందించారు. ఆయ‌న కెరీర్‌లో 800కు పైగా సినిమాల‌కు డ్యాన్స్ మాస్ట‌ర్‌గా ప‌నిచేశారు. 

1975లో వ‌చ్చిన త‌మిళ చిత్రం పాట్టు భ‌ర‌త‌మ‌మ్ చిత్రంతో ఆయ‌న కెరీర్ మొద‌లైంది. ఈ సినిమాకు ఆయ‌న స‌హాయ‌కుడిగా ప‌నిచేశాడు. ఆ తర్వాత కురువికూడు చిత్రంతో కొరియోగ్రాఫ‌ర్‌గా మారారు. డ్యాన్స్ మాస్ట‌ర్‌గానే కాకుండా ప‌లు సినిమాల్లోనూ ఆయ‌న న‌టించారు.

 2003లో వ‌చ్చిన ఆల‌య్ సినిమాతో తొలిసారి ఆయ‌న వెండితెర‌పై న‌టుడిగా క‌నిపించాడు. నేనే రాజు నేనే మంత్రి, అక్ష‌ర‌, స‌ర్కార్‌, ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు, రాజుగారి గ‌ది 3 స‌హా దాదాపు 30 చిత్రాల్లో ఆయ‌న న‌టించారు.బుల్లితెర‌పై ప‌లు డ్యాన్స్ షోల‌కు జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రించారు. 

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మ‌గ‌ధీర సినిమాలో ధీర ధీర పాట‌కు అందించిన కొరియోగ్ర‌ఫీకి గానూ శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ జాతీయ అవార్డు అందుకున్నారు. నాలుగుసార్లు త‌మిళ‌నాడు స్టేట్ ఫిలిం అవార్డుల‌ను సొంతం చేసుకున్నారు. 1996లో పూవే ఉన‌క్క‌గ‌, 2004లో విశ్వ తుల‌సి, 2006లో వ‌ర‌లారు, 2008లో ఉలియిన్ ఓస‌య్ చిత్రాల‌కు గానూ ఈ అవార్డులు అందుకున్నారు.

అమ్మోరు, సూర్యవంశం, అల్లరి పిడుగు, మగధీర, అరుంధతి, మహాత్మా, బాహుబలి ది బిగినింగ్ చిత్రాలకు శివశంకర్ మాస్టర్‌ కొరియోగ్రఫీ అందించారు. ఇటీవల శివశంకర్ మాస్టర్ కుటుంబం వైరస్‌ మహమ్మారి బారిన పడింది. ప్రస్తుతం శివశంకర్ పెద్ద కుమారుడు విజయ్ శివశంకర్ కరోనాతో పోరాడుతున్నారు. మాస్టర్ భార్య కూడా హోం క్వారంటైన్ లో ఉన్నారు.

శివ‌శంక‌ర్ మాస్ట‌ర్‌కు  భార్య, విజయ్‌ శివ శంకర్‌, అజయ్‌ శివ శంకర్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్ద‌రు కూడా సినిమా రంగంలోనే ఉన్నారు. తండ్రి వృత్తినే వాళ్లు కూడా ఎంచుకున్నారు. ఇద్ద‌రూ కొరియోగ్ర‌ఫ‌ర్లుగానే స్థిర‌ప‌డ్డారు. ప‌లు భాషల్లో సినిమాల‌కు డ్యాన్సు మాస్ట‌ర్లుగా వాళ్లు ప‌నిచేస్తున్నారు. 

చిన్నతనంలోనే ఓ ప్రమాదం వల్ల శివశంకర్‌ వెన్నెముకకు తీవ్ర గాయమైంది. విదేశాల్లో డాక్టర్‌గా పనిచేసి మద్రాసు వచ్చిన నరసింహ అయ్యర్‌ అనే ఆయన వద్దకు శివ శంకర్‌ను తీసుకెళ్లారు. ఎక్స్‌రే తీసి, వెన్నెముక విరిగిపోయిందని నిర్థారించారు. అప్పుడు ఆ డాక్టర్‌ శివ శంకర్‌ తల్లిదండ్రులకు ఒక సలహా ఇచ్చారు. 

‘ఈ పిల్లాడిని ఎవరి వద్దకు తీసుకెళ్లకుండా నా దగ్గర వదిలేేస్త లేచి నడిచేలా చేయగలను అని మాటిచ్చారు. దాదాపు ఎనిమిదేళ్లు శివ శంకర్‌ పడుకునే ఉన్నారు. చిన్నప్పటి నుంచి శివశంకర్‌కు పాటలంటే ప్రాణం. నాటకాలు, డ్యాన్సులు చూడాలంటే డ్రైవర్‌ను ఇచ్చి శివ శంకర్‌ను పంపేవారు. వాటిని చూసి ఎలాగైనా డాన్స్‌ చేయాలన్న పట్టుదల ఆయనలో పెరిగింది. 

దాంతో తనంతట తానే డ్యాన్స్‌ నేర్చుకుని, 16ఏళ్లు వచ్చేసరికి ట్రూప్‌ల వెంట వెళ్లి డ్యాన్సు చేయడం మొదలు పెట్టారు. ఎలాగోలా ఎస్సెల్సీ పూర్తి చేసి డ్యాన్సు నేర్చుకుంటా’ అని తండ్రికి చెప్పారు. జాతకం ప్రకారం డాన్సర్‌ అవుతాడని ఉండడంతో అటువైపు దృష్టి మళ్లించారు. మద్రాసులో నటరాజ శకుంతల అనే నృత్యకారుడి దగ్గర  శివశంకర్‌ నృత్యం నేర్చుకున్నారు.