డాలర్‌ శేషాద్రి హఠాన్మరణం

తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి హఠాన్మరణం చెందారు. విశాఖపట్నంలో కార్తీక దిపోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన.. వేకువజామున గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించే లోపు తుది శ్వాస విడిచారు. 1978 నుంచి డాలర్‌ శేషాద్రి శ్రీవారి సేవలో ఉన్నారు. 2007లో రిటైర్‌ అయినా  శేషాద్రి సేవలు తప్పనిసరికావడంతో ఓఎస్డీగా టీటీడీ కొనసాగించింది. మరణించే చివరి క్షణం వరకు ఆయన స్వామి సేవలో తరించారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో పదవీ విరమణ పొంది పదేళ్లు దాటినా.. నేటికీ తన సేవలను కొనసాగిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 50ఏళ్ల నుంచి స్వామివారి కైంకర్యాలకు సంబంధించి, సేవలకు సంబంధించి, ఉత్సవాలకు సంబంధించి అన్ని రకాలైన వ్యవహారాలపైన డాలర్ శేషాద్రికి పట్టుంది. మరణించే చివరి క్షణం వరకు ఆయన స్వామి సేవలోనే తరించారు.

 తిరుమలలో1944లో జన్మించిన డాల్లర్ శేషాద్రి అసలు పేరు పాల శేషాద్రి. ఆయన పూర్వీకులు తమిళనాడులోని కంచికి చెందిన వారు. శేషాద్రి తండ్రి తిరుమల ఆలయంలో గుమస్తాగా విధులు నిర్వర్తించారు. శేషాద్రి తిరుమలలో పుట్టి అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశారు. అప్పట్లోనే పీజీ చేశారు. 1978లో టీటీడీలో చేరిన ఆయన.. 2006 జూన్ లో రిటైరయ్యారు. అప్పటి నుంచి ఒఎస్డీగా కొనసాగుతున్నారు. శేషాద్రికి భార్య, ఇద్దరు అన్నలు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. 

ఆయన డాలర్ శేషాద్రిగా ప్రోన్దడానికి  కారణాలున్నాయి. నుదుట నామాలు ధరించి మెడలో పెద్ద డాలర్ ను ధరించడం వల్లే ఆయనకు డాలర్ అనే బిరుదు వచ్చింది. ఆత్మీయులు, సన్నిహితులు ఆయనను డాలర్ మామ అంటూ ప్రేమగా పిలుచుకుంటారు. ఇక శ్రీవారి ఆలయంలో స్వామి వారి ప్రతిమతో కూడిన డాలర్ ను తయారు చేసి విక్రయించేవారు. అది కూడా డాలర్ చేతుల మీదుగానే కొనసాగేది. అప్పటి నుంచి పీ శేషాద్రికి బదులుగా డాలర్ శేషాద్రిగానే ఆయన ప్రాచుర్యం పొందారు. 

2006లో డాల్లర్ శేషాద్రి పై బంగారు డాల్లర్ల అదృశ్యం అభియోగాలు వచ్చాయి. దాదాపు 305 డాలర్లు మాయమవడంతో తీవ్ర కలకలం రేగింది. దీనిపై వెంటనే స్పందించిన టీటీడీ బోర్డు శేషాద్రితో పాటు మరో నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసింది. అయితే, కిందిస్థాయి ఉద్యోగులపాత్రే ఇందులో ఉందంటూ,  పైస్థాయిలో ఉన్న శేషాద్రికి సంబంధం లేదని స్పష్టం చేసిన కోర్ట్ ఆదేశాలతో   ఆయన మళ్లీ విధుల్లో చేరిపోయారు. మొత్తం సర్వీసులో 15 నెలల కాలం మినహాయిస్తే పూర్తిగా శ్రీవారి సన్నిధిలో డాలర్ శేషాద్రి విధుల నిర్వర్తించారు.

డాలర్ శేషాద్రి మరణం బాధాకరమని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రీవారి సేవే ఊపిరిగా ఆయన పని చేశారని, ఆయన జీవితమంతా స్వామివారి సేవలో తరించిన ధన్య జీవిని కొనియాడారు. అందరితో ప్రేమగా, ఆలయ కార్యక్రమాల్లో అధికారులు, అర్చకులకు పెద్ద దిక్కుగా పని చేశారని పేర్కొన్నారు. ఆయన మరణ వార్త తానను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని శ్రీవారిని ప్రార్థిస్తున్నానని సుబ్బారెడ్డి తెలిపారు. 

 డాలర్ శేషాద్రి హఠాన్మరణం హృదయాన్ని కలచివేసిందని విశాఖ శారదా పీఠం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు. నిత్యం వేంకటేశ్వర స్వామి పాదాల చెంత జీవించిన అదృష్టం ఆయనదని చెప్పారు. వేంకటేశ్వర స్వామిని దర్శించిన ప్రతి ఒక్కరికీ డాలర్ శేషాద్రి సుపరిచితులు అని పేర్కొన్నారు. 

‘‘శేషాద్రి గారి మరణం టీటీడీ వ్యవస్థలో ఒక తీరని లోటును మిగిల్చింది. అన్ని కార్యక్రమాలు వ్యవహారాలు టీటీడీలో సరైన సమయంలో సక్రమంగా జరగడంలో ఆయన పాత్ర ఉన్నది. నిర్విరామంగా నిరంతరంగా అలుపు సొలుపు లేకుండా స్వామివారి  సేవకు అంకితమైన వ్యక్తి. టీటీడీ అర్చక వ్యవస్థలో నిరాదరణకు గురి అయిన గుమాస్తా అర్చకులకు ఈయన ఒక పెద్ద అండ” అంటూ మాజీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు నివాళులు అర్పించారు.

 డాలర్ శేషాద్రి మరణం టీటీడీకి తీరని లోటని అదనపు ఈవో ధర్మారెడ్డి చెప్పారు. డాలర్ శేషాద్రి ధన్యజీవి అని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఎల్వీ సుబ్రమణ్యం పేర్కొన్నారు. ఆయనతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు.