అల్లుడు దళితుడని మనవడిని `అదృశ్యం’ చేసిన మార్క్సిస్టు నేత!

సీపీఎం విద్యార్థి విభాగం, ఎస్‌ఎఫ్‌ఐ నాయకురాలు 23 ఏళ్ల అనుపమ ఎస్ చంద్రన్ తన బిడ్డను సొంతం చేసుకొనేందుకు నాలుగేళ్లపాటు పోరాటం చేయవలసి వచ్చింది. తాను దళితుడిని వివాహం చేసుకోవడంతో ఆగ్రహించిన  మార్క్సిస్టు నేత అయిన తండ్రి ఆమె మగబిడ్డను నాలుగు రోజుల వయస్సులో `దత్తత’ పేరుతో ఎవ్వరికో ఇచ్చేసి `అదృశ్యం’ చేశారు. 

దానితో భర్తతో కలసి తన బిడ్డకోసం ఆమె ఒక వంక కేరళలోని సిపిఎం యంత్రాంగంతో, మరోవంక పార్టీ నాయకత్వంతో నాలుగేళ్లపాటు అలుపెరగని పోరాటం చేయవలసి వచ్చింది. మహిళల పట్ల సిపిఎం నాయకత్వం అనుసరించే వివక్ష ధోరణికి ఆమె హృదయవిదారక కధనం ప్రత్యక్ష నిదర్శనం అని చెప్పవచ్చు. 

సిపిఎం జాతీయ స్థాయి మహిళా నేతలు జోక్యం చేసుకున్నా కేరళలోని పార్టీ నాయకులెవ్వరూ ఆమెకు సహాయం అందించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. చివరకు గత బుధవారం, వర్షం కురుస్తున్న సమయంలో తన భాగస్వామి అజిత్‌తో కలిసి తిరువనంతపురంలోని కోర్టు కాంప్లెక్స్ నుండి బయటకు వచ్చిన వెంటనే తన మగబిడ్డను తన చేతుల్లో తీసుకో గలిగింది ఆ మాతృహృదయం. 


ఆ చిన్నారి వారం రోజుల వరకు ఆంధ్రప్రదేశ్‌లోని తన పెంపుడు తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నాడు. రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీలో శిశువుకు  డిఎన్ఎ పరీక్షలు నిర్వహించిన ఒక రోజు తర్వాత అనుపమ, అజిత్‌లు బిడ్డకు తల్లిదండ్రులని నిర్ధారించారు. తనకు తెలియకుండానే నాలుగు రోజుల మగబిడ్డను తల్లిదండ్రులు తీసుకెళ్లి వదిలేశారని అనుపమ ఆరోపించింది. ఈ ఆరోపణలను ఆమె తల్లిదండ్రులు ఖండించారు.

తన తల్లిదండ్రులతో పాటు, తన కుమారుడిని తీసుకెళ్లేందుకు పోలీసులు, శిశు సంక్షేమ కమిటీ కలిసి కుట్ర పన్నారని ఆమె ఆరోపణలు చేసింది. తన తల్లిదండ్రులు చేసిన పనిపై ఏప్రిల్ నుంచి పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసేందుకు వెనుకాడుతున్నారని అనుపమ తెలిపింది. 


అక్టోబర్‌లో, ఆమె తన తల్లిదండ్రులపై ఆరోపణలు లేవనెత్తుతూ, తన బిడ్డ నుండి ఆమెను వేరు చేయడానికి తన తల్లిదండ్రులకు సిపిఎం నాయకులు సహకరించారని ఆరోపిస్తూ ఆమె ప్రజల్లోకి వెళ్లిన తర్వాతనే కేసు నమోదు చేశారు. 

అయితే, ఆమె తల్లిదండ్రులు, సోదరి, ఆమె భర్త, ఆమె తండ్రి ఇద్దరు స్నేహితులతో సహా ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు పేరూర్‌క్కడ పోలీసులు తరువాత తెలిపారు. న్యాయపరమైన అభిప్రాయం కోసం ఎదురుచూస్తున్నందున ఆలస్యం జరిగిందని చెప్పారు.

అనుపమ ఫిర్యాదు మేరకు సీపీఎం నేత పి సతీదేవి నేతృత్వంలోని రాష్ట్ర మహిళా కమిషన్ కూడా కేసు నమోదు చేసింది. స్థానిక సీపీఎం నాయకుడైన తన తండ్రి తన బిడ్డను బలవంతంగా తన వద్ద నుంచి తీసుకెళ్లాడని ఆమె చేసిన ఆరోపణ రాజకీయ వివాదానికి దారితీసింది. ఈ ఘటనపై కేరళ ప్రభుత్వం శాఖాపరమైన విచారణకు ఆదేశించింది.

తన బిడ్డను తిరిగి తీసుకురావాలని కోరుతూ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో సహా పలువురు ప్రముఖ సిపిఎం నేతలను సంప్రదించినా ఎవరూ తనకు మద్దతివ్వలేదని ఆమె ఆరోపించింది. కోర్టు కేసును నవంబర్ 30కి వాయిదా వేసింది. 
అయితే శిశువును వీలైనంత త్వరగా తల్లిదండ్రులకు అప్పగించాలని ప్రభుత్వ ప్లీడర్ విజ్ఞప్తి చేయడంతో గత బుధవారం విచారణ చేపట్టింది. 


జడ్జి ఛాంబర్‌లో గంటన్నరపాటు జరిగిన విచారణలో నిర్మలా శిశు భవన్‌లోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశానుసారం ఆ కమిటీ అదుపులో ఉన్న పాపను కోర్టులో హాజరుపరిచారు. శిశువుకు వైద్యపరీక్షలు నిర్వహించాలని, అన్ని చట్టపరమైన లాంఛనాలు పూర్తి చేసిన తర్వాత, బిడ్డను తల్లికి అప్పగించాలని సిడబ్ల్యుసిని కోర్టు ఆదేశించింది.

ముఖ్యంగా సిపిఎం మద్దతుదారులు తమపై జరుగుతున్న తీవ్రమైన సైబర్ దాడులను తాను, అజిత్ ఎలా ఎదుర్కోగలిగారని అడిగిన ప్రశ్నకు, ఇది మొదట తమను కలవరపరిచిందని, అయితే ఆ ప్రచారంలో ఏమాత్రం నిజం లేకపోవడంతో తాము దానిని విస్మరించడం ప్రారంభించారని అనుపమ చెప్పారు. 

“అజిత్‌, నేను సిపిఎం పార్టీలో ఎదిగినందున, ఎవరైనా తమ నాయకత్వంపై వేలు పెడితే పార్టీ అనుచరులు ఎలా ఆలోచిస్తారో మాకు స్పష్టంగా తెలుసు. సొంతంగా ఆలోచించే, మూల్యాంకనం చేసే సామర్థ్యం లేని అనుచరుల సమూహాన్ని మార్క్సిస్టు పార్టీ సృష్టిస్తోంది. అలాంటి వ్యక్తులు మాపై సైబర్ దాడికి పాల్పడ్డారు, కానీ మేము పట్టించుకోము” అని ఆమె ఘాటుగా స్పందించారు.  

తాను, అజిత్ పార్టీ వేదికల ద్వారా సమస్యను పరిష్కరించుకునేందుకు ఎంతగానో ప్రయత్నించామని ఆమె తెలిపారు. ఈ విషయంలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్, కేంద్ర కమిటీ సభ్యురాలు పికె శ్రీమతి పదే పదే అభ్యర్థనలు చేసినా రాష్ట్ర నాయకత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి విముఖత చూపడంతో పార్టీ సీనియర్ నేతల స్పందన తమకు దిగ్భ్రాంతి కలిగించిందని ఆమె పేర్కొన్నారు.

“వారిద్దరూ పార్టీకి చెందిన సీనియర్ మహిళా నాయకులు అయినప్పటికీ తనకు సహాయం చేయలేకపోయారని ఆమె చెప్పారు. సిపిఎం పునరుజ్జీవనోద్యమ విలువలు, లింగ సమానత్వం గురించి వాగ్ధాటిగా మాట్లాడేది. ఇదా వారు తమ మహిళా నాయకులతో వ్యవహరించే విధానం? పార్టీ నాయకత్వం ఇప్పటికీ పితృస్వామ్య మనస్తత్వం” అని అనుపమ ఆరోపించారు.

ఫిజిక్స్ గ్రాడ్యుయేట్ అయిన అనుపమ తన చదువును కొనసాగించి టీచర్ కావాలని కోరుకుంటున్నానని, అది తన చిన్ననాటి కల అని చెప్పింది. “ప్రస్తుతం, నా దృష్టి నా బిడ్డను బాగా పెంచి, మంచి మనిషిగా పెంచడం. అతనికి విలాసవంతమైన జీవితాన్ని అందించలేకపోవచ్చు. కానీ, అతను మంచి మనిషిగా ఎదగడానికి మేము హామీ ఇస్తున్నాము” అని ఆమె భరోసా వ్యక్తం చేసింది.