సాగు చట్టాల రద్దు బిల్లుకు పార్లమెంట్ ఉభయసభలు సోమవారం ఆమోదం తెలిపాయి. ఉదయం లోక్‌సభలో, మధ్యాహ్నం రాజ్యసభలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఎటువంటి చర్చ లేకుండానే మూజువాణీ ఓటుతో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. ఇక రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదమే మిగిలింది.
కాంగ్రెస్ సభ్యుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి ఈ బిల్లుపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. దీనిపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ, ప్రతిపక్ష సభ్యులు వెల్‌లో నుంచి బయటికి వచ్చి, తమ తమ స్థానాల్లో కూర్చుంటే చర్చకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. సభ కార్యకలాపాలు సజావుగా జరగడానికి వీలుగా సభ్యులు సహకరించాలని కోరారు.
చివరికి ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్య, మూజువాణి ఓటుతో ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. అనంతరం సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. దీంతో సుమారు ఓ సంవత్సరం నుంచి ఈ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులు విజయం సాధించారు.
దీనిపై భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయిత్ స్పందిస్తూ ఈ వ్యవసాయ చట్టాల రద్దు వాటికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ మరణించిన 750 మంది రైతులకు నివాళి అని వ్యాఖ్యానించారు.
పార్లమెంట్‌లో తొలి రోజే రభస మొదలైంది. లోక్‌సభలో ప్రశ్నోత్తరాలను రద్దు చేసి రైతు సమస్యలపై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. సభ ప్రారంభమైన తర్వాత స్పీకర్ ఓం బిర్లా కొత్త సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
ఆ తర్వాత ప్రశ్నోత్తరాల సమయం మొదలైంది. కానీ ఆ సమయంలో టీఆర్ఎస్ నేతలు సభలో నిరసన చేపట్టారు. లోక్‌సభలో పోడియం దగ్గరకు వెళ్లి టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ధాన్యం సేకరణపై కేంద్రం తమ విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
దేశ ప్రగతికోసం పార్లమెంటులో చర్చ జరగాలి
దేశ ప్రగతి కోసం పార్లమెంటులో చర్చ జరగాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఇవి చాలా ముఖ్యమైన సమావేశాలని, ఉభయ సభలు సజావుగా సాగాలని ప్రజలంతా కోరుకుంటున్నారని చెప్పారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటు ఆవరణలో ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడుతూ ప్రతి విషయం చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. నూతన సంకల్పంతో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించామని చెప్పారు. రాజ్యాంగ దినోత్సవ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలనేది ప్రభుత్వ సంకల్పమని తెలిపారు.
దేశ వ్యాప్తంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ నిర్వహిస్తున్నామని చెప్పారు. అమృత్ మహోత్సవాల్లో భాగంగా దేశం నలుమూలలా కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవ సమయంలో కలల సాకారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రజలు తమ వంతు సాయం చేస్తున్నారని చెప్పారు. ప్రజల సేవ.. దేశ ఉజ్వల భవిష్యత్తుకు శుభ సంకేతమని పేర్కొన్నారు.
పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం తన కేబినెట్‌లోని సీనియర్ మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ పాల్గొన్నారు.
More Stories
సద్గురు జగ్గీ వాసుదేవ్ కి వాటర్ ఛాంపియన్ అవార్డు
మంగోలియన్ బాలుడిని 3వ అత్యున్నత నేతగా పేర్కొన్న దలైలామా
నేటి నుండే విశాఖలో జీ–20 సదస్సు పట్టణీకరణపై దృష్టి