రైతులు ఆందోళ‌న విర‌మించి ఇండ్ల‌కు తిరిగివెళ్లాలి

వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ర‌ద్దు చేసిన క్ర‌మంలో రైతులు ఆందోళ‌న విర‌మించి, ఇండ్ల‌కు తిరిగివెళ్లాల‌ని కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి న‌రేంద్ర సింగ్ తోమ‌ర్ శ‌నివారం అన్న‌దాత‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ప్ర‌భుత్వం వెన‌క్కితీసుకున్నందున ఆందోళ‌న కొన‌సాగించాల్సిన అవ‌స‌రం లేద‌ని, రైతులు నిర‌స‌న‌ల‌ను వీడి ఇండ్ల‌కు వెళ్లాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నాన‌ని ఆయ‌న సూచించారు. 

రైతుల డిమాండ్ల‌ను నెర‌వేర్చేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని తాను హామీ ఇస్తున్నాన‌ని చెప్పారు. పంటల వైవిధ్యం, జీరో బ‌డ్జెట్ ఫార్మింగ్‌, మ‌ద్ద‌తు ధ‌ర యంత్రాంగాన్ని ప‌టిష్టం చేయ‌డం వంటి ప‌లు అంశాల‌పై చ‌ర్చించేందుకు క‌మిటీని ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఇప్ప‌టికే ప్ర‌క‌టించార‌ని ఆయ‌న గుర్తుచేశారు. రైతు సంఘాల ప్ర‌తినిధులు కూడా ఈ క‌మిటీల్లో ఉంటార‌ని చెప్పారు.

రైతులు పంట వ్య‌ర్ధాల‌ను ద‌గ్ధం చేయ‌డాన్ని నేర‌పూరిత చ‌ర్య‌గా చూడ‌రాద‌న్న‌ రైతు సంఘాల డిమాండ్‌ను కూడా ప్ర‌భుత్వం అంగీక‌రించింద‌ని కేంద్ర మంత్రి వెల్లడించారు.  క‌మిటీ ఏర్పాటుతో ఎంఎస్‌పీపై రైతుల డిమాండ్ కూడా నెర‌వేరిన‌ట్టేన‌ని మంత్రి తెలిపారు.

ఇలా  ఉండగా, శీతాకాల పార్ల‌మెంట్ స‌మావేశాల సందర్భంగా  పార్ల‌మెంట్‌ను ముట్ట‌డి చేసేందుకు ప్లాన్ చేసిన మార్చింగ్‌ను వాయిదా వేసిన‌ట్లు తెలుస్తోంది. కొత్త సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తూ శీతాకాల స‌మావేశాల తొలి రోజునే ప్ర‌భుత్వం బిల్లును స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రైతులు వెన‌క్కి త‌గ్గిన‌ట్లు తెలుస్తోంది. 

సోమ‌వారం నుంచి పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాలు ప్రారంభంకానున్నాయి. సంయుక్త కిసాన్ మోర్చా నేత‌ల ఇవాళ సమావేశం నిర్వ‌హించారు. అయితే సాగు చ‌ట్టాల‌పై కేంద్రం యూట‌ర్న్ తీసుకున్న నేప‌థ్యంలో కిసాన్ మోర్చా త‌న నిర్ణ‌యాన్ని మార్చుకున్న‌ట్లు తెలుస్తోంది.

శీతాకాల స‌మావేశాల తొలి రోజున పార్ల‌మెంట్‌కు మార్చింగ్ నిర్వ‌హించాల‌ని తొలుత రైతులు నిర్ణ‌యించారు. 60 ట్రాక్ట‌ర్లు, వెయ్యి మందితో ఛ‌లో పార్ల‌మెంట్‌లో పాల్గొనాల‌ని భావించారు. అయితే ఆ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.