విదేశాల నుంచి వ‌చ్చేవారిప‌ట్ల‌ అప్ర‌మ‌త్తంగా ఉండండి

ఆఫ్రికా ద‌క్షిణ దేశాల్లో బ‌య‌ట‌ప‌డి ప్ర‌పంచ‌దేశాల‌ను గ‌డ‌గ‌డలాడిస్తున్న కొత్త ర‌కం క‌రోనా ఒమిక్రాన్ విస్తృతిపైన‌, దేశంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియపైన ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ఈ ఉద‌యం ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి అధికారులను వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. 

ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలను సడలించే ప్రణాళికలను సమీక్షించాలని ప్రధాని అధికారులను కోరారు. కొత్త వేరియంట్‌కు సంబంధించిన పరిణామాలపై క్లుప్తంగా, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ద్వారా ‘ప్రమాదంలో’ ఉన్న దేశాల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక దృష్టి సారించి, అంతర్జాతీయంగా వచ్చిన వారందరినీ పర్యవేక్షించాల్సిన అవసరాన్ని ప్రధాని నొక్కి చెప్పారు.

వీటితో పాటు ముఖానికి మాస్క్‌ ధరించడం, క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, సామాజిక దూరాన్ని కొనసాగించడం వంటి కోవిడ్ ప్రోటోకాల్స్‌ను తప్పకుండా పాటించాలని ప్రధాని మోదీ సూచించారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని.. ప్రతి ఒక్కరు విధిగా వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకోవాలని సూచించారు. 

ఆ న్యూ వేరియంట్‌ను దేశంలోకి రాకుండా క‌ట్ట‌డిచేసే విష‌యంలో చాలాసేపు చ‌ర్చించారు. అదేవిధంగా అధికారులకు కొన్ని స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇచ్చారు. క‌రోనా కొత్త వేరియంట్ నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో క‌లిసి ప‌నిచేయాల‌ని అధికారుల‌కు ప్ర‌ధాని మోదీ సూచించారు. అన్ని రాష్ట్రాల్లోనూ జిల్లా స్థాయిలో క‌రోనా న్యూ వేరియంట్‌పై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని పేర్కొన్నారు. 

అదేవిధంగా క‌రోనా కేసులు ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో ప్ర‌జ‌లు నిబంధ‌న‌లు పాటించేలా తీవ్ర‌మైన నిరోధం, నిరంత‌ర నిఘాను కొన‌సాగించాల‌ని ప్ర‌ధాని ఆదేశించారు. విదేశాల నుంచి వ‌చ్చే ప్ర‌యాణికులు నిబంధ‌న‌ల మేర‌కు ప‌రీక్ష‌లు చేయించుకున్నారా లేదా అనే విష‌యంలో గ‌ట్టి ప‌ర్య‌వేక్ష‌ణ అవ‌స‌ర‌మ‌ని చెప్పారు. 

క‌రోనా ఉధృతంగా ఉన్న‌ దేశాల‌పై ప్ర‌ధానంగా దృష్టి సారించాల‌ని సూచించారు. కొత్త వేరియంట్ క‌ల‌క‌లం రేపుతున్న నేప‌థ్యంలో అంత‌ర్జాతీయ ప్ర‌యాణాలను సుల‌భ‌త‌రం చేయ‌డానికి సంబంధించి రూపొందించిన ప్ర‌ణాళిక‌ల‌పై అధికారులు పున‌రాలోచ‌న చేయాల‌ని ప్ర‌ధాని మోదీ ఆదేశించారు. సమావేశంలో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ, కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తదితరులు పాల్గొన్నారు.