తొలి సారి దేశ జనాభాలో పురుషులను మించిపోయిన మహిళలు  

భారత దేశంలో సైన్యంతో సహా పలు కీలక రంగాలలోకి మహిళలు చొచ్చుకు పోవడమే  కాకుండా, దేశ జనాభాలో తొలిసారిగా మహిళల జనాభా, పురుషుల జనాభాను మించిపోయింది. దేశంలో ప్రస్తుతం ప్రతి 1000 మంది పురుషులకు 1020 మంది మహిళలు ఉన్నారు. లింగ నిష్పత్తి పరంగా మహిళల జనాభా నగరాల్లో కన్నా గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉండడం మరో విశేషం. నగరాల్లో ప్రతి వెయ్యి మంది పురుషులకు 985 మంది మహిళలు ఉండగా, గ్రామాల్లో 1037 మంది మహిళలు ఉన్నారు. 

ఈ విషయం, కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖ నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎ్‌ఫహెచ్‌ఎ్‌స)లో తేలింది. ఈ మేరకు 2019-2020కి సంబంధించి రెండు దశల్లో జరిగిన ఎన్‌ఎ్‌ఫహెచ్‌ఎ్‌స సర్వే పూర్తి వివరాలను కేంద్రం వెల్లడించింది.  ఐదేళ్ల క్రితం 2015-16 ఎన్‌ఎ్‌ఫహెచ్‌ఎ్‌స సర్వేలో ప్రతి వెయ్యి మంది పురుషులకు 919 మంది మహిళలు మాత్రమే ఉన్నట్లు తేలింది.

 కాగా జనాభా పరంగా ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న భారత్‌.. జనాభా స్థిరీకరణ దిశగా అడుగులు వేస్తోందని ఈ సర్వే ద్వారా వెల్లడైంది. మొత్తం సంతానోత్పత్తి రేటు (టీఎఫ్టీ) 2.2 నుంచి 2.0కు పడిపోయింది. టీఎఫ్టీ 2 కన్నా తక్కువగా ఉంటే కాలక్రమేణా జనాభాలో తగ్గుదల నమోదవుతుందని వెల్లడి చేస్తుంది. 

ఇక దేశంలో కండోమ్‌ల వినియోగం 5.6శాతం నుంచి 9.5శాతానికి పెరిగింది. 15-49 ఏళ్లలోపు పురుషుల్లో 82 శాతం మంది హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నిరోధించేందుకు కండోమ్‌ సురక్షితమైనదిగా అభిప్రాయపడ్డారు. మొత్తంగా సంతానోత్సత్తి, కుటుంబ నియంత్రణ, వివాహ వయసు, మహిళల సాధికారత పరంగా చెప్పుకోదగ్గ అభివృద్ధి సాధించినట్లయిందని ఈ సర్వే ద్వారా వెల్లడైందని చెబుతున్నారు. 

గుజరాత్‌, మహరాష్ట్ర, అరుణాచల్‌ ప్రదేశ్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో.. కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్‌, చండీగఢ్‌, ఢిల్లీ, అండమాన్‌ నికోబార్‌, దాద్రానగర్‌ హవేలీ, లద్దాఖ్‌లో మహిళలకన్నా పురుషులు ఎక్కువగా ఉన్నారు. కేరళలో అత్యధికంగా ప్రతి వెయ్యిమంది పురుషులకు 1,121 మంది మహిళలు ఉన్నారు. గత సర్వే (1,049) కన్నా 72 మంది చొప్పున పెరిగారు.  

మొత్తం సంతానోత్పత్తి రేటు కేరళలో మరింత మెరుగుపడింది. గత సర్వేలో టీఎఫ్టీ 1.8గా ఉంటే ప్రస్తుతం 1.6గా నమోదైంది. బిహార్‌, మేఘాలయ, మణిపూర్‌, జార్ఖండ్‌, యూపీలో మాత్రం మొత్తం సంతానోత్పత్తి రేటు 2 కన్నా ఎక్కువగా నమోదైంది. బిహార్‌లో ఇది 3గా ఉండటం విశేషం అయితే గత ఎన్‌ఎ్‌ఫహెచ్‌ఎ్‌స సర్వేలో అక్కడ టీఎఫ్టీ 3.4గా నమోదవడంతో ఆ రాష్ట్రం మెరుగుపడినట్లే.  

దేశంలో దాదాపు 78శాతం తల్లులకు ప్రసవించిన రెండు రోజుల్లోనే డాక్టర్లు/నర్సులు/ఎల్‌హెచ్‌వీ/ఎన్‌ఎన్‌ఎం నుంచి చక్కని వైద్య సేవలు అందాయి. తద్వారా దేశంలో శిశు మరణాలు తగ్గాయి. దేశంలో పెళ్లయిన 15-49 ఏళ్ల లోపు మహిళల్లో 66.7శాతం మంది గర్భదారణను ఆలస్యం లేదా నిరోధించడం కోసం కుటుంబ నియంత్రణ సాధనాల్లో ఏదో ఒకటి వాడుతున్నారు. 

ఐదేళ్ల క్రితంతో పోలిస్తే ఈ ధోరణి గణనీయంగా పెరిగింది. అప్పట్లో ఇది 53.5శాతంగానే ఉండేది. దేశంలో జననాల నమోదు కూడా గణనీయంగా పెరిగింది. ఐదేళ్ల క్రితం ఇది 79.7శాతంగా ఉంటే ప్రస్తుతం 89.1శాతంగా ఉంది. 

అయితే ‘నమూనా సర్వే’ ఆధారంగా ఆ ఈ గణాంకాలు వెలువడ్డాయి. దేశంలోని 707 జిల్లాల్లోని 6,50,000 మంది వ్యక్తుల ఇళ్లలో ఈ సర్వే నిర్వహించబడింది. రెండో దశలో అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఒరిస్సా, పాండిచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సర్వే నిర్వహించారు. 

కాబట్టి ఆ సమాచారం పెద్ద జనాభాకు వర్తిస్తుందా లేదా అనేది జనాభా గణన తర్వాత స్పష్టమవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, సర్వే ఫలితాలు చాలా రాష్ట్రాలు మరియు భూభాగాల్లో డేటా సరిపోలే అవకాశం ఉందని చూపిస్తుంది.

“పుట్టుకలో మెరుగైన లింగ నిష్పత్తి కూడా ఒక ముఖ్యమైన విజయం; జనాభా లెక్కల ద్వారా వాస్తవ చిత్రం బయటపడే అవకాశం ఉన్నప్పటికీ, మహిళా సాధికారత కోసం మా చర్యలు సరైన దిశలో మళ్లించాయని ఫలితాలను చూస్తుంటే మేము ఇప్పుడు చెప్పగలం,” అని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, మిషన్ డైరెక్టర్, నేషనల్ హెల్త్ మిషన్ వికాస్ షీల్ విశ్వాసం వ్యక్తం చేశారు. 

“మనం ఇప్పుడు వృద్ధాప్య జనాభాగా ఉన్నామనే వాస్తవం గ్రహించి స్త్రీల ఆరోగ్యం పట్ల మన  విధానానికి పునరుత్పత్తి ఆరోగ్యానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేది కాకుండా మరింత సమగ్రమైన జీవిత చక్ర వీక్షణ అవసరమని సూచిస్తుంది” అని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ ప్రెసిడెంట్ యామిని అయ్యర్ తెలిపారు. 

“2019-20లో అంతకు ముందుకన్నా ఎక్కువ మంది మహిళలు పదేళ్ల పాఠశాల విద్యను పూర్తి చేశారనే వాస్తవం, మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం తగ్గడంతో పాటు భారతదేశ కార్మిక మార్కెట్‌లో గణనీయమైన నిర్మాణాత్మక సవాళ్లను సూచిస్తుంది. భారతదేశం పురోగమించాలంటే వీటిని తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉంది” అని ఆమె పేర్కొన్నారు.