దక్షిణాఫ్రికా వేరియంట్ తో భారత్ ఆంక్షలు

ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడంతో అట్నార్జాతీయ ప్రయాణికుల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం హెచ్చరించింది. దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్‌ వెలుగులోకి వచ్చింది. పలు దేశాల్లో కొత్త వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి. 
 
ఈ నేపథ్యంలో అంతర్జాతీయ రాకపోకల కోసం సవరించిన మార్గదర్శకాలలో సూచించిన ఇతర ‘ప్రమాదకర’ దేశాల నుండి ప్రయాణించే వారితోపాటు ఇతర దేశాల నుంచి వచ్చే ఆయా అంతర్జాతీయ ప్రయాణికులకు కఠినమైన స్క్రీనింగ్, కరోనా పరీక్షలు నిర్వహించాలని కేంద్రం తెలిపింది. వారిని కలిసిన వారిని కూడా తప్పనిసరిగా ట్రాక్‌ చేసి కరోనా టెస్ట్‌లు చేయాలని పేర్కొంది.

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషన్‌ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు సూచనలు చేశారు. దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్‌ బీ.1.1.529 వేరియంట్‌ను గుర్తించారు. ఇప్పటికే కొత్త వైరస్‌ కేసులు దక్షిణాఫ్రికా, బోట్స్వానా, హాంగ్‌కాంగ్‌లోనూ పలు నమోదయ్యాయి. 

ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల పట్ల మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, కాంటాక్టులను తప్పనిసరిగా ట్రాక్‌ చేయడంతో పరీక్షలు చేయాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా బి.1.1.529 వేరియంట్‌ లక్షణాలను తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారని దక్షిణాఫ్రికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కమ్యూనికేబుల్ డిసీజెస్\తెలిపింది. 

కొత్త వేరియంట్‌ గుర్తించిన నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ శుక్రవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది .ఈ ఏడాది ప్రారంభంలో, మధ్యలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా కేసులు నమోదయ్యేందుకు డెల్టా వేరియంటే కారణమని నిపుణులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ప్రయాణికుల్లో బోట్స్వానా, హాంకాంగ్‌ దేశాల్లోనూ గుర్తించారు.