స్మాషింగ్ బ్యాట్స్‌మెన్‌లా బ్యాటింగ్ కొనసాగించు

లక్నో రాజభవన్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో ఏదో విషయమై తీవ్రంగా చర్చిస్తూ నడుస్తున్న ఫోటో మీడియాలో వైరల్ గా మారింది. అయితే వారిద్దరూ ఏ విషయమై మాట్లాడుకున్నారో మాత్రం బైటకు రాలేదు. 

ఈ ఫోటోలో ఆదిత్యనాథ్ కు ప్రధాని యుపిలో తిరిగి బీజేపీ విజయం సాధించేందుకు స్మాషింగ్ బ్యాట్స్‌మెన్‌లా బ్యాటింగ్ కొనసాగించాలని సూచించారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.  సీతాపూర్‌లో జరిగిన బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తూ ఈ విషయం తెలిపారు.

“ఆ ఫోటోలో మోదీజీ యోగి జీ భుజంపై చేయి వేసి ఉండడాన్ని మీరు చూసి ఉంటారు. ప్రధాని ఆయన చెవిలో ఏమి చెప్పారో అని ప్రజలు ఆశ్చర్యపోయారు. ప్రధాని మోదీ ఇలా అన్నారు, “మీరు ఒక స్మాషింగ్ బ్యాట్స్‌మెన్ లాగా బ్యాటింగ్ చేస్తున్నారు, యోగీ జీ. ఇలాగే బ్యాటింగ్‌ కొనసాగించండి, బీజేపీ ఘన విజయం సాధిస్తుంది’’ అని రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. 

గత ఆదివారం, యోగి ఆదిత్యనాథ్ ప్రధాని నరేంద్ర మోదీతో లోతైన చర్చలో పాల్గొన్న ఫోటోలను పంచుకోవడంతో ట్విట్టర్ కలకలం రేపింది. ఫోటోలో, ఆదిత్యనాథ్ భుజంపై చేయి వేసుకుని నడుస్తున్న 49 ఏళ్ల సీఎంకు ప్రధాని మోదీ సలహా ఇస్తున్నారు. ట్విటర్‌లో ఆదిత్యనాథ్, “‘ఆకాశం కంటే ఎత్తుకు వెళ్లాలనే మొండితనం ఉంది” అని రాశారు.

ప్రధానిమోదీ, యోగి ఆదిత్యనాథ్ మధ్య విభేదాలు పుకార్ల మధ్య ఈ ఫోటోలు వచ్చాయి. జూన్‌లో, యూపీ మంత్రివర్గ విస్తరణపై చర్చించేందుకు జూన్ 10-11 తేదీల్లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా బీజేపీ అగ్రనేతలను ఆదిత్యనాథ్ కలిశారు. పార్టీ నాయకత్వంలో కానీ, రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణంలో కానీ ఎలాంటి మార్పు ఉండదని బిజెపి అధిష్ఠానం స్పష్టత ఇచ్చింది. 

కేంద్రం, రాష్ట్ర నాయకత్వానికి మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చేందుకు ఆదిత్యనాథ్ నేతృత్వంలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తామని ఆయన భేటీ అనంతరం బీజేపీ తేల్చిచెప్పింది. ఆ తర్వాత, పలువురు ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి నాయకులు యుపిని సందర్శించి యోగి ప్రభుత్వ కరోనా నిర్వహణను ప్రశంసించారు.

2017లో 403 సీట్లలో 314 గెల్చుకొని ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆదిత్యనాథ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలకు వెడుతున్నారు. ప్రస్తుత యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో బిజెపి పోరాడుతున్న నేపథ్యంలో అధికార బిజెపికి సవాలు విసిరేందుకు అనేక ఫ్రంట్‌లు పుట్టుకొచ్చాయి. 

2022 అసెంబ్లీ ఎన్నికల కోసం ఎస్పీ చిన్న రాజకీయ పార్టీలతో మాత్రమే పొత్తు పెట్టుకుంటుందని, మహాన్ దళ్, ఎన్సీపీ, ఎస్బీఎస్పీలతో చర్చలు జరుపుతుందని ఎస్పీ అధినేత అఖిలేష్ సింగ్ యాదవ్ ప్రకటించారు. 

యూపీ, ఉత్తరాఖండ్‌లలో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, పంజాబ్‌లో అకాలీదళ్‌తో మాత్రమే పొత్తు పెట్టుకుంటోందని మాయావతి ఇప్పటికే ప్రకటించారు. రాష్ట్రంలో ప్రియాంక గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ దూకుడుగా ప్రచారం చేస్తున్నా ఒంటరిగానే మిగులుతుంది. 

చివరి ప్రయత్నంగా, యోగి ఆదిత్యనాథ్ తన మంత్రివర్గాన్ని విస్తరించింది – జితిన్ ప్రసాద, పాల్తు రామ్, ఛత్రపాల్ సింగ్ గంగ్వార్, సంజీవ్ కుమార్, సంగీతా బల్వంత్, ధర్మవీర్ సింగ్, దినేష్ ఖటిక్ అనే ఏడుగురు కొత్త మంత్రులను చేర్చుకున్నారు, దీనితో మంత్రివర్గం సంఖ్య 60కి చేరుకుంది.

కుల సమీకరణాన్ని దృష్టిలో ఉంచుకుని, యోగి ముగ్గురు ఎస్సీ మంత్రులను – సంజీవ్ కుమార్, దినేష్ ఖతీక్,  పల్తు రామ్; మరో ముగ్గురు ఓబిసి మంత్రులు – ధర్మవీర్ సింగ్, డాక్టర్ సంగీతా బల్వంత్, ఛత్రపాల్ గంగ్వార్ లతో పాటు బ్రాహ్మణ ముఖంగా  జితిన్ ప్రసాదలను చేర్చుకున్నారు. సంజయ్ నిషాద్, గోపాల్ అంజన్ భుర్జీ, వీరేంద్ర గుర్జార్, జితిన్ ప్రసాద అనే 4 మంది నేతలను కూడా బీజేపీ శాసనమండలికి నామినేట్ చేసింది.