రాజ్యాంగ బద్దతకు ఆందోళన కలిగించే వారసత్వ పార్టీలు

రాజకీయ పార్టీలు తమ ప్రజాస్వామ్య స్వభావాన్ని కోల్పోయినప్పుడు రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతింటుందని కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు.  “రాజ్యాంగ పార్టీలు రాజ్యాంగానికి కట్టుబడి ఉన్న ప్రజలకు ఆందోళన కలిగించే విషయం. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వారసత్వ రాజకీయ పార్టీలను చూడండి.  ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం” అని స్పష్టం చేశారు. 

పార్ల‌మెంట్ సెంట్ర‌ల్ హాల్‌లో జరిగిన రాజ్యాంగ దినోత్స‌వ సంబ‌రాల‌లో పాల్గొంటూ తరతరాలుగా పార్టీని ఒక కుటుంబం నడుపుతుంటే, మొత్తం పార్టీ వ్యవస్థ ఒక కుటుంబంతో ఉంటే అది ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి అతిపెద్ద సమస్య అని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ వైఖ‌రిపై మండిపడుతూ పార్టీ ఫ‌ర్ ద ఫ్యామిలీ.. పార్టీ బై ద ఫ్యామిలీ అన్న‌ట్లుగా మారింద‌ని ప్రధాని ఎద్దేవా చేశారు. ఈ అంశంపై అంత‌క‌న్నా ఎక్కువ‌గా చెప్ప‌డం త‌న‌కు ఇబ్బందిగా ఉంద‌ని పేర్కొన్నారు. 

ఒకే పార్టీ దేశాన్ని పాలించ‌డం కానీ, ఒక పార్టీ వ్య‌వ‌స్థ మొత్తం ఒకే కుటుంబం చేతుల్లో ఉండ‌డం స‌రికాద‌ని స్పష్టం చేశారు. ఒక జాతీయ పార్టీ త‌ర‌త‌రాలు ఒకే కుటుంబం చేతుల్లో ఉంటే, అది ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌జాస్వామ్యానికి స‌మ‌స్య‌గా మారుతుంద‌ని ఆయ‌న హెచ్చరించారు. 

 ఒక కుటుంబం నుంచి పార్టీలోకి ఎక్కువ మంది రావ‌ద్దు అన్న ఆంక్ష‌లు ఏవీ లేవ‌ని ప్రధాని చెప్పారు. యోగ్యులైన వారు ఒకే కుటుంబంలో ఎంద‌రు ఉన్నా.. ప్ర‌జ‌ల దీవ‌నెలు ఉంటే.. వారంతా పార్టీలో సేవ చేయ‌వ‌చ్చని స్పష్టం చేశారు. కానీ ఒక పార్టీని త‌ర‌త‌రాలు ఒకే కుటుంబం ఏలితే, ఆ పార్టీలో ఉన్న వ్య‌వ‌స్థ‌ల‌న్నీ ఒకే కుటుంబం వ‌ద్ద ఉంటే, అది ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థకు సంక‌టంగా మారుతుంద‌ని ప్ర‌ధాని మోదీ తేల్చి చెప్పారు. 

భారత రాజ్యాంగాన్ని మనకు అందించాలని మన దేశంలోని పలువురు నాయకులు మేధోమథనం చేశారని ప్రధాని గుర్తు చేశారు.  రాజ్యాంగ దినోత్సవం పార్లమెంట్ కు  సెల్యూట్ చేసే రోజు అని చెప్పారు. ఇక్క‌డే అనేక మంది నేత‌లు త‌మ మేథోమ‌థ‌నంతో రాజ్యాంగాన్ని ర‌చించిన‌ట్లు చెప్పారు. 

మ‌హాత్మా గాంధీతో పాటు దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన ఎంతో మంది నేత‌ల‌కు నివాళి అర్పిస్తున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు. ముంబైలో ఉగ్ర‌దాడులు జ‌రిగి నేటికి 14 ఏళ్లు అవుతోంద‌ని, ఉగ్ర‌వాదుల‌తో పోరాడుతూ ప్రాణాలు అర్పించిన సాహ‌స సైనికుల‌కు నివాళ్లు అర్పిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. 

1950 త‌ర్వాత ప్ర‌తి ఏడాది రాజ్యాంగ దినోత్స‌వాన్ని నిర్వ‌హించాల్సి ఉండె అని, రాజ్యాంగ నిర్మాణంపై ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌ప‌ర‌చాల్సిన అవ‌స‌రం ఉండెడిది కాదని  ఆయ‌న పేర్కొన్నారు. కానీ కొంద‌రు అలా వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని విమర్శించారు. మ‌న హ‌క్కుల ర‌క్ష‌ణ కోసం మ‌న విధులు ఏంటో తెలుసుకోవాల‌ని కోరారు. 

సమాజంలో ఏ ఒక్కరూ వెనుకబడకూడదన్నదే రాజ్యాంగకర్తల లక్ష్యమని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు తెలిపారు. నవ భారత నిర్మాణంలో రాజ్యాంగం కీలక పాత్ర పోషించిందని చెప్పారు.రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న నవంబర్‌ 26 చారిత్రక దినం అని ఆయన తెలిపారు. 

ప్రజాస్వామ్య దేశ తత్వాన్ని రాజ్యాంగ పీఠిక ప్రతిబింబించిందని చెప్పారు. ప్రజా సంక్షేమమే కేంద్రంగా అభివృద్ధి జరగాలని సూచించారు. భారతీయులంతా ఒక్కటే.. ఒకరి కోసం అందరం ఉన్నామని చెప్పారు. సవాళ్లకు అనుగుణంగా మార్చుకునే స్వభావం మన రాజ్యాంగానికి ఉందన్నారు. సురక్షిత, సుశిక్షిత, స్వాస్థ్య భారత్‌ మనందరి లక్ష్యం కావాలని ఉపరాష్ట్రపతి వివరించారు. 

భార‌త రాజ్యాంగం ఆధునిక భ‌గ‌వ‌త్ గీత అని లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా  తెలిపారు. దేశం ప‌ట్ల మ‌న క‌ర్త‌వ్యాన్ని నిర్వ‌ర్తించేందుకు రాజ్యాంగం మ‌న‌ల్ని ప్రేరేపిస్తుంద‌ని పేర్కొన్నారు. ప్ర‌తి ఒక్క‌రం దేశం కోసం ప‌నిచేయాల‌ని త‌పిస్తే, అప్పుడు మ‌నం ఏక్ భార‌త్‌, శ్రేష్ట భార‌త్‌ను నిర్మించ‌వ‌చ్చు అని స్పీక‌ర్ బిర్లా తెలిపారు. 

కాగా, రాజ్యాంగ దినోత్స‌వ సంబ‌రాల‌కు విప‌క్షాలు గైరజరయ్యాయి. 14 ప్ర‌తిప‌క్షాలు పార్టీలు ఆ వేడుక‌ల‌కు హాజ‌రుకాలేదు. కాంగ్రెస్‌, తృణ‌మూల్ కాంగ్రెస్‌తో పాటు అనేక పార్టీలు ఈ వేడుక‌ల్లో పాల్గొన‌లేదు. ప్ర‌భుత్వం రాజ్యాంగాన్ని ఆరోపించారు.