టీఆర్ఎస్‌కు మాజీ మేయర్ రవీందర్ సింగ్ రాజీనామా

పార్టీలో మొదటినుంని ఉన్నవారికి పదవుల ఆశ చూపుతూ మధ్యలో వచ్చిన వారికి అందలం ఎక్కించడమే కాకుండా, తాజాగా ఎమ్యెల్సీ ఎన్నికలలో అనూహ్యంగా కుమార్తె కవితను తెరపైకి తీసుకు రావడం, ఆమెకు మంత్రి పదవి కూడా ఇవ్వనున్నట్లు కధనాలు వెలువడుతూ ఉండడంతో అధికార టీఆర్ఎస్‌ లో కలకలం రేపుతున్నది. పలువురు రాజీనామా బాట పడుతున్నారు. 

టీఆర్ ఎస్ పార్టీకి క‌రీంన‌గ‌ర్ మాజీ మేయ‌ర్ ర‌వీంద‌ర్ సింగ్ రాజీనామా చేశారు. ఈ మేర‌కు పార్టీ అధ్య‌క్షుడు, సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. తనకు అనేక సార్లు ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేసి మాట తప్పారని రాజీనామా లేఖలో గుర్తు చేసిన రవీందర్ సింగ్. ఉద్యమకారులను పక్కన పెట్టి, పార్టీలో చేరిందే తడవుగా పదవులిచ్చి ఉద్యమకారులను అవమానించారని ఆయన మండిప‌డ్డారు. 

తెలంగాణ ఉద్యమ ద్రోహులను అందలమెక్కిస్తూ, ఉద్యమకారులను అవమానాలకు గురిచేస్తూ అవకాశాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని అంటూ కేసీఆర్ వైఖరిని ఎండగట్టారు. తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని కేసీఆర్‌ ఇచ్చిన పిలుపును అందుకుని బీజేపీ కరీంనగర్‌ జిల్లా శాఖ అధ్యక్షుడిగా ఉన్న తాను, ఆ పదవికి రాజీనామా చేసి, టీఆర్‌ఎ్‌సలో చేరానని గుర్తు చేశారు. 

“ఉద్యమకారుల పరిస్థితి చూసి కన్నీళ్లు వచ్చినా, తెలంగాణ అభివృద్ధి పేరిట అన్ని భరిస్తూ వచ్చాం. ఉద్యమ ద్రోహులకు అందలమెక్కిస్తూ, ఉద్యమకారులకు అవమానాలు చేస్తుంటే బాదేస్తోంది. కరీంనగర్ జిల్లాలో కొందరి చేతిలో టీఆర్ఎస్ పార్టీ బందీ అయినా పట్టించుకోవడం లేదు” అంటూ ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇలాంటి విషయాలన్నీ మీకు చెబుతామంటే కనీసం సమయం కూడా ఇవ్వడం లేదని అంటూ కేసీఆర్ పై ధ్వజమెత్తారు. కరీంనగర్ జిల్లాలో పార్టీని భ్రష్టు పటిస్తూ, అనేక అవినీతి ఆరోపణలు వచ్చినా మీరు పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు.

“అధికారం రాకముందు మీరు ఉద్యమకారులను ఎలా గౌరవించేవారో.. అధికారం వచ్చాక వారి పరిస్థితి ఏమిటో ఓసారి గుర్తు చేసుకోండి” అంటూ ముఖ్యమంత్రికి హితవు చెప్పారు.  టీఆర్ఎస్ పార్టీలో నిజమైన ఉద్యమకారులకు స్థానం, గౌరవం లేదని గుర్తించి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 

మరోవంక,    టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆపార్టీ అధినేత‌కు నిజామాబాదు జిల్లాకు చెందిన ఆ పార్టీ నేత గట్టు రామచంద్రరావు బహిరంగ లేఖ రాశారు. తాను ఆశించిన స్థాయిలో పార్టీలో రాణించలేకపోయానని, కేసీఆర్‌ అభిమానం పొందడంలో గుర్తింపు తెచ్చుకోవడంలో విఫలమయ్యానని ఆ లేఖలో పేర్కొన్నారు.