బిజెపి టచ్ లో టీఆర్ఎస్ అసంతృప్తి నేతలు!

టీఆర్ఎస్ నుంచి చాలా మంది అసంతృప్త నేతలు తమతో టచ్ లో ఉన్నారని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ వ్య‌వ‌హారాల ఇన్‌చార్జి త‌రుణ్‌చుగ్‌ వెల్లడించారు. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే టీఆర్ ఎస్‌కు 60 మంది కూడా అభ్య‌ర్థులు దొర‌క‌రని స్పష్టం చేశారు. 

 పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్యెల్యేలు రెండు డజన్ల మంది వరకు బిజెపి నాయకులతో టచ్ లో ఉన్నారని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. 

ఇక్కడ బిజెపి బలపడినదని, దానితో వివిధ పార్టీల నేతలు ఇప్పుడు బిజెపి వైపు చూస్తున్నారని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. తెలంగాణ లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ 80 స్థానాలు గెలుచుకుంటుందని.. ఎన్నికలు వస్తే మా సత్తా తెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

 తమ వద్ద 119 మంది అభ్యర్థులున్నారని, వారిలో గెలిచే 80 మంది జాబితా కూడా సిద్ధంగా ఉందని తెలిపారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్ ఢిల్లీ పోయి వచ్చి ఏం చేసిండు?. ఢిల్లీ వచ్చి ఏం సాధించాడు? కేసీఆర్ తెలంగాణ రైతులకు సమాధానం చెప్పాలని ఆయన నిలదీసేరు.  ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ చేసేదంతా రాజకీయమేననిఆయన ధ్వజమెత్తారు. రైతుల ధాన్యం తప్పనిసరిగా కేంద్రం కొంటుందని భరోసా ఇచ్చారు.  

తెలంగాణలో కాంగ్రెస్ ది ముగిసిన అధ్యాయం అని తెలిపారు. ఇకపై ప్రజాసమస్యలపై పోరాడి బంగారు తెలంగాణ సాధన ధ్యేయంగా అడుగులేస్తామని ఆయన స్ప‌ష్టం చేశారు.

ఇలా ఉండగా,  తెలంగాణలో టీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అభిప్రాయపడింది. ఉద్యమాలతోనే ఇది సాధ్యమైందని పేర్కొంది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలపైన, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు ఉధృతం చేయాలని నిర్ణయించింది. 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అధ్యక్షతన శుక్రవారం హైదరాబాద్‌ బండ్లగూడలోని మహావీర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. దళిత బంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే విషయంలో పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలతోపాటు గిరిజన, బీసీలకూ ఈ పథకాన్ని వర్తింపజేసే అంశంపై సభ్యులు పలు సూచనలు చేశారు. 

వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెడతామని ఇచ్చిన హామీ అమలులో కేసీఆర్‌ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ధరణి పోర్టల్‌ తప్పుల తడకగా ఉందని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నిరుద్యోగంలో తెలంగాణ 5వ స్థానంలో ఉందని, ఉద్యోగాల భర్తీ కోసం త్వరలోనే లక్షలాది మందితో మిలియన్‌ మార్చ్‌ నిర్వహించాలని నిర్ణయించారు.