భారత్ కు మూడో వేవ్ ముప్పు తప్పిన్నట్లే!

భారత్‌లో కరోనా మహమ్మారి మూడో వేవ్‌ ముప్పు ఉండకపోవచ్చని, ఒక వేళ వచ్చినా రెండో ఉధృతి స్థాయిలో ఉండదని నిపుణులు అంచనా వేస్తున్నారు.  రెండో వేవ్‌ సమయంలోనే దేశంలో అత్యధిక మంది కరోనా బారిన పడ్డారు. అనంతరం వ్యాక్సిన్‌ల పంపిణీ కూడా వేగవంతంగా సాగడం వైరస్‌ తీవ్రతను అడ్డుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. 

అలాగే శీతాకాలం ప్రారంభమైనందున ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని పునరుద్ఘాటించారు. కరోనా నుంచి కోలుకున్నవారు వ్యాక్సిన్‌ రెండు డోసులు కూడా తీసుకోవడంతో వారిలో మిశ్రమ రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందుతోందని.. అది కూడా మూడో ముప్పు నివారణలో అత్యంత కీలకంగా పనిచేస్తోందని వివరించారు.

అయితే వేగంగా వ్యాప్తి చెందే కొత్త వేరియంట్‌ వస్తే మాత్రం థర్డ్‌ వేవ్‌ తప్పకపోవచ్చునని హెచ్చరిస్తున్నారు. దసరా, దీపావళి వంటి పండుగల నేపథ్యంలో ప్రజలు అధిక శాతం మంది గుమిగూడే అవకాశాలుండటంతో ఈ ఏడాది అక్టోబరు-నవంబరులో భారత్‌లో మూడో వేవ్‌ తీవ్రస్థాయిలో ఉండవచ్చని పలువురు నిపుణులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. 

అయితే భారత్‌లో 46 రోజులుగా రోజువారీ కొత్త కేసుల సంఖ్య 20 వేలకు దిగువనే నమోదవుతున్నాయి. దీనిపై నిపుణులు స్పందిస్తూ ‘డిసెంబరు చివరి నుండి ఫిబ్రవరి వరకు శీతాకాలం కావడంతో దేశంలో కరోనా కేసులు పెరిగే అవకాశముందని పేర్కొంటున్నారు.  అయితే రెండో ఉధృతి  స్థాయిలో ఉండకపోవచ్చని స్పష్టం చేస్తున్నారు. 

కొత్త వేరియంట్‌ పుట్టుకొస్తే తప్ప.. దేశానికి మూడో ముప్పు తప్పినట్లే అని అశోక విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ గౌతమ్‌ మేనన్‌ పేర్కొన్నారు. భారత్‌లో మూడో ఉధృతి ఇప్పటికే వచ్చి, సెప్టెంబరులోనే ముగిసి ఉండవచ్చని చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమెటికల్‌ సైన్సెస్‌ (ఐఎంఎస్‌సి) ప్రొఫెసర్‌ సీతాభ్ర సిన్హా అంచనా వేశారు.