తొలి రోజే మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల తొలి రోజు (ఈనెల 29న) మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్ట పట్టనున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం సభా కార్యకలాపాల జాబితాలో పేర్కొంది. రైతు ఉత్పత్తి వ్యాపారం, వాణిజ్యం (ప్రోత్సాహం, సదుపాయాల కల్పన) చట్టం-2020, నిత్యావసర వస్తువుల (సవరణ) చట్టం-2020, రైతుల ధర హామీ, సేవలు ఒప్పందం (సాధికారిత, రక్షణ) చట్టం-2020లను రద్దు చేస్తూ ఈ నెల 29న బిల్లు ప్రవేశపెట్టనున్నారు. 
 
2020 సెప్టెంబర్‌లో పార్లమెంట్‌ చేసిన ఈ చట్టాలను కొంతమంది  రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ చట్టాలకు సంబంధించిన ఆర్డినెన్స్‌ తీసుకొచ్చినప్పటి నుండి కొందరు  రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ నెల 19న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని, దానికి సంబంధించి రాజ్యాంగ ప్రక్రియ పార్లమెంట్‌ సమావేశాల్లో పూర్తి చేస్తామని ప్రకటించారు. 
 
అందులో భాగంగానే ఈనెల 29న ప్రారంభం కానున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో మొదటి రోజే లోక్‌సభలో చట్టాల రద్దు బిల్లును ప్రవేశపెట్టేందుక కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, ఈ చట్టాల అమలుపై జనవరిలోనే సుప్రీం కోర్టు స్టే విధించింది.

ఇక ఆర్థిక రంగంపై తీవ్ర ప్ర‌భావం చూపే ప్రైవేట్ క్రిప్టోక‌రెన్సీల‌పై నిషేధం విధించేందుకూ మ‌రో బిల్లు ప్ర‌తిపాదించ‌నున్న‌ది. వీటితోపాటు విద్యుత్ చ‌ట్ట స‌వ‌ర‌ణ‌తోపాటు మొత్తం 26 బిల్లులు పార్ల‌మెంట్ ముందుకు రానున్నాయ‌ని లోక్‌స‌భ సెక్ర‌టేరియ‌ట్ జారీ చేసిన బులెటిన్‌లో తెలిపింది.

ఇప్పటికే ఆర్డినెన్స్‌ రూపంలో ఉన్న.. నార్కొటిక్‌ డ్రగ్స్‌, సైకోట్రోపిక్ పదార్థాలు చట్ట సవరణ, విజిలెన్స్‌ కమిషన్‌ చట్ట సవరణ, ఢిల్లీ ప్రత్యేక పోలీసు చట్ట సవరణ బిల్లులను పార్ల‌మెంట్‌కు రానున్నాయి. ఇక ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ డైరెక్ట‌ర్‌, సీబీఐ డైరెక్టర్ల పదవీ కాలం పెంచుతూ ఇటీవల కేంద్రం ఆర్డినెన్స్‌ తీసుకువచ్చింది.

వీటితో పాటు.. ఛార్టెడ్‌ అకౌంట్స్‌ చట్టం ప్రకారం… డిసిప్లీనరీ మెకానిజం వేగ‌వంతానికి ప్ర‌త్యేక వ్య‌వ‌స్థ ఏర్పాటు, దివాళా చట్ట సవరణ బిల్లు, త్రివిధ దళాల ఇంటర్‌ సర్వీసెస్‌ బిల్లు, ఇమిగ్రేషన్‌ బిల్లు, పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ చట్ట సవరణ బిల్లు, బ్యాంకింగ్‌ చట్ట సవరణ బిల్లు, మారిటైం ఫిషరీస్‌ బిల్లు, డెంటిస్ట్‌ చట్టాన్ని రద్దు చేస్తూ.. జాతీయ డెంటల్‌ కమిషన్‌ ఏర్పాటు చేసే బిల్లు పార్ల‌మెంట్ ముంగిటికి తేనున్న‌ది.

మెట్రో రైలు నిర్మాణం, ఆపరేషన్‌, మెయింటెనెన్స్‌ బిల్లు, సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిల వేతనాల చట్ట సవరణ బిల్లు, జాతీయ ట్రాన్స్‌పోర్ట్‌ విశ్వవిద్యాలయం, మహిళలు.. చంటి పిల్లల ఎగుమతి (ట్రాఫికింగ్‌) నిరోధం ప‌టిష్ట ప‌రిచే బిల్లు, యాంటి డోపింగ్‌తో పాటు.. మరికొన్ని బిల్లులకు చట్టరూపం తెచ్చేందుకు పార్లమెంటు ఆమోదానికి కేంద్రం ప్రవేశ పెట్టనుంది.