అసదుద్దీన్ ఒవైసీ సమాజ్ వాదీ పార్టీ ఏజెంట్

 
ఉత్తర ప్రదేశ్ ఎన్నికలలో పోటీకి సిద్ధపడుతున్న హైదరాబాద్ కు చెందిన ఎంఐఎం నాయకుడు  అసదుద్దీన్ ఒవైసీ సమాజ్ వాదీ పార్టీ ఏజెంట్.  అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ధ్వజమెత్తారు. పౌరసత్వ చట్టాన్ని రద్దు చేయాలనే పేరుతో ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికల ముందు హింసను,  ఉద్రిక్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 
 
రాష్ట్రంలో నెలకొన్న ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేయాలని  ఎవ్వరు ప్రయత్నించైనా అటువంటి వారి పట్ల కఠినంగా ఏవిధమైన చర్యలు తీసుకోవాలో తమ ప్రభుత్వనాయికి తెలుసని  ఆయన హెచ్చరించారు.  కాన్పూర్‌లో జరిగిన బిజెపి పోలింగ్ బూత్ కార్యకర్తల సమావేశంలో పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డాతో కలసి పాల్గొంటూ అంతకుముందు ఉత్తరప్రదేశ్‌లో ప్రతి “మూడవ లేదా నాల్గవ రోజు” అల్లర్లు జరిగేవని గుర్తు చేశారు.
 
నేడు రాష్ట్రంలో అల్లర్లు జరగడం లేదని చెబుతూ, “సిఎఎ పేరుతో మరోసారి ఉద్రిక్తలను  రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని నేను హెచ్చరించాలను కుంటున్నాను. భావాలను రెచ్చగొట్టి రాష్ట్ర వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, ‘చాచా జాన్’ (మామ), ‘అబ్బాజాన్’ అనుచరులు జాగ్రత్తగా వినాలని నేను కోరుతున్నాను’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 

“ఎస్పీ ఏజెంట్‌గా ఒవైసీ ప్రజల మనోభావాలను రెచ్చగొడుతున్నారని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు యుపి అల్లర్లకు కాదు, అల్లర్లు లేని రాష్ట్రంగా పేరు పొందింది” అని గుర్తు చేశారు. 

ప్రభుత్వం అభివృద్ధి కోసం పని చేస్తుందని, ఇక్కడ మాఫియాలకు ఆస్కారం లేదని సీఎం స్పష్టం చేశారు. “ఇది మాఫియాల ఛాతీపై బుల్‌డోజర్‌లను నడుపుతున్న ప్రభుత్వం” అని నేరస్థుల యాజమాన్యంలోని ఆస్తుల కూల్చివేత గురించి ఆయన ప్రస్తావిస్తు హెచ్చరించారు. 
 
ఉత్తర ప్రదేశ్ లో 100 సీట్లలో పోటీ చేయడంతో పాటు, తమతో కలసివచ్చే పార్టీలతో పొత్తుల కోసం ప్రయత్నిస్తూ రాష్ట్ర రాజకీయాలలో తాను ఒక శక్తిగా ఎదగాలనుకొంటున్న ఒవైసి గత దివారం బారాబంకిలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, వ్యవసాయ చట్టాల రద్దుపై ప్రకటన వెలువడిన తర్వాత పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సి)ని కూడా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

కరోనా  మహమ్మారి సమయంలో ప్రజలకు సహాయం చేయడానికి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, బిజెపి కార్యకర్తలు మాత్రమే వీధిలో ఉన్నారని ఆదిత్యనాథ్ గుర్తు చేశారు. ప్రజలకు ఆహారధాన్యాలు అందించేందుకు పథకాలు ప్రవేశపెట్టినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

కాన్పూర్ ప్రాంతాన్ని ప్రస్తావిస్తూ, స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి కుటుంబ (‘పరివార్వాద్’), కుల (‘జాతివాద్’) రాజకీయాల కారణంగా దాని సామాజిక నిర్మాణం దెబ్బతినడంతో అభివృద్ధి ఆగిపోయినదని పేర్కొన్నారు.