పెట్రో ధరల కట్టడికి అత్యవసర నిల్వల విడుదల 

 
పెట్రో ధరల కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర నిల్వల నుండి సుమారు 50 లక్షల బ్యారెళ్ల ముడి చమురును బయటకు తీసేందుకు కేంద్రం యోచిస్తున్నట్లు సంబంధిత అధికారి తెలిపారు. 
 
తూర్పు, పశ్చిమ తీరాల్లో మూడు ప్రాంతాల్లో భారత్‌కు వ్యూహాత్మక నిల్వ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో సుమారు 3.8 కోట్ల బ్యారెళ్ల ముడి చమురును నిల్వ చేస్తున్నారు. ఈ నిల్వల నుండి రానున్న 7-10 రోజుల్లో చమురును బయటకు తీయనున్నారని ఆ అధికారి పేర్కొన్నారు. 
 
ఈ చమురును ‘మంగళూరు రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్స్‌ లిమిటెడ్‌(ఎంఆర్‌పిఎల్‌ )’, హెచ్‌పిసిఎల్‌కు విక్రయించనున్నారు. ఈ రెండు రిఫైనరీలు వ్యూహాత్మక నిల్వ కేంద్రాలకు అనుసంధానమై ఉన్నాయని, అనంతరం మరింత చమురును కూడా విడుదల చేసే అవకాశం ఉందని ఆ అధికారి తెలిపారు. 
 
దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని పేర్కొన్నారు. పెరుగుతున్న పెట్రోల్‌ ధరలను అదుపు చేసేందుకు అమెరికా, జపాన్‌ వంటి దేశాలు ఈ విధానాన్నే అనుసరిస్తుండటం గమనార్హం.
 
భారత్, అమెరికా, జపాన్, చైనా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా వంటి దేశాలు ఏకకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యవసర చమురు నిల్వల కేంద్రాల నుంచి ముడి చమురు ఒకేసారి బయటకి తీయడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. 
 
అత్యవసర చమురు నిల్వల కేంద్రాల నుంచి ముడి చమురును విడుదల చేయాలని అమెరికా ఈ దేశాలను కోరినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. చమురు ఉత్పత్తి దేశాలు కావాలనే కృత్రిమ సృష్టించడం పట్ల భారతదేశం పదేపదే ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో ధరలు పెరగడం, ప్రతికూల పరిణామాలకు దారితీస్తుంది అని ఒక ప్రకటనలో గతంలో తెలిపింది.
 
ఇప్పటికే, పెట్రోల్ ధరల నుండి ప్రజలకు ఉపశమనం కలిగించడం కోసం కేంద్రం భారీ ఎత్తున సుంకాలను తగ్గించింది. కేంద్రంను అనుసరిస్తూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విలువ ఆధారిత పన్నులు తగ్గించాయి. అయితే రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఏమాత్రం తగ్గించలేదు. 
 
మరోవంక, అంతర్జాతీయంగా చమురు ధరలు ఇటీవల భారీగా తగ్గాయి. దీంతో దేశవ్యాప్తంగా పలు చోట్ల ధరలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూరోపియన్ ప్రాంతంలో కరోనా కేసులు పెరగడం, జపాన్, భారత్ వంటి దేశాల్లో చమురు నిల్వలు ఉండటం, ఈ దేశాల్లో ఓవర్-సప్లై, తక్కువ డిమాండ్ ఉండటం వంటి అంశాలు ప్రభావం చూపనున్నాయి. 
 
యూరోపియన్ ప్రాంతాల్లో కరోనా లాక్ డౌన్ కారణంగా చమురు డిమాండ్ పై ప్రభావం పడి, మున్ముందు తగ్గే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.108.20, లీటర్ డీజిల్ రూ.94.62గా ఉంది.