వ్యవసాయంలో 5 సంస్కరణలు సూచించిన ఎస్‌బీఐ

ఎస్‌బీఐ ఆర్థిక వేత్తల నివేదిక వ్యవసాయ రంగానికి సంబంధించి 5 సంస్కరణలను ప్రతిపాదించింది. అవి: 1. రైతులు డిమాండ్‌ చేస్తున్న ‘కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు హామీ’కి బదులు కేంద్రం కనీసం ఐదేండ్ల కాలానికి ‘క్వాంటిటీ గ్యారంటీ క్లాజ్‌’ను తీసుకురావాలి. దీని ప్రకారం పంట సేకరణకు భరోసా ఇవ్వాలి. 

2. జాతీయ వ్యవసాయ మార్కెట్‌ (ఈ-నామ్‌లో) వేలం ఫ్లోర్‌ ధరగా ఎంఎస్పీని మార్చాలి. 3. వ్యవసాయ మార్కెట్‌లో మౌలిక వసతులను బలోపేతం చేయాలి. 4. కాంట్రాక్ట్‌ వ్యవసాయ సంస్థను ఏర్పాటు చేయాలి. 5. రాష్ట్రాలల్లో వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ సమానంగా ఉండాలి. ఉదాహరణకు పంజాబ్‌, హర్యానాల్లో ధాన్యాన్ని 83 శాతం సేకరిస్తుంటే కొన్ని రాష్ర్టాల్లో అది 10 శాతం కూడా ఉండటం లేదు.

కాగా,  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) రెండో త్రైమాసికంలో భారతదేశం జిడిపి (స్థూల దేశీయోత్పత్తి) 8.1 శాతం ఉండొచ్చని ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) రీసెర్చ్ నివేదిక పేర్కొంది. అలాగే ఆర్థిక సంవత్సరానికి మొత్తం జిడిపి 9.3 శాతం నుంచి 9.6 శాతంగా ఉండే అవకాశముందని తెలిపింది. 

2021-22 మొదటి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి రేటు 20.1 శాతం ఉంది. 2022 ఆర్థిక సంవత్సరానికి జిడిపి వృద్ధి రేటు అంచనా 9.5 శాతంగా నివేదిక అంచనా వేసింది. అలాగే క్యూ2(జూలైసెప్టెంబర్) 7.9 శాతం, క్యూ3(అక్టోబర్‌డిసెంబర్)లో 6.8 శాతం, క్యూ4(జనవరిమార్చి)లో 6.1 శాతంగా అంచనాలు ఉన్నాయి.