పెట్రోల్ పై కాకుండా మద్యంపై పన్ను తగ్గించిన మహారాష్ట్ర 

కేంద్రంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్‌పై పన్ను తగ్గించి పెరుగుతున్న ధరల నుండి ప్రజలకు కొంతమేరకు ఉపశమనం కలిగించే ప్రయత్నం చేస్తుండగా, మద్యంపై పన్ను తగ్గిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం మద్యంపై ప్రత్యేక పన్నును 300 శాతం నుంచి 150 శాతానికి, అంటే సగానికి సగం తగ్గించింది.

నరేంద్ర మోదీ  ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిని అనుసరించి ఇంధనాలపై వ్యాట్‌ను తగ్గించాయి. ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం తమకు కూడా పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గిస్తారని మహారాష్ట్ర ప్రజలు కూడా ఆశించారు. 

అయితే మద్యం చౌకగా లభించేటట్లు చేయడం పట్ల ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ ఆసక్తి ప్రదర్శించింది. ఇప్పటికే పెట్రోలు, డీజిల్ ధరలు ఆకాశాన్నంటడంతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు బదులు మద్యం సేవించే వారిపై ప్రభుత్వం వ్యాట్ రేట్లను తగ్గించింది.

ప్రజల అసంతృప్తిని పసిగట్టిన మహారాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఈ చర్య తీసుకున్నట్లు ఇప్పుడు డొంకతిరుగుడు సమాధానం చెబుతున్నది.  

మహారాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే కూడా ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ మహారాష్ట్రలో మద్యంపై అధిక వ్యాట్ విధించడం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా పెరిగిపోయిందని పేర్కొన్నారు. దీన్ని నియంత్రించేందుకు రాష్ట్రంలో మద్యంపై ఇతర రాష్ట్రాల స్థాయిలో వ్యాట్‌ను తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు.

అదే సమయంలో, ఈ అంశంపై ప్రభుత్వ ఉద్దేశాన్ని బిజెపి ప్రశ్నించింది. లాక్‌డౌన్‌లో ప్రజలకు మినహాయింపు ఇవ్వాలని వచ్చినప్పుడు, ప్రభుత్వం మొదట మద్యం దుకాణాలను తెరిచిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ దాదా పాటిల్ గుర్తు చేశారు. 

అదే సమయంలో పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించే బదులు మద్యంపై పన్ను తగ్గిస్తున్నట్లు ప్రకటించినదని విస్మయం వ్యక్తం చేశారు. ఇది ఏ ప్రభుత్వ ప్రజాహిత విధానం? అని ఆయన ప్రశ్నించారు. మహారాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌పై లీటరుకు రూ. 29.25, డీజిల్‌పై రూ. 20.78 వేట్ విధిస్తోంది.  దీని కారణంగా ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు  లీటరుకు రూ. 110కి చేరుకుంది. డీజిల్ ధర రూ. 95కి చేరుకుంది.