వస్త్రాలు, అపెరల్స్‌పై పెరగనున్న జీఎస్‌టీ

జనవరి 1 నుంచి వస్త్రాలు, చెప్పులు మరింత ప్రియం కానున్నాయి. సింథటిక్‌ దారాలు, నూలు, వస్త్రాలు, దుస్తుల (అపెరల్స్‌)పై ఇప్పటి వరకు 5 నుంచి 18 శాతం మధ్య ఉన్న వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)ను ప్రభుత్వం ఒకే విధంగా 12 శాతం పరిధిలోకి తీసుకొచ్చింది. దీంతో ఈ ఉత్పత్తుల ధరలు మరింత పెరగనున్నాయి. 

ఈ మేరకు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు (సీబీఐసీ)  నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ముడి పదార్ధాలపై ఎక్కువ, తుది ఉత్పత్తులపై తక్కువగా ఉన్న పన్నుల లోపాల్ని సరిదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. పరిశ్రమ వర్గాలు మాత్రం దీనివల్ల ధరలు మరింత పెంచక తప్పదని పేర్కొన్నాయి. 

ముఖ్యంగా సింథటిక్‌ వస్త్రాలపై 5 శాతంగా ఉన్న జీఎస్‌టీని ఏకంగా 12 శాతానికి పెంచడాన్ని తప్పు పట్టింది. ఇప్పటికే ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోవటంతో జనవరి నుంచి 12 నుంచి 15 శాతం ధరలు పెంచాలని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. పెరిగిన జీఎస్‌టీతో ధరల పెంపు మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపాయి.

అయితే, సింథటిక్‌ వస్త్ర పరిశ్రమ మొత్తాన్ని ఒకే జీఎస్‌టీ రేటు పరిధిలోకి తీసుకురావడాన్ని నిపుణులు మాత్రం స్వాగతిస్తున్నారు. ఈ మార్పుతో భారతీయ సింథటిక్‌ వస్త్ర పరిశ్రమ అంతర్జాతీయ మార్కెట్లోనూ పోటీపడేందుకు వీలవుతుందని డెలాయిట్‌ ఇండియా సీనియర్‌ డైరెక్టర్‌  ఎంఎస్‌ మణి చెప్పారు. 

మూడు రకాల జీఎ్‌సటీ శ్లాబుల్లో ఉండడం పరిశ్రమ వర్గాలకూ పెద్ద చికాకుగా ఉంది. తాజాగా ఒకే  జీఎస్‌టీ   శ్లాబులోకి తీసుకురావడంతో ముడి పదార్ధాలు, తుది ఉత్పత్తుల మధ్య పన్ను వ్యత్యాసం లేకుండా పోయింది.