ఐరోపాలో నాలుగో వేవ్… లాక్ డౌన్ల పట్ల నిరసనలు!

ఐరోపాలో కరోనా నాలుగో వేవ్ ప్రారంభమైనట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా తీవ్రత కారణంగా పలు దేశాలు మళ్లీ లాక్ డౌన్ ఆలోచనల్లోకి వెళుతున్నాయి. ప్రభుత్వాలు విధిస్తున్న లాక్‌డౌన్లకు వ్యతిరేకంగా పలు దేశాలలో నిరసనలు హోరెత్తుతున్నాయి. వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వస్తుండటంతో కొన్ని ప్రాంతాల్లో పోలీసులు కాల్పులు కూడా జరపాల్సి వస్తోంది. అనేక మందిని అరెస్టు చేశారు.
 
ఇప్ప‌డిప్పుడే త‌గ్గుముఖం ప‌డుతోంద‌నుకుంటోన్న నేప‌థ్యంలో మ‌ళ్ళీ క‌రోనా విజృంభిస్తోంది. ప‌లు దేశాల్లో క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తోంది. బ్రిట‌న్,జ‌ర్మ‌నీ,ఆస్ట్రియా,ర‌ష్యాలాంటి దేశాల్లో క‌రోనా బారినప‌డి  ప‌లువురు మ‌ర‌ణిస్తున్నారు. ఆయా దేశాల్లో రోజుకు సగటు 30 వేల కన్నా ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా ఈ స్థాయిలోనే ఉంటున్నాయి.
 
 హంగేరిలో మ‌ళ్లీ భారీ స్థాయిలో వ్యాక్సినేష‌న్ ప్రక్రియ మొద‌లుపెట్టారు. రిజిస్ట్రేష‌న్ అవ‌స‌రం లేకుండానే టీకాలు ఇచ్చేస్తున్నారు. దీంతో బుదాపెస్ట్‌లోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి భారీ సంఖ్య‌లో జ‌నం ఎగ‌బ‌డ్డారు.  వీలైనంత త్వ‌ర‌గా అంద‌రూ వ్యాక్సిన్ వేసుకోవాల‌ని జ‌ర్మ‌నీ ఆరోగ్య‌శాఖ మంత్రి జెన్స్ స్పాన్  హెచ్చరించారు . ఈ శీతాకాలం పూర్తి అయ్యే లోపు.. జ‌ర్మ‌న్ దేశస్థులు వ్యాక్సినేట్‌ అవుతార‌ని, లేదా కరోనా నుంచి కోలుకుంటార‌ని లేదా చ‌నిపోతార‌ని అయ‌న స్పష్టం చేశారు. 
 
తాజాగా ఆస్ట్రియా దేశం కరోనా తీవ్రత కారణంగా సంపూర్ణంగా లాక్ డౌన్ విధించింది. ప‌ది రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఆ దేశ ప్రభుత్వం తెలిపింది. వైరస్ ఉద్ధృతి ఇలాగే కొనసాగితే మరో ప‌ది రోజులు లాక్డౌన్ పొడిగించే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
అత్యవసర పరిస్థితుల్లో మినహా పౌరులు ఎవ‌రూ బయటకు రాకుండా ఆంక్షలు విధించింది. 
 
కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలను విధిస్తామని ప్రభుత్వం హెచ్చ‌రించింది.లాక్ డౌన్ విషయంలో ఆస్ట్రియా ఛాన్సలర్ అలెగ్జాండర్ షాలెన్బర్గ్ క్షమాపణలు చెప్పారు. టీకాలు తీసుకున్నవారు ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతుండటంతో క్షమాపణలు చెప్పారు. 
 
ప్రజల ఆరోగ్యం, రక్షణ కోసమే లాక్ డౌన్ విధించినట్లు షాలెన్ బర్గ్ తెలిపారు. పలు ఐరోపా దేశాలలో కూడా క‌రోనా కేసులు పెరుగుతుండ‌టంతో అక్క‌డ కూడా లాక్ డౌన్ ని విధించే దిశ‌గా యోచిస్తున్నారు. ఇటువంటి క్లిష్ట‌స‌మ‌యంలో లాక్ డౌన్ ఒక్క‌టే ప‌రిష్కార‌మ‌ని తేల్చి చెబుతున్నాయి ప్ర‌భుత్వాలు.
 
నెదర్లాండ్స్‌లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ దేశంలో తీర ప్రాంత పట్టణం రోటర్‌డామ్‌లో వరసగా రెండు రోజుల పాటు హింస కొనసాగింది. నిరసనకారులు పోలీసులపైకి రాళ్లు, బాణ సంచా విసిరారు. సైకిళ్లను దగ్ధం చేశారు. దీంతో పోలీసులు అనేక మందిని అరెస్టు చేశారు. 
 
బెల్జియంలోని బ్ర‌సెల్స్‌లో మ‌ళ్లీ ఉద్రిక‌త్త‌లు తారా స్థాయికి చేరాయి. పోలీసుల‌పై రాళ్లు రువ్వే ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి. క‌ఠిన కోవిడ్ నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రిగాయి. వ్యాక్సిన్ తీసుకోని వారిని కేఫ్‌లు, రెస్టారెంట్లు, ఎంట‌ర్‌టైన్మెంట్ వేదిక‌ల‌కు రానివ్వ‌డం లేదు. దీంతో అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. నెద‌ర్లాండ్స్‌లోని గ్రోనింజ‌న్ న‌గ‌రంలో కొంద‌రు ఆస్తుల‌ను ధ్వంసం చేశారు.

ఇక, ఆస్ట్రియా రాజధాని 
లాక్‌డౌన్ విధించ‌వ‌ద్దు అంటూ వియ‌న్నాలో భారీ స్థాయిలో నిర‌స‌న‌లు జ‌రుగుతున్నాయి. ఆ ఆందోళ‌న‌లు హింసాత్మ‌కంగా కూడా మారాయి.  అలాగే, డెన్కార్క్‌లోనూ, క్రోషియా రాజధాని జగ్రెబ్‌లోనూ వేలాది మంది నిరసనల్లో పాల్గొన్నారు.