మూడు రాజధానులపై తిరిగి సమగ్ర బిల్లు

మూడు రాజధానులపై బిల్లును ఉపసంహరించుకోవడం సాంకేతిక పరమే అని, తిరిగి సమగ్రమైన బిల్లు తీసుకు వస్తామని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీలో  ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రం ప్రజల అందరి శ్రేయస్సు రీత్యా అధికార వికేంద్రీకరణ లక్ష్యంతో మరింత సమగ్రమైన బిల్లుతో ముందుకు వస్తామని ప్రకటించారు. 
 
తామ ఆమోదించిన మూడు రాజధానుల చట్టం, అభివృద్ధి వికేంద్రీకరణ చట్టంపై విష ప్రచారం చేశారని, న్యాయ పరమైన అడ్డంకులను సృష్టించారని మండిపడ్డారు. ఆ కారణాలను ఈ చట్టాలను ఉపసంహరించి మరింత సమగ్రమైన బిల్లుతో సభ ముందుకు వస్తామని సిఎం జగన్‌ చెప్పారు. 
 
అంతకు ముందు మూడు రాజధానుల చట్టం, అభివృద్ది వికేంద్రీకరణ చట్టంను ఉపపసంహరించుకున్నట్లు బిల్లును రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రవేశపెట్టారు. అనంతరం సిఎం మాట్లాడుతూ ఒకప్పుడు రాష్ట్ర రాజధానిగా కర్నూలు ఉండేదని, గుంటూరు లో హైకోర్టు ఉండేదని గుర్తు చేశారు.
 
రాష్ట్రంలో మూడు ప్రాంతాలు అభివృద్ధిచెందాలని, రాష్ట్ర పూర్తిగా అభివృద్ధిలో పరిగెత్తాలనే ఉద్దేశంతోనే విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ పెట్టాలని, ఈ ప్రాంతంలో లెజిస్లేచివ్‌ క్యాపిటల్‌, కర్నూలులో జ్యుడీషియల్‌ క్యాపిటల్‌ పెట్టాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. 
 
1953నుండి 1956 వరకు కర్నూలు రాజధానిగా ఉంది. ఈ బిల్లులను ప్రవేశపెట్టినప్పటి నుండి అపోహలు, న్యాయపరమైన చిక్కులు కల్పించారని విమర్శించారు. రాజధానుల వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే మూడు ప్రాంతాలకు న్యాయంజరిగేలా మూడు రాజధానులు ప్రారంభమై ఉంటే ఫలితాలు వచ్చి ఉండేవని చెప్పుకొచ్చారు. 
 
నాటి శ్రీభాగ్‌ ఒడంబడిక స్పూర్తితో ఉత్తరాంధ్ర సహా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందని సమర్ధించుకున్నారు. గతంలో అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇది శ్రీకృష్ణ కమిటీ నిబంధనలతో పాటు పలు నిబంధనలను ఉల్లంఘించి చంద్రాబు రాజధాని ఎంపిక చేశారని ఆరోపించారు. 
 
ఈ ప్రాంతమంటే తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని స్పష్టం చేస్తూ తన నివాసం కూడా ఇక్కడే ఉందని గుర్తు చేశారు. అయితే ఈ ప్రాంతం విజయవాడకు, గుంటూరుకి 40 కి.మీ దూరంలో ఉందని,  రోడ్లు, డ్రైనేజి, కరెంటు వీటన్నింటికోసం లక్ష కోట్లు ఖర్చు అవుతుందని చంద్రబాబు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయని తెలిపారు. 
 
పదేళ్లు పోతే ఈ లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లకు మించవచ్చు. మన దగ్గరున్న డబ్బుతో మౌలిక సదుపాయాలను కల్పించలేము. ఇటువంటి పరిస్థితుల్లో ఈప్రాంతంలో రాజధాని ఊహకు కూడా రాదని జగన్ స్పష్టం చేశారు. ఇక్కడ ఉద్యోగ కల్పన కుదరదు. ఉద్యోగాల కోసం మన యువత హైదరాబాద్‌ వంటి ఇతర నగరాలకు వలస పోవలసి వస్తుందని హెచ్చరించారు. 
 
ఎపిలో అతి పెద్ద నగరం విశాఖ. ఇప్పటికే అన్ని వసతులు ఉన్నాయి. వాటిపై కొద్ది మోత్తాన్ని కేటాయిస్తే. హైదరాబాద్‌ వంటి నగరాలతో పోటీ పడటానికి అవకాశం ఉంటుందని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధిలో పరిగెత్తాలనే ఉద్దేశంతో విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌, ఇలా మూడు రాజధానులును ప్రవేశపెట్టామని తెలిపారు. 
 
గతంలో ఒక్క ప్రాంతంలోనే రాజధాని ఉండటంతో ప్రజలు వ్యతిరేకత 2019 సారత్రిక ఎన్నికల్లో స్పష్టమైందని ఆయన చెప్పారు.  గడిచిన రెండున్నరేళ్లలో అభివృద్ధిని చూసి ఇప్పటివరకు జరిగిన ఏ ఎన్నికలను చూసినా మన ప్రభుత్వాన్ని ప్రజలు మనసారా దీవించడం జరిగిందని గుర్తు చేశారు. 
 
వికేంద్రీకరణ అవసరాన్ని మూడు రాజధానులకు సంబంధించిన బిల్లులోని ప్రజల సదుద్దేశాన్ని విస్తృతంగా వివరించేందుకు, మరిన్ని మార్పులతో పరిపుష్టి చేసేందుకు గతంలో ప్రవేశ పెట్టిన బిల్లులను వెనక్కు తీసుకున్నామని తెలిపారు.