కేసీఆర్ ఎంతమందికి ఉచితంగా ఎరువులిచ్చారో చెప్పాలి!

రాష్ట్రంలోని రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామన్న సీఎం కేసీఆర్ఎం త మందికి ఇచ్చారో చెప్పాలని  బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు.  ఏమైనా అంటే మా పైనా.. మా అధ్యక్షుడి పైనా కోడిగుడ్లు కొడుతున్నారని ధ్వజమెత్తారు. `ఈటల రాజేందర్ మా పార్టీలోకి వచ్చారు..గుడ్లు కొడితే ఆయన పౌల్ట్రీకే లాభం’ అంటూ ఎద్దేవా చేశారు. 

 చెరుకు ఫ్యాక్టరీలు ఎందుకు తెరవడం లేదో కేసీఆర్ చెప్పాలని నిలదీశారు. ఇథనాలు డిమాండ్ పెరుగుతున్నందున చెరుకు ఫ్యాక్టరీలతో లాభం ఉంటుందని ఆయన చెప్పారు. కొత్త చెరుకు ఫ్యాక్టరీలు పెడదామని ఎవరైనా ముందుకు వచ్చినా అనుమతి ఇవ్వడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. మొక్కజొన్న, చెరుకు నుంచి ఎక్కువ శాతం ఇథనాలు పొందే అవకాశం ఉందని, అయితే ఈ రెండు పంటలను కేసీఆర్ వద్దంటున్నాడని ఆయన విమర్శించారు. 

పంజాబ్ రైతులకు రూ 3 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తాడట.. స్వాగతిస్తున్నాం. ఇస్తే ఇవ్వు… కానీ ముందుగా తెలంగాణ రైతులు 8 ఏళ్లుగా పంట నష్టపోతున్న రైతులను ఆదుకోమని అరవింద్ డిమాండ్ చేశారు. కల్లాల్లో ఉన్న ధాన్యం కొనకుండా ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ తో తాడో పేడో తేల్చుకుంటా.. దీనికోసం రైతులను కూడా సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. 

ప్రభుత్వం ఉంది కదా.. పోలీసులు ఉన్నారని తమపై దాడి చేస్తే ఊరుకోబోమని అరవింద్ హెచ్చరించారు. ముఖ్యమంత్రి అనేటోడు ఎక్కడైనా ధర్నా చేస్తాడా? అని విస్మయం వ్యక్తం చేశారు. మూడేళ్లుగా కేంద్రం పారాబాయిల్డ్ తగ్గించమని చెబుతూనే ఉందని పేర్కొన్నారు. వరికి ఇతర రాష్ట్రాల్లో బోనస్ ఇస్తున్నారు.. కానీ తెలంగాణలో మాత్రం ఇవ్వడం లేదని ఆయన తెలిపారు. 

రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్లు ధాన్యం రూ 1500లకు కొంటామని చెబుతున్నారు. మీరు మరో రూ 350 ఇస్తే చాలు రైతులకు మద్దతు ధర వస్తుంది గదా అని కేసీఆర్ కు హితవు చెప్పారు. రాష్ట్రంలో ఆస్పత్రులు, స్కూళ్ల పరిస్థితి అధ్వానంగా మారిందని ఆయన విచారం వ్యక్తం చేశారు. 

తెలంగాణ తెచ్చుకుంది దేనికోసం.. మీరు చేస్తున్న పాలన ఎలా ఉంది? అని ప్రశ్నించారు. తక్షణమే పెట్రోలు, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని బిజెపి ఎంపీ డిమాండ్ చేశారు. కేంద్రం కొనేంత ధాన్యం కొంటుంది… మిగతాది రాష్ట్ర ప్రభుత్వం కొనాలని ఆయన స్పష్టం చేశారు.  చేతకాకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

వచ్చే ఎన్నికల్లోనూ కేటీఆర్ సహా.. మీ నాయకులను ప్రజలు ఉరికిస్తారని స్పష్టం చేశారు. ఇక్కడ కవితనే ఓడించారు.. కొడుకొక లెక్కా? అని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇంతకాలం దోచుకు తిన్నారని అరవింద్ దుయ్యబట్టారు.