సమస్య రైతులది కాదు, కదులుతోన్న టీఆర్ఎస్ పునాదులు

ముఖ్యమంత్రి కేసీఆర్ చేబడుతున్న ఆందోళనలకు సబంబంధించి సమస్య రైతులది కాదని, కదులుతోన్న టీఆర్ఎస్ పార్టీ పునాదుల‌దే అసలు సమస్య అని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాజకీయ లబ్ధి కోసం లేని సమస్యను సృష్టించి సీఎం రైతులను ఆగం చేస్తున్నారని విమర్శించారు.
 
అబద్దాల పునాదుల మీదనే కేసీఆర్ కుటుంబం రాజకీయాలు చేస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు. పార్టీని బ్రతికించుకోవటానికి ముఖ్యమంత్రి ధర్నాలు చేయటం మెదటసారి చూస్తున్నానని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం ధాన్యం కొనడం లేదంటూ కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారని పేర్కొన్నారు. ఈ యాసంగతిపాటు వచ్చే యాసంగికీ కేంద్రమే బియ్యాన్ని కొంటుందని స్పష్టం చేశారు. 
 
కేంద్ర ప్రభుత్వం బియ్యాన్ని కొత్తగా కొంటోందా అని కేసీఆర్ అంటున్నారు. ఈ ఏడేండ్లు బియ్యం తానే కొంటున్నానని సీఎం చెబుతూ వచ్చారు. హుజూరాబాద్ ఎన్నికల తర్వాత కేంద్రం కొననంటోందని అంటున్నారు. ఈ సమస్యను ఐదారేళ్ల నుంచి రాష్ట్రం దృష్టికి కేంద్రం తీసుకొచ్చింది. బాయిల్డ్ రైస్ తప్ప మిగతాది కొనమని కేంద్ర ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు” అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. 
 
బాయిల్డ్ రైస్ సప్లయ్ చేయమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పుడు లేని సమస్యను ముఖ్యమంత్రి తెరమీదకు తెచ్చారని ధ్వజమెత్తారు. అసలు టీఆర్ఎస్ బాధేంటి? కేంద్ర మంత్రిగా ‘రా రైస్’ కొంటామని నేనే చెప్పాను. ఇప్పుడే కాదు వచ్చే యాసంగికి కూడా కొంటాం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చేసుకున్న ఒప్పందం మేరకు ప్రతి గింజను కొంటామని స్పష్టం చేస్తున్నా అని కిషన్ రెడ్డి వెల్లడించారు. 
 
ఈ ఏడు సంవత్సరాలుగా మేం బియ్యం కొంటున్నమని టీఆర్ఎస్ నేతలు ప్రగల్భాలు పలికారు. కానీ ఇప్పుడు అందరికీ తెలిసింది.. బియ్యం కొంటోంది కేంద్రమేనని. ప్రతి క్వింటాల్ ధాన్యానికి కేంద్రం సబ్సిడీ ఇస్తోందని రైతులు అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. 
 
‘ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమంలో చనిపోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తామంది. అందులో తప్పు లేదు. అయితే తెలంగాణలో గత ఏడున్నరేళ్లుగా ఎంతమంది అన్నదాతలు చనిపోయారు? వారి కుటుంబాలకు ఎందుకు ఆర్థిక సాయం అందించడం లేదో చెప్పాలి. అది మీ బాధ్యత కాదా? రాజకీయ జూదంలో భాగంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా? మీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను ఆదుకున్నారా?’ కిషన్ రెడ్డి ప్రశ్నించారు. 
 
హుజురాబాద్ ఓటమిని డైవర్ట్ చేయటానికే కేంద్రంపై తప్పడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబం శక్తినంతా ధారపోసినా హుజురాబాద్‌లో ఓటమి తప్పలేదని గుర్తు చేశారు.  దళితులు ముఖ్యమంత్రి పదవికి అర్హులు కాదా? సీఎం స్పష్టం చేయాలని ఆయన నిలదీశారు. దళితుడు ముఖ్యమంత్రి అయితే తెలంగాణ అభివృద్ధి జరగదనే విధంగా సీఎం మాట్లాడడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. 
 
ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా కేంద్రంపై నిందలు వేయడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవటంతో ఎంఎంటీఎస్ పనులు నిలిచిపోయాయని ఆయన తెలిపారు.
 
బెస్ట్ టూరిస్ట్ విజిటింగ్ విలేజ్‌గా పోచంపల్లి గ్రామాన్ని కేంద్రం ఎంపిక చేసిందని గుర్తు చేశారు. అంబేద్కర్ వర్థంతి డిసెంబరు 6న  విద్యార్థుల స్కాలర్ షిప్స్‌ను జమ చేస్తామని చెప్పారు. సుభాష్ చంద్రబోస్ జ్ఞాపకాలు నవ తరానికి తెలిసేలా చర్యలు తీసుకుంటున్నామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.