విలువలతో విద్య అందించాలి 

విలువలతో విద్య అందించే దిశగా వర్సిటీలు ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సూచించారు. విలువలతో కూడిన నైపుణ్యాలతో ప్రపంచాన్నే మార్చే శక్తి సమకూరుతుందని వెల్లడించారు. 
 
అనంతపురంలోని పుట్టపర్తి సత్యసాయి వర్సిటీ 40వ స్నాతకోత్సవానికి జస్టిస్‌ ఎన్వీ రమణ ముఖ్యఅతిథిగా పాల్గొంటూ నిస్వార్ధ సేవా కార్యక్రమాలు నేటి సమాజానికి తక్షణ అవసరమని చెప్పారు. నేర్చుకున్న విద్యా విలువలను ప్రపంచానికి చాటిచెప్పాలని సూచించారు.
 
విద్యార్థులు ఆకాశమే హద్దుగా అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.మిగిలిన వర్సిటీలతో పోలిస్తే సత్యసాయి వర్సిటీకి ఎంతో ప్రాముఖ్యత ఉన్నదని తెలిపారు. విద్యార్థులపై సత్యసాయిబాబా వాత్సల్యానికి వర్సిటీ ప్రతీక అని, ఆధునిక గురుకులాలకు ఆదర్శ నమూనా అన్నారు.
 
సత్యసాయి మాతృప్రేమకు ఎంతో విలువ ఇచ్చేవారని, ఎక్కడికి వెళ్లినా మాతృభాషకు ప్రాధాన్యమిచ్చేవారని చెప్పారు. నేటికీ వర్తించే ఎన్నో అంశాలు రామాయణం, మహాభారతంలో ఉన్నాయన్నారు. 
 
ఈ సందర్భంగా 20 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 24 మందికి డాక్టరేట్లు, 465 మందికి డిగ్రీ పట్టాలు ప్రదానం చేశారు. అనంతరం మాట్లాడుతూ పతకాలు అందుకున్న విద్యార్థులను అభినందిచారు. విద్యార్థులు కీలక దశ ముగించుకుని తర్వాతి దశకు వెళ్తున్నారని చెప్పారు.