జగన్ రెడ్డి ప్రభుత్వం మరో కొత్త నాటకానికి తెర తీసింది

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు అమ‌రావ‌తి రాజ‌ధాని కొన‌సాగింపుపై సీఎం వైఎస్ జ‌గ‌న్ స‌రికొత్త నాట‌కానికి తెర తీశార‌ని జ‌న‌సేనాని అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆరోపించారు. మూడు ప్రాంతాల అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డారు. 
 
అమ‌రావ‌తిపై హైకోర్టుల్లో విచార‌ణ జ‌రుగుతున్న 54 కేసుల్లో ఓట‌మి త‌ప్ప‌ద‌న్న భ‌యంతోనే మూడు రాజ‌ధానుల బిల్లు, సీఆర్డీఏ ర‌ద్దు బిల్లుల ర‌ద్దు ఏపీ స‌ర్కార్ హడావుడిగా ఉప‌క్ర‌మించింద‌ని ధ్వజమెత్తారు. అయితే మూడు రాజ‌ధానులపై మ‌రింత స్ప‌ష్ట‌త‌తో కొత్త బిల్లు ప్ర‌వేశ‌పెడ‌తామ‌న‌డంతో సీఎం జ‌గ‌న్.. రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను మ‌రింత గంద‌ర‌గోళంలోకి నెట్టేశార‌ని  విమర్శించారు. 
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ విడిపోయి ఏడేండ్ల‌వుతున్నా రాజ‌ధాని ఎక్క‌డ ఉంటుందో తెలియ‌ని ప‌రిస్థితిని ఈ పాల‌కులు తీసుకొచ్చార‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. వికేంద్రీకరణ అంటూ  చిలకపలుకు పలుకుతున్న పాలకులు ఏ రాష్ట్రంలోనూ రెండు మూడు రాజధానులు లేవన్న సంగతిని విస్మరించారని పేర్కొన్నారు.
 
వైసీపీ పెద్దలు 3 రాజధానులతోనే అభివృద్ధి జరుగుతుందనే భ్రమలోనే ఉన్నారని ధ్వజమెత్తారు. 3 రాజధానుల ఏర్పాటుతోనే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందనే.. భ్రమలోనే వైసీపీ పెద్దలు మునిగి తేలుతున్నారని విమర్శించారు. రాజధానిగా అమరావతి ఏర్పాటుపై శాసనసభలో ప్రతిపక్ష  నేతగా జగన్ రెడ్డి తాను ఆనాడు ఏమి చెప్పారో అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారని గుర్తు చేశారు.
 
ఒక్క వైసీపీ మాత్రమే మూడు రాజధానుల పాట పాడుతోందని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతగా జగన్‌రెడ్డి ఏం చెప్పారో అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలను ఇచ్చి త్యాగనిరతిని చాటిన అమరావతి రైతులకు జనసేన బాసటగా ఉంటుందని పవన్ స్పష్టం చేశారు. 

పెద్దిరెడ్డి వాఖ్యలు విచారకరం 

అమరావతి రాజధాని కోసం స్వచ్ఛందంగా ఉద్యమిస్తుంటే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రైతులపై వ్యంగ్యంగా మాట్లాడడం శోచనీయమని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విచారం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల చట్టం రద్దు నిర్ణయంపై మంత్రి ఇది ఇంటర్వెల్‌ అని, శుభం కార్డు త్వరలో వేస్తామని ప్రకటించడంపై స్పందించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. 

ఇంటర్వెల్‌ కాదు మీకు శుభం కార్డును వేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని కన్నా హెచ్చరించారు. మూడు రాజధానుల ఏర్పాటు ప్రకటన అవగాహనారాహిత్యం, అహంకారంతో తీసుకున్న నిర్ణయమన్నారని వైసీపీ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. బీజేపీ మెుదటి నుంచి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తునే ఉందని ఆయన వెల్లడించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం శుభపరిణామమని ఆయన చెప్పారు.