భారీ వర్షాలతో 8 లక్షల ఎకరాల్లో పంట నష్టం

నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలు తుపాను, భారీ వర్షాలు, వరదల కారణంగా 8 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రాధమిక అంచనా వేసిన్నట్లు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు రాష్ట్ర శాసనసభలో ప్రకటన చేశారు. వరదలతో 5.33 లక్షలమందికి పైగా రైతులు నష్టపోయారని తెలిపారు.
 
వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటి వరకు 34 మంది మృతిచెందగా, 10 మంది గల్లంతయ్యారని చెప్పారు. గల్లంతైన వారి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందని చెప్పారు. వీరిలో ముగ్గురు రెస్క్యూ సిబ్బంది కూడా ఉన్నారని తెలిపారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని సీఎం ఆదేశించారని తెలిపారు. 
 
ఇప్పటికే 90 శాతం మంది ఆ పరిహారం అందజేశామని మంత్రి చెప్పారు. సీఎం ఆదేశాలతో తక్షణ సాయం కోసం జిల్లా కలెక్టర్ల వద్ద ప్రత్యేక నిధులు ఉంచామని తెలిపారు. వరదనీరు ప్రభావం తగ్గిన తర్వాత పంటనష్టంపై ఎన్యుమరేషన్‌ పూర్తిస్థాయిలో అందిస్తామని చెప్పారు..
 
అంతేకాకుండా 80 శాతం సబ్సిడీతో విత్తనాలు అందించాలని, నిత్యావసర సరుకులు అందించాలని సీఎం జగన్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఇప్పటికే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
 
ప్రతి ఇంటికీ పరిహారం అందాలి
 
కాగా,  ‘‘వరద బాధితుల పట్ల ఉదారంగా ఉండాలి. ముంపునకు గురైన ప్రతి ఇంటికీ పరిహారం అందాలి. ఎవ్వరికీ అందలేదన్న మాట రాకూడదు’’ అని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం అమరావతి సచివాలయం నుంచి వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో అక్కడి పరిస్థితిని సమీక్షిస్తూ సహాయ శిబిరాల్లో ఉన్న వారికి మంచి వసతులు, సదుపాయాలు కల్పించాలని చెప్పారు. 
 
అధికారులంతా డైనమిక్‌గా పని చేయాలని, ఎలాంటి సమస్య ఉన్నా.. తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రతి కుటుంబానికీ 25 కేజీల బియ్యం, కిలో చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, లీటరు వంటనూనె తక్షణమే అందజేయాలని ఆదేశించారు. 
 
సహాయ శిబిరాల నుంచి ఇంటికి వెళ్తున్న వారికి రూ.2 వేల చొప్పున అందించాలని పేర్కొన్నారు. పూర్తిగా ఇల్లు ధ్వంసమైన వారికి రూ.95,100, పాక్షికంగా దెబ్బతిన్న ఇంటికి రూ.5,200 చొప్పున సాయం చేయాలని సూచించారు. దీనికిగాను ప్రతి జిల్లాకు రూ.10 కోట్లు చొప్పున మరో రూ.40 కోట్లు ఇచ్చినట్టు తెలిపారు.  
 
కాగా, వరుస తుపానులతో చిత్తూరు జిల్లా వణుకుతోంది. గత 25 రోజులుగా జిల్లాలో వర్షం పడుతూనే ఉంది. ఇప్పటికే రెండు తుపాన్ల ప్రభావాన్ని చవిచూసింది. రెండో తుపాను వరద తీవ్రత తగ్గక ముందే ఈ నెల 26 నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకు మరో తుపాను ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా ప్రజల గుండెలు గుబేలుమంటున్నాయి. సోమవారం కూడా వర్షం కురుస్తూనే ఉంది. 
 
పేరూరు చెరువు కట్ట తెగడంతో ముంచెత్తిన వరద నీరు లోతట్టు ప్రాంతాల్లో ఇంకా అలాగే ఉంది. రాయల చెరువుకుపడిన గండిని తాత్కాలికంగా గ్రామస్తుల సహకారంతో పూడ్చిన ఇరిగేషన్‌ శాఖ ప్రస్తుతానికి విపత్తు తప్పినట్లేనని ప్రకటించినప్పటికీ ఆ చెరువు కిందగల గ్రామాల ప్రజల్లో టెన్షన్‌ మాత్రం వీడలేదు. దిగువ గ్రామాలైన 19 ప్రాంతాల వారినిశ్రీ పద్మావతి వసతి గృహానికి తరలించారు.