ఇమ్రాన్ ఖాన్ ను `పెద్దన్న’ అంటూ మరో వివాదంలో సిద్దు

పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ కర్తార్‌పూర్ సాహిబ్ పర్యటనలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను `బడా భాయ్’ (అన్నయ్య) అని సంబోధిస్తూ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. గతంలో ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారంకు పంజాబ్ మంత్రిగా ఉంటూ వెళ్లి సొంత పార్టీలోనే వివాదాలు సృష్టించడం తెలిసిందే. 

పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ తన బృందంలో సిద్దును మినహాయించి కర్తపూర్ యాత్రకు వెళ్లి వచ్చిన రెండు రోజుల తర్వాత  పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్ సాహిబ్‌ను సందర్శించాడు. సిద్ధూకి కార్తార్‌పూర్‌లో ఘన స్వాగతం లభించింది. పాకిస్తాన్‌లో ఉన్న సిక్కులతో పాటు ఇతర స్థానికులు సిద్ధూపై పూలు చల్లుతూ స్వాగతం పలికారు. 

పైగా,  ఇమ్రాన్ ఖాన్ ప్రతినిధిగా పాకిస్థాన్ అధికారి ఒకరు అక్కడ సిద్ధుకు స్వాగతం పలికిన వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో, కాంగ్రెస్ నాయకుడు ఖాన్ తనకు “బడా భాయ్” అని చెప్పడం వినిపిస్తోంది. పంజాబ్ ముఖ్యమంత్రికి లభించని స్వాగత, సత్కారాలు ఒక పార్టీ నేతకు లభించడం గమనార్హం. వెంటనే బిజెపి నాయకులు సిద్దు వ్యవహారంపై మండిపడ్డారు.

హిందుత్వలో ఐఎస్, బోకో హరమ్ వంటి తీవ్రవాద గ్రూప్ లను చూసే కాంగ్రెస్ పార్టీ సీమాంతర ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న ఇమ్రాన్ ఖాన్ లో మాత్రం “భాయ్ జాన్”ని కనుగొంటుందని అంటూ ఎద్దేవా చేసింది. ఈ వీడియోను షేర్ చేస్తూ బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్ మాల్వియా ట్వీట్ చేస్తూ, “రాహుల్ గాంధీకి ఇష్టమైన నవజ్యోత్ సింగ్ సిద్ధూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ‘బడా భాయ్’ అని పిలుస్తాడు. చివరిసారి అతను పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వాను కౌగిలించుకుని ప్రశంసలు కురిపించాడు” అంటూ గుర్తు చేశారు. 

పైగా, గాంధీ తోబుట్టువులు (రాహుల్-ప్రియాంక) అనుభవజ్ణుడైన అమరీందర్‌కు బదులు పాకిస్తాన్ ప్రేమికుడు సిద్ధూని ఎంచుకోవడంలో ఆశ్చర్యం ఏముంది? అంటూ పేర్కొన్నారు.  బిజెపి అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఈ పరిణామం “భారతీయులకు ఆందోళన కలిగించే తీవ్రమైన విషయం” అని పేర్కొన్నారు. ఇందులో  పెద్ద కుతంత్రం ఇమిడి ఉన్నదని ఆరోపించారు.  సిద్ధూ వ్యాఖ్యలు హిందుత్వను విమర్శిస్తూ రాహుల్ గాంధీతో సహా అనేక మంది కాంగ్రెస్ నాయకులతో ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు.

కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ తన తాజా పుస్తకంలో చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ, ప్రత్యర్థి పార్టీ హిందుత్వలో ఐఎస్ఐఎస్, బోకో హరామ్ వంటి తీవ్రవాద గ్రూపులను చూస్తుందని, అయితే ఇమ్రాన్  ఖాన్‌లో “భాయ్ జాన్” ఉందని పాత్రా ఎద్దేవా చేశారు.  
సిద్ధూ ఇంతకుముందు కూడా ఇమ్రాన్ ఖాన్‌ను ప్రశంసించారని, ఆ దేశ పర్యటనలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బజ్వాను కూడా కౌగిలించుకున్నారని ఆయన గుర్తు చేశారు. 

పంజాబ్ సరిహద్దు రాష్ట్రమని పేర్కొంటూ, పాకిస్థాన్ సమస్యలను సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని, ఆ రాష్ట్రానికి “పరిణతి చెందిన,  దేశభక్తి కలిగిన నాయకత్వం” అవసరమని పాత్రా స్పష్టం చేశారు. పరోక్షంగా సిద్దు వంటి నాయకులు దేశ భద్రతకు ప్రమాదకారి కాగలరని సంకేతం ఇచ్చారు. 

ఇమ్రాన్ ఖాన్‌ త‌న‌కు పెద్ద‌న్న అంటూ సిద్ధూ చేసిన వ్యాఖ్య‌ల‌పై  లోక్‌స‌భ స్పీక‌ర్ ఓంబిర్లా స్పందిస్తూ లోక్‌స‌భ స‌భ్యులుగానీ, రాష్ట్రాల్లోని ఇత‌ర చ‌ట్ట‌స‌భ‌ల స‌భ్యులుగానీ పాజిటివ్‌గా మాట్లాడాల‌ని హితవు చెప్పారు. భారతీయులుగా ఏ దేశం మ‌న దేశం కంటే గొప్ప‌ది కాద‌నే విష‌యాన్ని ప్ర‌జాప్ర‌తినిధులు విశ్వ‌సించాల‌ని ఓంబిర్లా సున్నితంగా మందలించారు.