
క్రిప్టో కరెన్సీ లావాదేవీలను ఆస్తివర్గంగా గుర్తించి, ప్రభుత్వ నియంత్రణలో ఉంచేందుకు ఓ చట్టాన్ని తేవాలని కేంద్రానికి స్వదేశీ జాగరణ్ మంచ్ (ఎస్‌జెఎం) సూచించింది. లావాదేవీల ప్రక్రియకు సంబంధించిన డేటా, హార్డ్‌వేర్ దేశీయ సర్వర్లలో ఉండాలని ఎస్‌జెఎం కోకన్వీనర్ అశ్వనీమహాజన్ తెలిపారు. ఆ విధంగా చేయడం వల్ల చట్టవిరుద్ధ లావాదేవీలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి వీలవుతుందని పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రైవేట్ సంస్థలు నడిపే ఎక్ఛేంజీల ద్వారా ప్రపంచంలోని ఎక్కడి నుంచైనా ఎవరైనా పెట్టుబడులు పెట్టే అవకాశమున్నదని చెప్పారు. అయితే, ఏ ప్రభుత్వమూ క్రిప్టో కరెన్సీపై ఇప్పటివరకూ నియంత్రణ కలిగి లేకపోవడం ఓ లోపమని మహాజన్ గుర్తు చేశారు. నిక్షిప్తమైన లావాదేవీలను ప్రైవేట్ ఎక్ఛేంజీల ద్వారా నడిపేందుకు ఓ యంత్రాంగం కూడా లేదని మహాజన్ పేర్కొన్నారు.
దాంతో, పెట్టుబడులు పెడుతున్నదెవరు, పెట్టుబడులతో ఏంచేస్తున్నారో తెలియనిస్థితి నెలకొన్నదని తెలిపారు. ఆయుధాల కొనుగోలు, డ్రగ్స్ వ్యాపారంలాంటివి కూడా క్రిప్టో ద్వారా నిర్వహిస్తున్న ఉదంతాలు వెలుగు చూశాయని మహాజన్ గుర్తు చేసారు. “క్రిప్టోకరెన్సీలను నియంత్రించడానికి, దానితో చేసే లావాదేవీలను అసెట్ క్లాస్‌గా గుర్తించడానికి చట్టం అవసరం. పన్నులు, జాతీయ భద్రత ప్రయోజనాల కోసం లావాదేవీలపై మంచి అవగాహన పెంపొందించడానికి ఇది సహాయపడుతుంది” అని మహాజన్ స్పష్టం చేశారు.
క్రిప్టో ఆస్తుల్ని బంగారంలాంటి ఇతర వస్తువులతో పోల్చడాన్ని ఆయన తిరస్కరించారు. క్రిప్టోకు ఆంతరంగిక విలువ లేదని తెలిపారు. డబ్బుతో సమానమైన లావాదేవీలు నడిపే అధికారాన్ని ప్రైవేట్ ఏజెన్సీలకు ఏ సార్వభౌమ దేశమూ ఇవ్వదని మహాజన్ స్పష్టం చేశారు.
“ప్రైవేట్ వర్చువల్ కరెన్సీలు డబ్బు అనే భావనతో “గణనీయమైన అసమానత”లో ఉన్నాయని చెబుతూ “ఏ సార్వభౌమాధికారం” ప్రైవేట్ ఏజెన్సీలు చట్టపరమైన టెండర్లు లేదా దానికి సమానమైన ఏదైనా జారీ చేయడానికి అనుమతించరాదని పేర్కొన్నారు. “చాలా బిట్‌కాయిన్‌లు డార్క్ వెబ్‌లో తవ్వబడ్డాయి. జారీ చేసేవారు ఎవరో మాకు తెలియదు. డబ్బు ఏ వ్యక్తి రుణం లేదా బాధ్యతలను సూచించదు. ఈ క్రిప్టో డబ్బు కాదు. ఖచ్చితంగా, అది కరెన్సీ కాదు”, అని తేల్చి చెప్పారు.
నవంబర్ 15న, బిజెపి నాయకుడు జయంత్ సిన్హా నేతృత్వంలోని పార్లమెంటరీ ప్యానెల్ కూడా క్రిప్టో ఫైనాన్స్ ప్రయోజనాలు, నష్టాలను వివిధ వాటాదారులతో చర్చించింది. మహాజన్ ఈ చర్యను మెచ్చుకున్నారు,. అయితే ఇది అన్ని వాటాదారులను చేర్చుకోవాల్సిన అవసరం ఉందని, ఈ సమస్యపై “విస్తృతస్థాయిలో చర్చ” జరగాలని ఆయన సూచించారు.
More Stories
అరుణాచల్ పై ‘జీ20’ సాక్షిగా చైనాకు భారత్ ఝలక్
అరెస్ట్ చేయొద్దన్న కవిత అభ్యర్థనకు `సుప్రీం’ తిరస్కరణ
ప్రపంచవ్యాప్తంగా ప్రమాదంలో ఆర్ధిక వ్యవస్థ