రోజంతా డీజీపీల సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ

సాధారణంగా కీలక సమావేశాలలో పాల్గొని, సందేశం ఇచ్చి రావడం ప్రధానమంత్రులు పరిపాటి. కానీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతి ఏడాది జరిగే డీజీపీల సమావేశాలలో పూర్తిగా పాల్గొని, వారి చర్చలను స్వయంగా పరిశీలిస్తూ, క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. శనివారం లక్నోలో ప్రారంభమైన మూడు రోజుల డీజీపీల సమావేశంలో ఆయన మొత్తం చర్చలలో పాల్గొన్నారు.  

మావోయిస్టుల హింసాకాండ, టెర్రర్ మాడ్యూళ్లపై చర్యలు, సైబర్ నేరాలు వంటి అంశాలు ప్రముఖంగా చర్చలలో చోటు చేసుకున్నాయని అధికారులు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల డీజీపీలు, కేంద్ర పోలీసు సంస్థల డీజీలు, మరో 350 మంది సీనియర్ పోలీసు అధికారులు మూడు రోజుల సదస్సులో రెండో రోజు పాల్గొన్నారు.

సైబర్ నేరాలు, తీవ్రవాద వ్యతిరేక సవాళ్లు, వామపక్ష తీవ్రవాదం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో అభివృద్ధి చెందుతున్న ధోరణులతో సహా పలు అంశాలపై సదస్సు చర్చించినట్లు  తెలిపారు. ఇంటెలిజెన్స్ బ్యూరో నిర్వహిస్తున్న ఈ సదస్సు హైబ్రిడ్ ఫార్మాట్‌లో జరుగుతోంది. రాష్ట్రాలు మరియు ఇతర పోలీసు సంస్థల డిజిపిలు భౌతికంగా ఇక్కడ సమావేశానికి హాజరయ్యారు, మిగిలిన ఆహ్వానితులు దేశవ్యాప్తంగా 37 వేర్వేరు ప్రదేశాల నుండి వర్చ్యువల్ గా పాల్గొంటున్నారు.

విస్తృత స్థాయిలో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఉగ్రవాద నిరోధక చర్యలలో తలెత్తుతున్న సవాళ్లు, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల రవాణాతో తలెత్తుతున్న సామాజిక ఆర్థిక నేరాలు, ప్రత్యేకిం చి వామపక్ష తీవ్రవాద బెడద ఇప్పటికీ పొంచి ఉన్న రా ష్ట్రాలపై కూడా దృష్టి సారించారు. డిజిపిల వార్షిక సదస్సుకు ప్రధాని హాజరుకావడం 2014 నుంచి క్రమం తప్పకుండా జరుగుతోంది.

కేవలం తాను సదస్సుకు హాజరుకావడమే కాకుండా వివిధ స్థాయిల చర్చలలో ని అంశాలను తెలుసుకోవడం, ఇక్కడ స్వేచ్ఛాయుత, ఇష్టాగోష్టి సంప్రదింపులకు వీలు కల్పించడం వంటి వాతావరణాన్ని కల్పిస్తూ వస్తున్నారు. దేశాన్ని ప్రభావితం చేసే సంక్లిష్టమైన అంతర్గత భద్రతా అంశాలు అనేకం డిజిపి స్థాయి భేటీలలో ప్రస్తావనకు వస్తాయి. తాము ఎదుర్కొంటున్న వాస్తవిక క్షేత్రస్థాయి విషయాలను ప్రధాని మోడీకి డిజిపిలు నేరుగా నివేదించేందుకు ఈ దశలో వీలేర్పడుతుంది.

పైగా, గతంలో సాధారణంగా ఢిల్లీలో జరిగే ఈ వార్షిక సదస్సులను ప్రధాని మోదీ ఒకొక్క ఏడాది ఒకొక్క రాష్ట్రంలో జరుపుతున్నారు. గత ఏడాది మాత్రమే కరోనా కారణంగా వర్చ్యువల్ గా జరిగింది.  2014లో గౌహతి, 2015లో ధోర్డో, రాన్ ఆఫ్ కచ్, 2016లో నేషనల్ పోలీస్ అకాడమీ, హైదరాబాద్, 2017లో బీఎస్‌ఎఫ్ అకాడమీ, టేకాన్‌పూర్ (మధ్యప్రదేశ్), 2018లో కేవడియా (గుజరాత్),  2019లో పూణేలోని ఐఐఎస్‌ఈఆర్‌లో నిర్వహించారు.
2014 నుండి ఈ సదస్సుల ఫార్మాట్, చర్చించే అంశాలలో కూడా  గణనీయమైన మార్పులు జరిగాయి.  ప్రజల సేవలో పోలీసింగ్‌ను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తున్నారు. అంతకు ముందు చర్చలు ఎక్కువగా జాతీయ భద్రతా విషయాలపై మాత్రమే దృష్టి సారించాయి. ఇప్పుడు జాతీయ భద్రతతో పాటు ప్రధాన పోలీసింగ్ సమస్యలపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. 
 
ఇందులో నేరాల నివారణ, గుర్తింపు, కమ్యూనిటీ పోలీసింగ్, శాంతిభద్రతలు, పోలీసు-ఇమేజీని మెరుగుపరచడం మొదలైనవి ఉన్నాయని హోం మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు.    ప్రభుత్వాధినేతతో పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా సంభాషించడం వల్ల దేశం ఎదుర్కొంటున్న కీలకమైన సవాళ్లపై అభిప్రాయాలు ఏర్పడ్డాయని, చేయదగిన సిఫార్సుల ఆవిర్భావానికి దారితీసిందని ఓ అధికారి తెలిపారు. 2015 నుండి, గత సమావేశాల సిఫార్సుల తదుపరి తీసుకున్న చర్యల గురించి ప్రధాని, హోమ్ మంత్రిల సమక్షంలో చర్చిస్తున్నారు.