అమరావతి రైతుల మహా పాదయాత్రకు బీజేపీ సంఘీభావం

అమరావతి రైతులు కొనసాగిస్తున్న మహా పాదయాత్రకు బీజేపీ నాయకులు సంఘీభావం ప్రకటిస్తూ పాదయాత్రలో పాల్గొన్నారు. ఆదివారం నెల్లూరు జిల్లా రాజువారి చింతలపాలెం నుంచి ప్రారంభమైన పాదయాత్రలో బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు, కేంద్ర మాజీ మంత్రులు డి  పురంధేశ్వరి, సుజనా షౌదరి, ఎంపీ సీఎం రమేశ్‌, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి డా. కామినేని శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా రైతులతో నిర్వహించిన సభలో వారు ప్రసంగించారు. సోము వీర్రాజు మాట్లాడుతూ అమరావతిలోనే బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని నిర్మిస్తున్నామని వెల్లడించారు. ఇప్పటి వరకు కేంద్ర నిధులతో అమరావతిలో అనేక పనులు చేపట్టారని గుర్తు చేశారు. 

పురందేశ్వరి మాట్లాడుతూ అమరావతి రాజధానిపై బీజేపీది మొదట్నుంచి ఒకే విధానమని స్పష్టం చేశారు. పాదయాత్రలో లాఠీచార్జి చూసి బీజేపీ చలించిందని చెబుతూ  అమరావతికి కేంద్రం కట్టుబడి ఉందని  ఆమె భరోసా ఇచ్చారు. అనంతపురం నుంచి అమరావతి రోడ్డు, ఎయిమ్స్‌ పనులు జరుగుతాయని స్పష్టం చేశారు. రైతులను పక్కదారి పట్టించేందుకు అసెంబ్లీలో గందరగోళం సృష్టించారని ఆమె ఆరోపించారు. 

రాజధాని ఎక్కడికి పోదని, అమరవతే ఏపీ రాజధాని అంటూ తాము మొదటి నుంచి ఇదే మాటకు కట్టుబడి ఉన్నామని సుజనా చౌదరి స్పష్టం చేశారు. సాంకేతిక, న్యాయపరమైన అంశాలు చూసే తాను ఆనాడు మాట్లాడానని పేర్కొంటూ బీజేపీ జాతీయ నాయకత్వం సూచనతోనే నేతలంతా పాదయాత్రలో పాల్గొంటున్నామని తెలిపారు. ఏ క్షణమైన రాజధాని తరలిపోతుందని చెప్పే వార్తలను తాము పట్టించుకోమని తేల్చి చెప్పారు. అమరావతి పరిరక్షణ సమితిలా ఆంధ్రా పరిరక్షణ సమితి ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాజధానిగా అమరావతి ఉండాలనేది రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. 

కాగా, రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాజధాని రైతులు, మహిళలు చేస్తున్న మహాపాదయాత్ర ఆదివారం నెల్లూరు జిల్లాలో ప్రవేశించింది. న్యాయస్థానం నుంచి తిరుమల, తిరుపతి దేవస్థానం వరకు పాదయాత్ర పేరిట రైతులు నిర్వహిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా రెండు రోజుల పాటు నిలిపివేసిన పాదయాత్రను 21 వ రోజు జిల్లాలోని రాజువారి చింత పాలెం నుంచి కావలి వరకు కొనసాగనుంది.

పాదయాత్రకు అడుగడుగునా స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్ర గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా తిరుమలకు చేరుకోనంది. మొత్తం 45 రోజుల పాటు కొనసాగనున్న పాదయాత్ర కు స్థానికుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుందని జేఏసీ నాయకులు వెల్లడించారు.