వ్యవసాయ చట్టాల రద్దుపై 24న మంత్రివర్గం తీర్మానం!

మూడు వ్యవసాయ చట్టాల రద్దును ప్రకటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ లో ఆ మేరకు చట్టం తీసుకొచ్చేందుకు పక్రియను ప్రారంభించినట్లు తెలుస్తున్నది.  ఈనెల 24న జరుగనున్న కేంద్ర కేబినెట్‌ సమావేశంలో వీటిపై తీర్మానం చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.  
 
కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఈ నెల 29 నుండి జరుగనున్న పార్లమెంట్‌ సమావేశాల్లోనే సాగుచట్టాల రద్దు ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించడంతో  ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. 
 
చట్టంగా మారిన వాటిని రద్దు చేయాలంటే అవి రూపుదిద్దుకోవడానికి చేపట్టిన ప్రక్రియనే అనుసరిస్తారు. సాధారణంగా ఒక చట్టాన్ని తేవాలన్నా.. రద్దు చేయాలన్నా కేవలం పార్లమెంటుకే అధికారం ఉంటుంది. కొత్త చట్టాన్ని తెచ్చేందుకు పార్లమెంటులో ఏవిధంగానైతే బిల్లును ప్రవేశపెడతారో.. చట్టాన్ని రద్దు చేసేందుకు అదే ప్రక్రియ చేపట్టాల్సి వుంటుంది. 
 
దీనిలో భాగంగా మూడు వ్యవసాయచట్టాలను రద్దు చేయడానికి ప్రభుత్వం ఒక బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టనుంది. బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం పార్లమెంటులో వీటిపై చర్చ జరగడంతో పాటు ఓటింగ్‌ను నిర్వహిస్తారని ఆ వర్గాలు వెల్లడించాయి.
 
 మరోవంక, పార్లమెంటులో విధానపరంగా ఈ చట్టాలను రద్దు చేసేవరకు ఢిల్లీ సరిహద్ధుల్లో ఆందోళనకారులు తిష్ఠ వేసి ఉంటారని రైతునాయకులు స్పష్టం చేశారు. కనీస మద్దతు ధరపై చట్టబద్ధమైన హామీ , విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ డిమాండ్లు నెరవేరేవరకు ఆందోళన కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.