దేశీయ ఆలోచ‌న‌లు ప్ర‌తిబింబించే సాహిత్యం రావాలి

దేశీయ ఆలోచ‌న‌లు ప్ర‌తిబింబించే సాహిత్యం రావాలనిఆర్.ఎస్‌.ఎస్ అఖిల భార‌త కార్య‌కారిణి సభ్యులు వి భాగ‌య్య పిలుపిచ్చారు. “అజాదీ కా అమృతోత్స‌వాల‌లో భాగంగా జాతీయ సాహిత్య పరిష‌త్‌, ఇతిహాస సంక‌ల‌న స‌మితి, సంస్కార భార‌తి, ప్ర‌జ్క్షా భార‌తి, త‌దిత‌ర సంస్థ‌లు సంయుక్తంగా నిర్వహించిన రెండు రోజుల గోల్కొండ సాహితీ ఉత్ప‌వాన్ని హ‌ర్యాణా గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ‌, కేంద్ర సాంస్కృతిక, ప‌ర్యాట‌క శాఖ మంత్రి జి.కిష‌న్ రెడ్డిలతో కలసి ప్రారంభిస్తూ, కీలక ప్రసంగం చేశారు.
స్వాతంత్య్రం అంటే ఒక జాతికి త‌న‌దైన జీవితాన్ని గ‌డుపుతూ మాన‌వాళికి, ప్ర‌పంచానికి సేవ చేసే అవ‌కాశాన్ని క‌ల్పించేదని భాగయ్య పేర్కొంటూ  స్వ‌తంత్ర దేశంలో మ‌నం ప్ర‌తీ దానికి ప్ర‌భుత్వంపై ఆధార‌ప‌డ‌టం మ‌న స‌మాజానికి న‌ష్ట కార‌కం అని హెచ్చరించారు. ఈ బాధ్య‌త‌నే సాహిత్యం గుర్తుచేయాల‌ని ఆకాంక్షించారు. విద్యావిధానంతో పాటు అన్ని జీవ‌న రంగాల్లో మార్పు రావాల‌ని కోరారు.
బుద్ధికి, వివేకానికి ప‌దును పెడుతూ సాహితీ రంగం ఈ మార్పును క‌ల్గిస్తుంద‌ని చెబుతూ మ‌న‌సుకు దిశ చూపుతూ హృద‌యాన్ని మేల్కొలిపే సాహిత్యం ఈ పుణ్య భూమిలో రామాయ‌ణం, భార‌తం, భాగ‌వ‌తం, వేద సాహిత్యం, బౌద్ధ సాహిత్య రూపంలో మ‌న‌కు అందింద‌ని ఆయన గుర్తు చేశారు. కాళిదాసు, వేమ‌న‌, న‌న్న‌య‌, తిరువ‌ళ్ళువ‌ర్ వంటి వారి సాహిత్యం సాంస్కృతిక వికాసానికి తోడ్ప‌డింద‌ని యోగి అర‌విందులు చెప్పిన విష‌యాన్ని గుర్తు చేశారు.
భార‌తీయ సాహిత్యంలో ఆధ్యాత్మిక‌త, ఆధునిక‌త స‌మ‌పాళ్ళలో ఉన్నాయ‌ని అన్నారు. నిన్న‌టి ఉద‌యం మ‌ళ్లీ వ‌చ్చిన‌ట్టే మ‌న దేశం అఖండ‌మ‌వుతుంద‌ని విశ్వాసం వ్యక్తం చేశారు. భార‌తీయ జీవ‌న విధానం ప‌ట్ల అవ‌మాన‌ల‌ను తొల‌గించ‌డానికి మ‌న సాహితీ వేత్త‌లు ఎంతో కృషి చేశార‌ని చెప్పారు. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా “మాత‌ల‌కు మాత స‌కల సంప‌త్స‌మేత మ‌న భ‌ర‌త‌మాత‌” అని గుర్రం జాషువా చెప్పిన ప‌ద్యంలోని ఒక వాక్యాన్ని గుర్తు చేశారు.
చ‌రిత మ‌రిచిన దేశాలు కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయాయి, కానీ మ‌న దేశం అనాదిగా నిల‌బ‌డ‌టానికి కార‌ణం మ‌న సాహితీ వేత్త‌లే అని భాగయ్య కొనియాడారు. ఈ సంద‌ర్భంగా దేశ భ‌క్తిని ప్ర‌బోధించిన సుబ్ర‌మ‌ణ్య భార‌తి గారి ప‌ద్యాలు, సువ‌వ‌రం ప్ర‌తాప‌రెడ్డి గారి గోల్కొండ ప‌త్రిక‌, ఉన్న‌వ ల‌క్ష్మినారాయ‌ణ గారి మాల‌ప‌ల్లి న‌వ‌ల‌, భ‌క్త‌రామదాసు గారి ధార్మిక సాహిత్యాన్ని గుర్తు చేశారు.
 నేటి క‌వులు, ర‌చ‌యితలు కూడా దేశ సంస్కృతిని, ఐక‌మ‌త్యాన్ని ప్రేరెపించే ర‌చ‌న‌లు చేసి జాతీయవాదాన్ని భావిత‌రాల‌కు అందించాల‌ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. భార‌త స్వ‌తంత్ర పోరాటంలో విస్మ‌రించ‌బ‌డ్డ వీరుల‌ను స్మ‌రించుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వ నేతృత్వంలో స్వాతంత్య్ర అమృత మ‌హోత్స‌వాలు నిర్వ‌హించుకుంటున్నామ‌ని తెలిపారు.
 ఇదే సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని బ్రిటిష్ వారిని ధైర్యంగా ఎదుర్కొన్న వ‌న‌వాసీ వీరుడు బిర్సాముండా జ‌యంతిని జాతీయ గిరిజ‌న దినోత్స‌వంగా కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌లే ప్ర‌క‌టించింద‌ని గుర్తు చేశారు. హైద‌రాబాద్‌లో కూడా కోమురంభీం, రాంజీగోండు, అల్లూరి వంటి గిరిజ‌న వీరుల‌ను గాధ‌ల‌ను ప‌రిచ‌యం చేయ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం గిరిజ‌న మ్యూజియం ఏర్పాటు కోసం రూ.15కోట్లు కేటాయించింద‌ని తెలిపారు
హ‌ర్యాణా గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్రాత్రేయ మాట్లాడుతూ నిజాం న‌వాబును ఎదురించిన చాక‌లి ఐల‌మ్మ‌, దొడ్డి కొముర‌య్య‌, షోయ‌బుల్లాఖాన్ త‌దిత‌రుల‌ను కొనియాడారు. ఉప్పు స‌త్యాగ్ర‌హంలో ఆర్‌.ఎస్‌.ఎస్ వ్య‌వ‌స్థాప‌కులు హెగ్డెవార్ పాల్గొన్నార‌ని గుర్తు చేశారు. బ్రిటిష్ వారు మ‌న సంప‌ద‌ను ఎంత దోచినా మ‌న సంస్కృతిని దేశ‌భ‌క్త క‌వులు కాపాడినార‌ని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా క‌వులు ర‌చ‌యితలు విద్యార్థుల్లో, యువ‌త‌లో దేశ‌భ‌క్తిని ప్రేరేపించే ర‌చ‌న‌లు చేయాల‌ని పిలుపునిచ్చారు. పాఠ‌శాల స్థాయి నుంచే మ‌న సంస్కృతీ సాంప్ర‌దాయాల‌ను పిల్ల‌ల‌కు అందించిన‌ప్పుడే దేశం నిల‌బ‌డుతుంద‌ని అన్నారు.