23 నుంచి బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ విచారణ

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీపై ఈ నెల 23వ తేదీ నుంచి 26వ తేదీ దాకా బ్రిజే్‌షకుమార్‌ ట్రైబ్యునల్‌ విచారణ జరపనుంది. కృష్ణా జలాలను ప్రాజెక్టుల వారీగా పంపిణీ చేయాలని తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ తరపున సాక్షిగా ఉన్న సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్‌ ఘన్‌శ్యామ్‌ ఝాను ఏపీ న్యాయవాదులు రెండోసారి క్రాస్‌ ఎగ్జామిన్‌ చేయనున్నారు.

అనంతరం ఈ కేసుపై రెండు రాష్ట్రాలు తమ వాదనలు వినిపించనున్నాయి. ఉమ్మడి ఏపీకి 1005 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించడంతో పాటు ఆల్మట్టి ఎత్తు పెంపునకు అనుమతి ఇస్తూ బ్రిజే్‌షకుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పు ఇచ్చింది. 

దీన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేయగా.. తీర్పు అమల్లోకి రాకుండా కోర్టు స్టే విధించింది. ఇదిలా ఉండగా, 1005 టీఎంసీలను రెండు తెలుగు రాష్ట్రాలకు పునఃపంపిణీ చేసే బాధ్యతలను బ్రిజే్‌షకుమార్‌ ట్రైబ్యునల్‌కే తాజాగా కేంద్రం అప్పగించింది.

 ట్రైబ్యునల్‌ తీర్పు వెలువరిస్తే దాని ఆధారంగా కేటాయించిన జలాలకు లోబడి… కృష్ణాలో కొన్ని ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చుకోవాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. పాలమూరు-రంగారెడ్డితోపాటు పలు ప్రాజెక్టులు కృష్ణా బేసిన్‌లో అనుమతి లేని జాబితాలో ఉన్నాయి. 

2022 జనవరి రెండో వారంలోపు పాలమూరు డీపీఆర్‌ను కృష్ణా బోర్డుకు అందించనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాజెక్టు మిగులు జలాలపై ప్రతిపాదించింది కావడంతో డీపీఆర్‌ సమర్పించే అంశంపై మల్లగుల్లాలు పడుతోంది.

 rail