కేసీఆర్ మహాధర్నా … వైఖరి స్పష్టం చేసిన కేంద్రం

కేసీఆర్ మహాధర్నా … వైఖరి స్పష్టం చేసిన కేంద్రం
గతంలో పార్లమెంట్ లోపల, బయట కేంద్రం ప్రవేశపెట్టిన మూడు సాగు చట్టాలకు పూర్తి మద్దతు తెలిపిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఇప్పుడు రైతు వ్య‌తిరేక చ‌ట్టాల‌పై చివ‌రి ర‌క్త‌పు బొట్టు వ‌ర‌కు పోరాటం చేస్తానని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం వరి కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ హైదరాబాడ్ లోని ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ లో టిఆర్ఎస్ పార్టీ జరిపిన మహాధర్నాకు ఆయన నేతృత్వం వహించారు.  కెసిఆర్ తోపాటు మంత్రులు, ఎంపిలు, టిఆర్ఎస్ నాయకులు కూడా పాల్గొన్నారు.
 
“మీరు వ‌డ్లు కొంట‌రా.. కొన‌రా.. అనేది స్ప‌ష్టం చేయాలి” అని ప్రధాని నరేంద్ర మోదీని ఈ సందర్భంగా ఆయన కోరారు. పంజాబ్‌లో ధాన్యం కొనుగోలు చేసిన‌ట్టే తెలంగాణ‌లో ధాన్యం కొనుగోలు చేయాల‌ని కేంద్రానికి చేతులెత్తి దండం పెట్టామని చెప్పారు. కేంద్రానికి మ‌న రైతుల గోస‌ల‌ను, బాధ‌లను విన్న‌వించామని తెలిపారు. నిన్న స్వ‌యంగా ప్ర‌ధాని మోదీకి లేఖ వ్రాసినా కేంద్రం నుంచి స్పంద‌న లేదని విచారం వ్యక్తం చేశారు. 
 
“మ‌న బాధ ప్ర‌పంచానికి, దేశానికి తెలియాల‌ని చెప్పి ఈ ధ‌ర్నాకు శ్రీకారం చుట్టాం. ఇది ఆరంభం మాత్ర‌మే. అంతం కాదు. రానున్న రోజుల్లో గ్రామాల్లో కూడా ప్రజల హక్కు కాపాడేందుకు వివిధ రూపాల్లో పోరాటాల‌ను ఎంచుకుని ముందుకు కొన‌సాగుతూనే ఉంటాం. కేంద్రం దిగివ‌చ్చి మ‌న రైతాంగానికి న్యాయం చేసే వ‌ర‌కు పోరాటం కొన‌సాగిస్తాం” అని సిఎం కెసిఆర్  ప్రకటించారు. 
 
మరోవంక, పార్ బాయిల్డ్ రైస్‌ను తీసుకోబోమని కేంద్ర ప్రభుత్వం  స్పష్టం చేసింది. యాసంగి పంట ధాన్యం కూడా పరిమితంగానే కొంటామని పేర్కొంది. రబీ పంట సేకరణకు సంబంధించి రాష్ట్రాలతో చర్చించిన తర్వాత వచ్చే ఏడాది ఎంత సేకరించాలో నిర్ణయం తీసుకుంటామని కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది.
గత ఖరీఫ్‌లో 32 లక్షల మెట్రిక్‌  టన్నుల బియ్యాన్ని కొన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఖరీఫ్‌లో 40 లక్షల మెట్రిక్‌ టన్నుల(25 శాతం పెంపు) బియ్యం కొనుగోలు పెంచే అంశం పరిశీలనలో ఉందని  పేర్కొంది. గత రబీ సీజన్‌లో ఇచ్చిన హామీతో  మొత్తం వరి ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్రం ప్రకటించింది.
‘ప్రస్తుతం  దేశంలో పారా బాయిల్డ్ రైస్‌కు డిమాండ్ లేదు. ఈ తరహా రైస్‌ను వినియోగించే రాష్ట్రాలు స్వయంగా సమకూర్చుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇకమీదట పారా బాయిల్డ్ రైస్ సేకరణ కుదరదని తెలంగాణ ప్రభుత్వానికి చెప్పాం. అందుకు ప్రభుత్వం కూడా అంగీకరించింది. దేశవ్యాప్తంగా వరి, గోధుమ పంటల దిగుబడి దేశీయ అవసరాలకు మించి జరుగుతోందని తెలిపింది.
 
 ‘‘ఒక్కో రాష్ట్రం నుంచి డిమాండ్ ఒక్కో విధంగా ఉంటుంది. డిమాండ్లకు అనుగుణంగా రాష్ట్రాలతో జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం. ఇప్పటి వరకు జరిగిన నిర్ణయాల ప్రకారం బాయిల్డ్ రైస్ కేంద్రం కొనదు. వరి, గోధుమ పంటను తక్కువ పండించాలని రాష్ట్రాలను కోరుతున్నాం” అని కేంద్రం తెలిపింది. 
 
ప్రస్తుతం.. దేశంలో నిల్వలు సరిపడా ఉన్నాయి. అవకాశం ఉన్నంత మేరకు ఎగుమతి చేయడానికి ఉన్న అవకాశాలను పరిగణనలోకి తీసుకుంటున్నాం. ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లాలని సూచనలు చేస్తున్నాం. ఆయిల్, పప్పు ధాన్యాలు ఎక్కువ పండించాలని అన్ని రాష్ట్రాలకు సూచనలు చేస్తున్నాం. రాష్ట్రాలు ఎంత వరకు సేకరించగలుగుతాయో అంత వరకే పరిమితం కావాలని చెబుతున్నామని కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. 
 
కాగా, హుజురాబాద్ ఓటమితో గ్రాఫ్ పడిపోవటంతో కేసీఆర్ కవర్ చేసుకునే పనిలో ఉన్నాడని బిజెపి ఎమ్యెల్యే రాజాసింగ్  ఎద్దేవాచేశారు. రైతు చట్టాలు బాగున్నాయని గతంలో కేసీఆర్ అన్నారని గుర్తుచేశారు. ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నాడని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసినందుకే కేసీఆర్ జిమిక్కులు చేస్తున్నారని రాజసింగ్ ధ్వజమెత్తారు. ప్రజలను వంచించటంలో కేసీఆర్‌ను మించిన వాళ్లు లేరని విమర్శించారు.