మావోయిస్టు సానుభూతి పరులపై  ఎన్ఐఏ సోదాలు 

రెండు తెలుగు రాష్ట్రాలలో వివిధ ప్రదేశాలలో మావోయిస్టు సానుభూతిపరులు, మాజీ మావోయిస్టులపై   నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ)    విస్తృతంగా సోదాలు జరిపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 14 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు ఎన్ఐఏ పేర్కొంది. హైదరాబాద్, రాచకొండ, మెదక్, ప్రకాశం, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు  ప్రాంతాల్లో గురువారం ఉదయం నుంచి ఎన్ఐఏ సోదాలు నిర్వహించిది.  

2019 జూన్‌లో ఛత్తీస్‌గడ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ కేసు దర్యాప్తులో భాగంగా సోదాలు నిర్వహించామని తెలిపింది. అప్పటి కూంబింగ్ ఆపరేషన్‌లో ఆరుగురు మావోయిస్ట్‌లతో పాటు ఒక పౌరుడు హతమయ్యారు. ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రంలోని బస్తర్‌‌లో జూన్ 2019లో ఎఫ్ఐఆర్  నమోదయింది. ఎఫ్ఐఆర్ ఆధారంగా 2021 మార్చిలో కేసును ఎన్ఐఏ టేకప్ చేసింది. 

సంజు, లక్ష్మణ్, మున్ని, దాషరి పేర్లను ఎఫ్ఐఆర్‌లో ఎన్ఐఏ చేర్చింది. ఈరోజు ఉదయం నుంచి సోదాలను ఎన్ఐఏ నిర్వహించింది. ఈ సోదాల్లో ఎలాక్రానిక్ పరికరాలు, అనుమనాస్పద మెటీరియల్, మావోయిస్ట్ సాహిత్య పుస్తకాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ అధికారిక ప్రకటనలో పేర్కొంది.

హైదరాబాద్ లో అల్వాల్, నాగోల్, నారాయణగూడ, బాగ్‌లింగంపల్లి అంబేద్కర్ కాలేజ్ ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్‌లో సోదాలు చేశారు. అపార్ట్‌మెంట్‌లో ఓయూ విద్యార్థులు ఉంటున్నారని సమాచారంతో సోదాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సోదాల్లో నిషేధిత సాహిత్య పుస్తకాలు ఉన్నట్లు గుర్తించారు. 

నారాయణగూడలోని అంబికా టవర్స్‌లో లేడీస్ హాస్టల్‌లోనూ సోదాలు చేశారు. నాగోల్‌లో రవిశర్మ ఇంట్లో కూడా సోదాలు చేశారు. ఆయన మావోయిస్ట్ పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేసి లొంగిపోయారు. ప్రకాశం జిల్లా ఆలకూరపాడులో ఆర్‌కె తోడల్లుడు, ,విరసం నేత కల్యాణ్‌రావు ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు చేశారు. 

అల్వాల్ సుభాష్ నగర్‌లో నివాసముంటున్న.. అమరుల బంధుమిత్రుల సంఘం నేత పద్మ కుమారి, భవాని ఇళ్లలో ఎన్‌ఐఏ సోదాలు చేసింది. పద్మను పోలీసులు విచారిస్తుండగా స్పృహ కోల్పోవడంతో ఆస్పత్రికి తరలించారు. 

నెల్లూరు లోని అరవిందనగర్‌లోని ఓ ఇంట్లో వేకువజామున నుంచి సోదాలు జరిపి అక్కడ నివసిస్తున్న ఇద్దరు మహిళల నుంచి రెండు సెల్‌ఫోన్లు, ఓ డైరీ స్వాధీనం చేసుకున్నారు.  వీరి సోదరుడు సునీల్‌ అలియాస్‌ రవి మావోయిస్టు పార్టీలో చేరి టెక్నికల్‌ బృందంలో కీలకంగా వ్యవహరించేవారు.

ఇటీవల జార్ఖండ్‌లో జరిగిన బాంబు ప్రమాదంలో అతడు మరణించినట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. విశాఖలో ఆరిలోవ టిఐపి పాయింట్‌ సమీపంలో నివాసముంటున్న ప్రజాసంఘాల్లో పని చేస్తున్న అందలూరి అన్నపూర్ణ ఇంటిలో సోదాలు చేశారు.