అందరికి అందుబాటులోకి ఆరోగ్య సేవలు

ఆరోగ్య సంరక్షణ సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ విషయంలో ప్రజల మీద పడుతున్న ఆర్ధిక భారాన్ని తగ్గించాలని సూచించారు.

హైదరాబాద్ లోని యోధా లైఫ్ లైన్ డయాగ్నస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను ప్రారంభిస్తూ సమాజంలోని ఉన్నతమైన వృత్తుల్లో వైద్య వృత్తి ఒకటి అని తెలిపారు. ప్రాణాలు నిలబెట్టే వైద్యులను భగవంతుడితో సమానంగా భారతీయ సంస్కృతి గౌరవాన్ని అందించిందన్న ఆయన, వైద్యుల తమ దగ్గరకు వచ్చిన రోగుల పట్ల మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని, వారి సమస్యలను తెలుసుకుని, వారికి ధైర్యాన్ని చెప్పి, సానుభూతితో చికిత్స అందించాలని సూచించారు.

కరోనా మహమ్మారి గురించి ప్రస్తావిస్తు ఏదైనా వ్యాధిని నివారించేందుకు మంచి ఆరోగ్యం, దారుఢ్యం అవసరమనే విషయాన్ని ఇది మరోసారి గుర్తు చేసిందని తెలిపారు. కరోనా ముందు వరుస యోధుల కృషి, అంకితభావం, త్యాగాలను ప్రశంసించిన ఆయన, తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి, ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు వారు చేసిన కృషికి వందనాలు తెలిపారు. 

వేగవంతమైన టీకాకరణ ద్వారా కరోనా మహమ్మారి సవాళ్ళను భారతదేశం అధిగమిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు భారతీయ బృంద (టీమ్ ఇండియా) స్ఫూర్తితో పని చేస్తున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. 

గ్రామీణ ప్రాంతాల్లో మంచి ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తూ ఈ విషయంలో ప్రభుత్వాలకు ప్రైవేట్ రంగం సహకారం అందించాలని ఆయన సూచించారు. ప్రపంచ స్థాయి టెలి మెడిసిన్ సౌకర్యాలను గ్రామాలకు అందించేందుకు, సాంకేతిక, టెలీ కమ్యూనికేషన్ రంగాల్లో భారతదేశ అభివృద్ధిని పరిపూర్ణంగా వినియోగించుకోగలగాలని చెప్పారు. 

కొన్ని  ప్రైవేట్ ఆస్పత్రులు రోగనిర్ధారణ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని విచక్షణా రహితంగా వినియోగించుకోవడం, చికిత్స కోసం ఖరీదైన మందులను అధికస్థాయిలో సూచిస్తున్న సందర్భాలకు సంబంధించిన నీతి ఆయోగ్ నివేదికను ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా ప్రస్తావించారు.