
విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుండి దేశంలో పలు ప్రాంతాలకు గంజాయి యధేచ్చగా సరఫరా జరుగుతున్నది. విశాఖ నుండి వచ్చే గంజాయిపై ఇతర రాష్ట్రాల పోలీసులు, మాదకద్రవ్యాల నిరోధక బృందం (ఎన్‌సీబీ), ప్రత్యేక బృందాల నిఘా పెరగడంతో ఇప్పుడు స్మగ్లర్లు రూటు మారుస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లో గంజాయి స్మగ్లర్లు ఏకంగా ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌ను అడ్డాగా చేసుకుని విక్రయాలు సాగిస్తుండడం వెల్లడైనది. ఈ సందర్భంగా నిందితుల కోసం వేట సాగిస్తూ ఇద్దరు కొనుగోలుదారులను పోలీసులు అరెస్టు చేశారు. అమెజాన్‌కు నోటీసులు జారీ చేశారు. అమెజాన్ గ్వాలియర్ రెండు డెలివరీ హబ్‌ల ద్వారా ‘డ్రై స్టీవియా’ పేరిట గంజాయి విక్రయాలకు దుండగులు తెరలేపారు.
నిజానికి స్టీవియా అనేది చక్కెరకు ప్రత్యామ్నాయం. గ్లూకోజ్ తక్కువగా ఉంటుంది. కాబట్టి, మధుమేహులు టీ/కాఫీల్లో, స్వీట్లలో స్టీవియాను వినియోగిస్తుంటారు. ఆ పేరుతో ఇప్పటి వరకు రూ. 1.10 కోట్ల విలువ చేసే గంజాయిని అమెజాన్‌లో దుండగులు అమ్మేశారు. గ్వాలియర్ పోలీసులు ఈ ముఠాకు చెందిన కల్లు పవయ్య, బ్రిజేంద్ర తోమర్‌లను అరెస్టు చేసి, 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఏపీలోని విశాఖ ఏజెన్సీ నుంచి దుండగులు ఈ-కామర్స్, కొరియర్ సంస్థల ద్వారా గంజాయిని గ్వాలియర్, భోపాల్, కోటా, ఆగ్రా నగరాలకు తరలిస్తున్నారని తెలిపారు. గ్వాలియర్‌లోని అమెజాన్ డెలివరీ హబ్ నుంచి రూ.1.10 కోట్లకు పైగా విలువ చేసే గంజాయిని విక్రయించారని చెప్పారు.
పోలీసుల దాడిని తప్పించుకునేందుకు దుండగులు అమెజాన్‌ను వేదికగా మలచుకున్నారని.. గంజాయి కావాల్సిన వారు మాత్రమే.. దాన్ని కొనుగోలు చేసేవారని భావిస్తున్నారు. రూ. 1.10 కోట్ల విక్రయాల్లో సుమారు రూ.66 లక్షలు అమెజాన్‌కు కమీషన్ రూపంలో దక్కాయి. ఈ నేపథ్యంలో ఎన్‌డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 20(బీ) ప్రకారం అమెజాన్ అధికారులు కూడా శిక్షార్హులేనని పోలీసులు తెలిపారు. మంగళవారం ఆ సంస్థకు చెందిన న్యాయవాదులు గ్వాలియర్ పోలీసుల ముందు హాజరుకానున్నారు.
కాగా.. ఈ ఉదంతంపై అమెజాన్ స్పందించింది. ‘‘భారత చట్టాల మేరకు వస్తువులను మా ప్లాట్‌పామ్‌పైకి అనుమతిస్తాం. నిషేధిత వస్తువులను అనుమతించే ప్రసక్తే లేదు. గంజాయి విక్రయాలు జరగడంపై అంతర్గత విచారణ జరుపుతున్నాం’’ అని వివరించింది.
More Stories
ప్రపంచవ్యాప్తంగా ప్రమాదంలో ఆర్ధిక వ్యవస్థ
ప్రపంచ బ్యాంకింగ్ సంక్షోభంపై భారత్ అప్రమత్తం
5జీ కోసం జియో లక్ష టవర్లు