ఎగుమ‌తుల్లో 43% వృద్ధి… ఐదు నెలల గరిష్టంకు ద్ర‌వ్యోల్బ‌ణం

అక్టోబ‌ర్ నెల‌లో ఎగుమ‌తులు 43 శాతం పుంజుకుని 35.65 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరుకున్నాయి. అయినా వాణిజ్య లోటు 19.73 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరుకున్న‌ద‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. దిగుమ‌తులు కూడా 62.51 శాతం పెరిగి 55.37 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరాయి.

పెట్రోలియం, కాఫీ, ఇంజినీరింగ్ గూడ్స్‌, నూలు, ఫ్యాబ్స్‌, జెమ్స్ అడ్ జ్యువెల్ల‌రీ, కెమిక‌ల్స్ ప్లాస్టిక్‌, లినోలియం, స‌ముద్ర ఉత్ప‌త్తుల‌ను గత నెల‌లో ఎగుమ‌తి చేయ‌డంలో సానుకూల గ్రోత్ న‌మోదైంద‌ని ప్ర‌భుత్వ గ‌ణాంకాలు తెలిపాయి.

ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో ఏప్రిల్‌-అక్టోబ‌ర్ మ‌ధ్య ఎగుమ‌తులు 233.54 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరుకున్నాయి. గ‌తేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎగుమ‌తులు 55.13 శాతం వృద్ధి చెందాయి. మ‌రోవైపు దిగుమ‌తులు 78.16 శాతం పెరిగి 3331.39 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరాయి.

కాగా,  గ‌త నెల‌లో హోల్‌సేల్ ద్ర‌వ్యోల్బ‌ణం ఐదు నెల‌ల గ‌రిష్ఠాన్ని తాకింది. అక్టోబర్ నెల ద్ర‌వ్యోల్బ‌ణం 12.54 శాతానికి చేరుకున్న‌ది. పెట్రోలియం ఉత్పత్తుల‌తోపాటు మాన్యుఫాక్చ‌రింగ్ ప్రొడ‌క్ట్స్ ధ‌ర‌లు పెరుగ‌డం వ‌ల్లే ద్రవ్యోల్బణం పైపైకి దూసుకెళ్లిందని తెలుస్తోంది.

ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం తొలి నుంచి ద్ర‌వ్యోల్బ‌ణం డ‌బుల్ డిజిట్స్ న‌మోద‌వుతున్న‌ది. సెప్టెంబ‌ర్‌లో 10.66 శాతానికి ప‌డిపోయినా తిరిగి అక్టోబ‌ర్‌లో పెరిగింది. 2020తో పోలిస్తే ఈ ఏడాది మినరల్‌ ఆయిల్స్‌, బేసిక్‌ మెటల్స్‌, ఫుడ్ ప్రొడ‌క్ట్స్‌, క్రూడ్ ఆయిల్‌, నేచుర‌ల్ గ్యాస్‌, కెమిక‌ల్స్‌, రసాయన ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగాయి.

సెప్టెంబర్‌లో 11.41%గా ఉన్న మాన్యుఫాక్చ‌రింగ్ ప్రొడ‌క్ట్స్‌ ద్రవ్యోల్బణం గ‌త నెల‌లో 12.04 శాతానికి దూసుకెళ్లింది. ఇంధన, విద్యుత్‌ రంగంలో ద్రవ్యోల్బణం 24.84% నుంచి 37.18 శాతానికి చేరుకుంది. ఇక క్రూడాయిల్ 71.86 నుంచి 80.57 శాతానికి పెరిగింది. ఇక నిత్యం వినియోగించే ఉల్లిగ‌డ్డ‌ల ధ‌ర‌లు 25.01 శాతం త‌గ్గాయ‌ని ప్ర‌భుత్వ గ‌ణాంకాలు చెప్పాయి.