మావోయిస్టులకు చావుదెబ్బ గడ్చిరోలి భారీ ఎన్‌కౌంటర్‌

మావోయిస్టు పార్టీ విస్తరణ ప్రణాళికలకు గడ్చిరోలి భారీ ఎన్‌కౌంటర్‌ చావు దెబ్బ తీసిన్నట్లు భావిస్తున్నారు.  దక్షిణాదిలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కుదేలైన పార్టీని ఆదుకునేందుకు కేంద్ర కమిటీ నియమించిన విస్తరణ కమిటీ హెడ్, కేంద్ర కమిటీ సభ్యుడు దిలీప్‌ తేల్తుంబ్డే అలియాస్‌ మిలింద్‌ ఈ ఎన్‌కౌంటర్‌ లో మరణించడం వారికి కోలుకోలేని నష్టంగా మారే అవకాశం ఉంది. 

 డీవీసీ కార్యదర్శి సుఖ్‌లాల్‌ కూడా మృతి చెందారు. మృతులలో ఆరుగురు మహిళలు ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నేతృత్వంలో ఈ ఏడాది సెప్టెంబర్‌ 26న ఢిల్లీలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సమావేశం జరిగింది. ఆ తర్వాత ఇదే అతి పెద్ద తొలి ఎన్‌కౌంటర్‌ కావడం గమనార్హం. 

మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీ భారీ స్థాయిలో నియామకంపై దృష్టి పెట్టాయి. ముఖ్యంగా వంద మంది మావోయిస్టులు చుట్టుముట్టి అత్యాధునిక ఆయుధాలతో కాల్పులు జరిపినా, భద్రతా దళాలు వారిని ఎదుర్కొని, ధైర్యసాహసాలు ప్రదర్శించినట్లు తెలుస్తున్నది. మొత్తం పదిగంటల సేపు ఉధృతంగా కాల్పులు జరిగాయి. 

ఇటీవల వారికి ఓ ట్రక్కు ద్వారా రేషన్‌ బియ్యం అందినట్లు తెలిసింది. ప్రభుత్వ రేషన్‌ ట్రక్కుకు జీపీఎస్‌ ట్రాకింగ్‌ ఉండడం.. ఆ ట్రక్కు ఎలెవన్‌బట్టి అడవుల్లో గ్యారాపత్తి సమీపంలో ఎక్కువసేపు ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు, పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. దాంతో.. పెద్ద సంఖ్యలో నక్సల్స్‌ అక్కడ మకాంవేసి ఉంటారనే అనుమానంతో.. శనివారం తెల్లవారుజాము నుంచే సీ-60 కమాండోలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి.. కూంబింగ్‌ నిర్వహించారు. 

మావోయిస్టులు వీరి జాడను గుర్తించి, కాల్పులు జరపడంతో.. ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సీ-60 కమాండోలు చుట్టుముట్టి ముప్పేట దాడి చేయడంతో మావోయిస్టులు ట్రాప్‌లో చిక్కుకున్నట్లైందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎన్‌కౌంటర్‌ స్థలంలో కేవలం 26 మృతదేహాలుండగా.. నష్టం ఇంకా ఎక్కువగా ఉండి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 70 మంది వరకు నక్సల్స్‌, కొత్త రిక్రూటీలు అడవుల్లోకి పారిపోయి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

రిక్రూట్‌మెంట్‌తో పాటు కమిటీలను బలోపేతం చేసే దిశగా గడ్చిరోలి కమిటీతో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. కోర్చి పరిధిలోని మర్దిన్‌తోలా అటవుల్లో 48మందితో మిలింద్‌ సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. కోవర్టుల ద్వారా ఇది తెలుసుకున్న పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ ఆపరేషన్‌ నిర్వహించినట్లు తెలిసింది. 

ఈ భేటీలో మిలింద్‌ కీలక సూచనలు చేసే సమయంలోనే తుపాకుల మోత ప్రారంభమైనట్లు సమాచారం.  గడ్చిరోలి కమిటీ భేటీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మావోయిస్టు నేతలు నలుగురు, ఒడిశాకు చెందిన ముగ్గురు ఉన్నట్లు తెలుస్తున్నది.  కేంద్ర కమిటీలోని 21 మందిలో అనారోగ్య కారణాలతో ముగ్గురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరో ముగ్గురు గడిచిన ఏడాదిలో లొంగిపోయారు. దీనితో పార్టీలో యాక్టివ్‌గా ఉన్న వారి సంఖ్య సగానికిపైగా తగ్గింది.

ఒకప్పుడు దేశం మొత్తం మీద బలమైన కోటగా ఉన్న ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో నేడు వారి ఉనికి ప్రశ్నార్ధకరంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతగా కష్ట పడుతున్నా వారి ఎత్తుగడలు ఫలించడం లేదు. దేశంలో మావోయిస్టు పార్టీకి ప్రస్తుతం అత్యంత గడ్డు రోజులు నడుస్తున్నాయి.

కరోనా మొదటివేవ్, లాక్‌డౌన్‌ కాలంలో అనూహ్యంగా తెలంగాణలో ప్రాబల్యం చాటుకునే యత్నం చేసిన మావోలు  రెండోవేవ్‌లో తమను తాము వైరస్‌ బారినుంచి, భద్రతా బలగాల నుంచి కాపాడుకులేకపోతున్నారు. పెరిగిన టెక్నాలజీ, దండకారణ్యంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు, వరుసగా మావోయిస్టు అగ్రనేతలను కోల్పోవడంతో పార్టీకి ఎదురుదెబ్బలు తాకుతున్నాయి.