బిట్‌కాయిన్ కుంభకోణంతో ఎవ్వరినైనా త్యాగం చేస్తాం!

బిట్‌కాయిన్ కుంభకోణంతో తమ ప్రభుత్వంలో గాని, పార్టీలో గాని ఎవ్వరికైనా  ప్రమేయం ఉన్నట్లు రుజువైతే వారిని త్యాగం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పష్టం చేశారు. ఆ కుంభకోణంలో పలుకుబడిగల వారి ప్రమేయం ఉన్నదని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలు ప్రస్తావిస్తే వారెవ్వరో పేర్లు బైట పెట్టండి అంటూ ఆయన సవాల్ చేశారు. 
 
ఈ కుంభకోణంతో సంబంధం ఉన్నవారిని వదులుకోవడానికి తన ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీనిలో రెండో ఆలోచన లేదని పేర్కొంటూ అటువంటి వారిపై తాము నిర్దయగా చర్య తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రమేయం ఉన్నవారి పేర్లు చెబితే తాము వెంటనే దర్యాప్తు చేస్తామని, రెండో ఆలోచనే ఉండదని తేల్చి చెప్పారు.
ఈ కుంభకోణంతో ప్రమేయం ఉన్నవారు దేశంలో ఉన్నా, కర్ణాటకలో ఉన్నా, వారిపై నిర్దయగా చర్య తీసుకుంటామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఈ కుంభకోణాన్ని బయటపెట్టినదే తామే అని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.  తాము ఎవరినీ వదిలిపెట్టేది లేదని, ఈ కుంభకోణంతో ప్రమేయం ఉన్నవారిని ఎవరినైనా వదులుకోవడానికి సిద్ధమని వెల్లడించారు. ఈ కుంభకోణంలో కాంగ్రెస్ పాత్రను మరుగుపరచేందుకు ఎక్కడాలేనివారి పేర్లను చెప్తోందని బొమ్మై ఆరోపించారు. ఇందులో ప్రమేయం ఉన్న కాంగ్రెస్ వారిని కాపాడుకోవడం కోసం అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

హ్యాకర్ శ్రీకృష్ణను తన ప్రభుత్వం అరెస్టు చేసి, దర్యాప్తు జరుపుతోందని చెప్పారు.  2018లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు ఆయనను వదిలిపెట్టిందని గుర్తు చేశారు. ఈ కుంభకోణం 2016లోనే ప్రారంభమైతే, అప్పటి నుండి 2019 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని బొమ్మై ప్రశ్నించారు. 

కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సుర్జీవాలా చేసిన ఆరోపణలపై బొమ్మయ్ మండిపడుతూ వెంటనే తన వద్ద ఉన్న ఆధారాలను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు గాని, కర్ణాటక పోలీస్ లకు గాని ఇవ్వాలని ఆయన సవాల్ చేశారు. ట్వీట్ లపై ఆధారపడి తగు ఆధారాలు లేకుండా భారీ కుంభకోణం జరిగిన్నట్లు ఆరోపణలు  చేస్తుంటే,అటువంటి వ్యక్తి ఒక జాతీయ పార్టీకి అధికార ప్రతినిధిగా తగదని మాత్రమే చెప్పగలనని సూర్జేవాలాపై బొమ్మై ధ్వజమెత్తారు. 

సుర్జీవాలా శనివారం ఢిల్లీలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, బిట్‌కాయిన్ కుంభకోణం విలువ చాలా ఎక్కువగా ఉండవచ్చుని పేర్కొన్నారు. 2020 డిసెంబరు 1, 2021 ఏప్రిల్ 14 తేదీల్లో జరిగిన చట్టవిరుద్ధ లావాదేవీల విలువ రూ.5,240 కోట్లు అని ఆరోపించారు. 

ఈ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ పాత్ర ఏమిటో చెప్పాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని సవాల్ చేశారు. ఈ కుంభకోణం జరిగిన సమయంలో బొమ్మయ్ కర్ణాటక హోం మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సంగతిని గుర్తు చేశారు. ఇలా ఉండగా, ఈ కుంభకోణంలో కాంగ్రెస్ వారి పేర్లున్నాయని గతవారం బొమ్మై ఆరోపించారు. తమ ప్రభుత్వంపై విమర్శలు చేసేబదులు దీనిలో సంబంధం గల తమ పార్టీ వారి గురించి కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందాలని అంటూ ఆయన ఎద్దేవా చేశారు. 

ఈ కుటంబకోణం గురించి తాము ఏ విషయాన్నీ దాచడం లేదని స్పష్టం చేస్తూ నిరాధార ఆరోపణలు చేసేబదులు ఎక్కడ, ఏ విధంగా నేరం జరిగిందో, ఎవ్వరు చేశారో ఆధారాలు తెలిపే పత్రాలు ఉంటె ప్రభుత్వానికి దర్యాప్తులో సహకరింపమని ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేతలకు హితవు చెప్పారు.