భారత్-మయన్మార్ సరిహద్దులను మూసేస్తాం

భారత్-మయన్మార్ సరిహద్దులను మూసివేసేందుకు కంచె వేసే పనులను వేగవంతం చేస్తామని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ ప్రకటించారు. మయన్మార్‌-మణిపూర్ మధ్య 398 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉందని చెబుతూ ఇతరులు దేశంలోకి చొరబడటానికి అవకాశంగల ప్రాంతాల్లో కంచె నిర్మాణాన్ని ఇప్పటికే ప్రారంభించామని చెప్పారు. 

మయన్మార్ నుంచి ఉగ్రవాదులు మణిపూర్‌లోకి ప్రవేశించి, చురాచంద్‌పూర్ జిల్లాలో అస్సాం రైఫిల్స్‌పై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో గాయపడిన ఆరుగురు  ఇంఫాల్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిని బిరేన్ సింగ్ ఆదివారం పరామర్శించారు. 

ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, భారత్-మయన్మార్ సరిహద్దులను మూసివేసేందుకు కంచె వేసే పనులను వేగవంతం చేస్తామని తెలిపారు. చొరబాటుదారులకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో పటిష్టమైన కంచెను నిర్మించే పనులను వేగవంతం చేస్తామని చెప్పారు.

 ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా సరిహద్దుల్లో కంచెను నిర్మించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని తెలిపారు. 40 కిలోమీటర్ల మేరకు కంచె నిర్మాణ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కొన్ని చోట్ల వివాదాల వల్ల ఈ పనులను ఆపినట్లు తెలిపారు. ఉగ్రవాద చర్యలను మణిపూర్ ప్రభుత్వం సహించబోదని ఆయన హెచ్చరించారు. 

చురాచంద్‌పూర్ జిల్లాలోని సింఘట్ సబ్ డివిజన్లో శనివారం  ఉగ్రవాద దాడి జరిగింది. మణిపూర్ నాగా పీపుల్స్ ఫ్రంట్ జరిపిన ఈ దాడిలో కల్నల్ విప్లవ్ త్రిపాఠీ, ఆయన సతీమణి, వారి కుమారుడు, నలుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మయన్మార్ సరిహద్దులకు 20 కిలోమీటర్ల దూరంలో ఈ దారుణం జరిగింది.