పాఠ్యపుస్తకంలో ఏసు.. స్కూల్ యాజమాన్యంపై కేసు 

విద్యార్థుల పాఠ్యపుస్తకం ద్వారా  ఏసుక్రీస్తు చరిత్ర, బోధనలు పరిచయం చేస్తున్న ఓ ప్రయివేట్ పాఠశాల యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన విజయనగరంలో చోటుచేసుకుంది.
విజయనగరంలోని గురజాడ ఇంగ్లిష్ మీడియం ప్రయివేట్ పాఠశాల యాజమాన్యం  తమ విద్యార్థులకు సిలబస్ గా హైదరాబాద్ కు చెందిన మాతృశ్రీ పబ్లిషర్స్ రూపొందించిన పాఠ్యపుస్తకాలను వినియోగిస్తోంది. 4వ తరగతి విద్యార్థులకు రూపొందించిన తెలుగు పాఠ్యపుస్తకంతో పాటు అనుబంధంగా రూపొందించిన వర్క్ బుక్ లో ఏసుక్రీస్తు జీవిత కథ, బోధనలు ఉండటం  వివాదాస్పదమైంది. ఈ అంశాన్ని పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల ద్వారా తెలుసుకున్న లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ సంస్థ న్యూఢిల్లీలోని జాతీయ బాలల హక్కుల కమిషనుకు ఫిర్యాదు చేసింది.

 

ఇది ఇతర మతాలకు చెందిన మైనర్ బాలబాలికలపై క్రైస్తవ మతపరమైన విశ్వాసాలను నూరిపోస్తూ, వారిని క్రైస్తవం పట్ల ఆకర్షితులను చేసే చర్య అని, ఇటువంటి చర్యలు బాల హక్కులకు విఘాతం అని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ తమ ఫిర్యాదులో పేర్కొంది. దీనికి స్పందించిన జాతీయ బాలల హక్కుల కమిషన్.. ఈ అంశంపై వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా విజయనగరం జిల్లా కలెక్టరుకు నోటీసులు జారీ చేసింది.
కలెక్టర్ తాత్సారం.. కమిషన్ ఆగ్రహం:
లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఫిర్యాదు ఆధారాంగా గురజాడ పాఠశాల విషయంలో చర్యలు తీసుకోవాల్సిందిగా విజయనగరం జిల్లా కలెక్టరుకు రెండుసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ  తొలుత ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై జాతీయ బాలల హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరిసారిగా జారీ చేసిన నోటీసులో  10 రోజుల్లోగా తీసుకున్న చర్యల రిపోర్ట్ తమకు సమర్పించకపోతే తమకున్న విశేష అధికారాలు ఉపయోగించుకుని చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ సెక్షన్ 14 కింద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని కమిషన్ తెలియజేయడంతో విజయనగరం జిల్లా కలెక్టర్ ఈ అంశమై విచారణ ప్రారంభించారు.

 

పాఠశాల సందర్శించిన జిల్లా కలెక్టర్:
జాతీయ బాలల హక్కుల కమిషన్ ఆదేశాల ప్రకారం విచారణలో భాగంగా విజయనగరం జిల్లా కలెక్టర్ గురజాడ ఇంగ్లీష్ మీడియం పాఠశాలను సందర్శించి అక్కడి విద్యార్థులను విచారించారు. లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ తమ ఫిర్యాదులో పేర్కొన్న పాఠ్యపుస్తకాలను పరిశీలించారు.
పాఠశాలపై కేసు నమోదు:
జిల్లా కలెక్టర్ విచారణ అనంతరం మండల విద్యాశాఖ అధికారి ఫిర్యాదుతో విజయనగరం 1వ పట్టణ పోలీసులు గురజాడ ఇంగ్లిష్ మీడియం పాఠశాలపై కేసు నమోదు చేశారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 188 ప్రకారం  ఎఫ్.ఐ. ఆర్ నమోదు చేశారు.

వెంటనే పాఠ్యపుస్తకాలు మార్చండి: పాఠశాలకు కలెక్టర్ ఆదేశాలు:
తాజా ఉదంతంలో.. వెంటనే తమ పాఠ్యపుస్తకాలు మార్చాల్సిందిగా జిల్లా కలెక్టర్ గురజాడ ఇంగ్లిష్ మీడియం పాఠశాలకు  ఆదేశాలు జారీ చేశారు. ఒక మతాన్ని ప్రభిధించే విధంగా ప్రస్తుతం వినియోగంలో ఉన్న పాఠ్యపుస్తకాలు విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 29 కింద ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపారు. అంతేకాకుండా జిల్లాలోని అన్ని ప్రయివేట్ పాఠశాలల పాఠ్యపుస్తకాలు నిర్ధేశిత ప్రమాణాలు కలిగి ఉండే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.