ప్రజలకు సేవ చేసేందుకు వెంకయ్య నిత్యం కృషి

 
ప్రజలకు సేవ చేసేందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నిత్యం కృషి చేస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. కేంద్ర మంత్రి నుంచి ఉపరాష్ట్రపతి వరకు అనేక కీలక పదవులకు ఆయన వన్నె తెచ్చారని అమిత్ షా ప్రశంసించారు. నెల్లూరు జిల్లా, వెంకటాచలంలో స్వర్ణభారత్ ట్రస్ట్ 20వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.
 
నిత్యం ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే వెంకయ్యనాయుడు.. ఎన్నో పదవులకు వన్నె తెచ్చారని ప్రశంసించారు. భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో వెంకయ్య కృషి అనన్యసామాన్యమైనదని, ఎన్నో ఉన్నత స్థాయి చర్చల్లో చురుకుగా పాల్గొన్నారని కితాబిచ్చారు.
 
గతంలో సిఫార్సుల మేరకే పద్మ పురస్కారాలు దక్కగా తమ పాలనలో ప్రతిభ, సేవతోనే పురస్కారాలకు ఎంపికవుతున్నారని ఈ సందర్భంగా అమిత్ షా చెప్పారు. కనీసం కాళ్లకు చెప్పులు లేని అతి సామాన్యులు రాష్ట్రపతి భవన్‌కు వచ్చి పద్మ అవార్డులు స్వీకరిస్తుండటం వారి సేవలకు గుర్తింపు అని కొనియాడారు.
 
 మాతృభాషను, మాతృభూమిని ఏనాడూ మరువొద్దని, తెలుగు భాష పరిరక్షణ కోసం స్వర్ణభారత్ ట్రస్టు ప్రయత్నిస్తున్నదని ఉపరాష్ట్రపతి  చెప్పారు. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చిన వెంకయ్యనాయుడు.. సేవే తన అభిమతమని, సేవే అసలైన మతమని ప్రగాఢంగా విశ్వసిస్తానని చెప్పారు. 
 
సేవా సంస్థలను ప్రోత్సహిస్తారనే నమ్మకంతోనే పలువురిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు తెలిపారు. దేవాలయానికి వెళ్తే ఎంత పుణ్యం వస్తుందో.. అంతే పుణ్యం సేవాలయానికి వెళ్తే దొరుకుతుందని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ యువతే దేశానికి ఆశాకిరణాలని చెప్పిన ఆయన.. యువతకు శిక్షణ ఇచ్చి సొంతకాళ్లపై నిలబడేలా చేయాలని సూచించారు.
 
 గ్రామీణ మహిళలు, దివ్యాంగుల్లోని ప్రతిభను గుర్తించి వారికి శిక్షణ ఇస్తుండటం అభినందనీయమని ఉపరాష్ట్రపతి తెలిపారు. వెంకయ్యనాయుడు చేతుల మీదుగా వెంకటాచలంలో ప్రారంభమైన స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ కార్యకలాపాలను ప్రస్తుతం ఆయన కుమార్తె దీపా వెంకట్‌ చూస్తున్నారు.